తిరుపతి (రాయలసీమ ప్రభ న్యూస్ బ్యూరో ) : భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని తిరుపతి ప్రాంతంలో ఆహార పదార్ధాల తయారీ నాణ్యత ను నిర్ధారించే ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ ను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ ఆథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఎఐ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గంజి కమలవర్ధన్ ప్రకటించారు. నగరంలోని ఒక ప్రైవేట్ హోటల్ లో ఆధ్వర్యంలో ఈ రోజు జరిగిన ఎఫ్ఎస్ఎస్ఎఐ నిర్వహించిన 41వ సెంట్రల్ అడ్వైజరీ కమిటీ సమావేశాన్ని ఆయన జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఆ సమావేశం లో కమలవర్ధన్ మాట్లాడుతూ ఈ సమావేశ ముఖ్య ఉద్దేశ్యం ఆహార భద్రతను అమలు చేయడం అని, ఈ సెంట్రల్ అడ్వైజరీ కమిటీలో దాదాపు 60 మంది ప్రతినిధులు ఉంటారని, ఈ సమావేశాల నుండి సూచనలు, అభిప్రాయాలను తీసుకుని, ఆహార భద్రతా చట్టం 2006, నియమాలు, నిబంధనలలో నిరంతర ప్రాతిపదికన మార్పులను చేస్తూ ఆహార ప్రమాణాలు అమలు అయ్యేలా వాటిని నిర్థారించి పర్యవేక్షించడం జరుగుతుందని అన్నారు
.
21 సైంటిఫిక్ ప్యానెల్స్ ఏర్పాటుతో సుమారు 200 మంది శాస్త్రవేత్తలు మనిషి తీసుకునే మందులు కాకుండా ఇతర ఆహార పదార్థాల ప్రమాణాలను స్టాండర్దైజ్ చేసి నాణ్యతా ప్రమాణాలను నిర్థారించి వాటిని చట్ట పరిధిలో నియంత్రించి పర్యవేక్షించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత ఎఫ్ఎస్ఎస్ఎఐ పైనే కాక రాష్ట్ర , కేంద్ర పాలిత ప్రాంతాల ఫుడ్ సేఫ్టీ శాఖల యొక్క బాధ్యత అని గుర్తు చేశారు. దేశంలోని అందరు ఫుడ్ సేఫ్టీ కమీషనర్ల పరిధిలోని తినుబండారాలు, ఆహార పదార్థాలు తయారుచేసే, విక్రయించే ఆపరేటర్లు, ఏజెన్సీలు దేశ వ్యాప్తంగా సుమారు 72 నుండి 75 లక్షల ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లు కేంద్ర, రాష్ట్రాలలో లైసెన్సులు పొంది రిజిస్టర్ చేసుకున్నారని తెలిపారు. అలాగే 5 స్టార్ హోటల్ల నుండి చిన్న స్థాయి దుకాణాలలో ఆహార పదార్థాల తయారీ, నిల్వ మరియు సరఫరా అంశాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి నాణ్యతా ప్రమాణాలు అమలు అయ్యేలా ఫుడ్ సేఫ్టీ కమీషనర్లు చూడాలని అన్నారు. నిబంధనల మేరకు నిర్ధారిత ఆహార నాణ్యతా ప్రమాణాలను అమలు చేసి ప్రజల ఆరోగ్యం కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.
ఈ సంవత్సరాన్ని అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో దేశ వ్యాప్తంగా మిల్లెట్ (చిరు దాన్యాలను ) పెద్ద ఎత్తున ప్రోత్సహించడం జరుగుతోందని, ప్రపంచంలోనే మన దేశం 14.5 మిలియన్ టన్నుల మిల్లెట్స్ ఉత్పతితో అగ్ర స్థానంలో ఉందని, 14 రకాల చిరుధాన్యాలను ప్రోత్సహించె చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దేశంలో ప్రస్తుతం ఎఫ్ఎస్ఎస్ఎఐ 246 ల్యాబ్ లు ఉండగా, మరో 100 దాకా మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ లు ఏర్పాటు చేసి పలు రకాల ఆహార పదార్థాల పరీక్షలు అక్కడికక్కడే నిర్వహించేందుకు వీలు కల్పించామని అన్నారు. నిన్న తిరుమల తిరుపతి దేవస్థానాల కార్యనిర్వాహణ అధికారితో సమావేశమైనప్పుడు భక్తులకు అందించే ప్రసాదాల తయారీలో వాడే బియ్యం, నెయ్యి, నూనె, ఇతర పదార్థాలు సేంద్రియ ఉత్పత్తులను వాడుతున్నారని తెలిసినప్పుడు సంతోషం కలిగిందని అన్నారు. ఆ సందర్బంగానే టీ టీ డి ఈ ఓ స్థానికంగా ఒక శాశ్వత ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటు చేసి, సిబ్బందికి శిక్షణ ఇచ్చే వ్యవస్థ ఉంటే బాగుంటుందని సూచించారని తెలిపారు. తిరుపతి ప్రాంతంలో శాశ్వతం గా ఒక ఫుడ్ సేఫ్టీ ల్యాబ్ ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషనర్ శ్రీనివాస్ స్వాగతోపన్యాసం చేయగా సాయంత్రం వరకు కొనసాగిన సమావేశాలలో ఎఫ్ఎస్ఎస్ఎఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇనోషి శర్మ, క్వాలిటీ అండ్ అస్యూరెన్స్ విభాగం సలహాదారు సత్యన్ కుమార్ పాండా, వివిధ రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల ఫుడ్ సేఫ్టీ ప్రధాన కార్యదర్శులు, కమిషనర్లు,సంబంధిత రంగ నిపుణులు, అధికారులు పాల్గొన్నారు