అమరావతి, ఆంధ్రప్రభ: రానున్న ఎన్నికల్లో ఎలాగైనా విజయాన్ని సాధించి అధికార పీఠాన్ని దక్కించుకోవాలన్న ధృడమైన సంకల్పంతో పనిచేస్తున్న తెలుగుదేశం, జనసేన పార్టీలు ఉమ్మడిగా ముందుకు సాగాలని నిర్ణయించాయి. ఇప్పటికే రెండు పార్టీల మధ్య సమన్వయానికి జాయింట్ యాక్షన్ కమిటీని కూడా ఏర్పాటు చేసిన ఆ పార్టీల అధినేతలు ఇక ఉమ్మడి కార్యాచరణ, మేనిఫెస్టో, కామన్ మినిమమ్ ప్రో గ్రామ్ రూపకల్పనపై దృష్టి పెట్టారు. టీడీపీ, జనసేన సమన్వ య కమిటీ రాజమండ్రిలో తొలి సమావేశాన్ని నిర్వహించి యాక్షన్ ప్లాన్‌ను రూపొందించింది. ఈ నేపథ్యంలో రెండో సమావేశానికి జనసేన, టీడీపీలు సిద్ధమయ్యాయి. ఈ నెల 9న ఈ సమన్వయ కమిటీ రెండో భేటీ జనగనుంది. ఈ సమావేశా న్ని వాస్తవంగా విజయవాడలో జరపాలని నిర్ణయించినప్పటికీ కొన్ని ఇబ్బందుల నేపథ్యంలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఈ భేటీని నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమా వేశానికి టీడీపీ, జనసేన పార్టీల నుంచి 6గురు సభ్యుల చొప్పున మొత్తం 12 మంది కీలక నేతలు హాజరు కానున్నారు.
ఈ భేటీలో ప్రధానంగా ఉమ్మడి మేనిఫెస్టో, కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ రూపకల్పన, క్షేత్రస్థాయి పోరాటాలు, రెండు పార్టీల మధ్య సమన్వయం, ఓటర్ జాబితాలో అవకతవ కలు, ఓట్ల బదిలీ తదితర అంశాలపై చర్చించనున్నారు. ప్రస్తుతం మధ్యంతర బెయిల్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు జైలు నుంచి బయటకు రావడంతో ఈ సమావేశానికి ప్రాధా న్యతను సంతరించుకుంది. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కల్యాణ్ విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన వెంటనే చంద్ర బాబుతో భేటీ అయి దాదాపు మూడు గంటల పాటు రాజకీయ పరిస్థితులు, ఉమ్మడి మేని ఫెస్టో తదితర అంశాలపై చర్చించారు. ఈ నేపథ్యంలోనే జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశానికి నిర్ణయం తీసుకున్నారు.
ఉమ్మడి మేనిఫెస్టోతో జనంలోకి..
తెలుగుదేశం, జనసేన పార్టీలు ఉమ్మడి మేనిఫెస్టోతో ప్రజ ల్లోకి వెళ్లాలని నిర్ణయించాయి. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ పేరిట ఆరు పథకాలతో మినీ మేనిఫెస్టోను ప్రకటిం చింది. దసరా పండుగ నాడు పూర్తి మేనిఫెస్టోను విడుదల చేయాలని భావించినప్పటికీ అనుకోని పరిస్థితులు టీడీపీ అధినేత చంద్రబాబు జైలుకు వెళ్లడంతో ఇది కాస్త వాయిదా పడింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ జైల్లో చంద్రబాబును కలిసి పొత్తుల ప్రకటన కూడా చేసిన విషయం తెలిసిందే. దీంతో రెండు పార్టీలు ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేయాలన్న ఏకాభిప్రాయానికి వచ్చాయి. టీడీపీ ప్రకటించిన సూపర్ సిక్స్ పాలసీకి జనసేన ఆమోద ముద్ర వేసింది. ఇదే సమయంలో జనసేనాని పవన్ కల్యాణ్ పార్టీకి సంబంధించిన షణ్ముఖ వ్యూహం మేనిఫెస్టోకు సంబం ధించిన ఆరు అంశాలను ప్రతిపాదించారు.
ఈ ఆరు కీలకమైన అంశాలు కావడంతో టీడీపీ అధినేత ఉమ్మడి మేనిఫెస్టోలో పెట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రధా నంగా పారిశ్రామిక రంగ ప్రగతి, ఉద్యోగాల కల్పన, రాజధాని గా అమరావతి కొన సాగింపు, విశాఖ, తిరుపతి, విజయవాడ నగరాలను మహా నగరాలుగా రూపుదిద్దడం, పేదలకు ఉచిత ఇసుక, భవన నిర్మాణ కార్మికులకు చేయూత, సౌభాగ్య పథకం కింద యువ పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహకం. ఉద్యానవన రైతులకు రూ. 5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, ప్రాసెసింగ్ యూనిట్ల ప్రోత్సాహకాలు, మన ఏపీ – మన ఉద్యోగాల పేరిట ఏపీపీఎస్సీ ద్వారా నియామకాలను జనసేన ప్రతిపాదించింది.
ముఖ్యంగా ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలను ఆకట్టుకు నేందుకు సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానంపై హామీ³ నిచ్చేలా మేనిఫెస్టో రూపకల్పనకు జనసేన ప్రతిపాదన చేసింది. ఈ అంశాలన్నిం టిపై జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశమై చర్చించిన అంశాలను అధినేతల దృష్టికి తీసుకువెళ్లనుంది.
త్వరలో ఉమ్మడి విస్తృతస్థాయి సమావేశం
ఇంకోవైపు ఉమ్మడి విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహిం చేందుకు రెండు పార్టీలు ప్లాన్ చేస్తున్నాయి. చంద్రబాబు, పవన్ కల్యాణ్ అధ్యక్షతన ఈ సమావేశాన్ని నిర్వహించేందుకు రెండు పార్టీలు ఏర్పాట్లు చేస్తున్నాయి.
చంద్రబాబు ఆరోగ్యం కుదుట పడ్డాక కంటి శస్త్రచికిత్స పూర్తయి విశ్రాంతి అనంతరం ఈ సమావేశాన్ని జరపాలని భావిస్తున్నారు. అయితే చంద్రబాబు ఈ సమావేశంలో పాల్గొనేందుకు న్యాయ, చట్టపరమైన చిక్కు లతో పాటు ఇతర సాంకేతిక అంశాలు ముడిపడి ఉండటంతో వీటన్నింటిపై న్యాయనిపుణులతో తెలుగుదేశం చర్చలు జరుపు తోంది. ఒకట్రెండు రోజుల్లో న్యాయ సలహా అనంతరం ఈ ఉమ్మడి విస్తృతస్థాయి సమావేశానికి సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయి.