Sunday, November 17, 2024

Nandyala: ఫుడ్‌ పాయిజన్‌.. 100 మంది విద్యార్థులకు అస్వస్థత

20 మంది విద్యార్థులకు వాంతులు విరోచనాలు…
కలెక్టర్ ఆగ్రహం..
హుటా హుటిన ఆర్డిఓ విద్యాశాఖ అధికారులు విచారణ…
ఫుడ్ పాయిజన్ జరిగింది…, ఆర్డిఓ..
జరిగిన విషయం తల్లిదండ్రులకు చెప్పకపోవడంతో ఆందోళన..

నంద్యాల బ్యూరో, ప్రభ న్యూస్, ఆగస్టు 3 : నంద్యాల జిల్లా శివారులో ఉన్న శనివారపు దస్తగిరి రెడ్డి (ఎస్ డి ఆర్) స్కూల్ నందు ఫుడ్ పాయిజన్ జరిగి విద్యార్థులు అస్వ‌స్థ‌త‌కు గురైన సంఘటన చోటుచేసుకుంది. వైసీపీ నాయకుడికి చెందిన ఆ ప్రాంగణంలో పాఠశాలతో పాటు కళాశాల కూడా నిర్వహిస్తున్నారు. కళాశాల యాజమాన్యంలో ఒకరి పుట్టినరోజు సందర్భంగా వేడుకలు రాత్రి నిర్వహించారు. అనంతరం ఆహారం తిన్న విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కావటంతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఫుడ్ పాయిజన్ విషయాన్ని గుట్టు చప్పుడు కాకుండా కళాశాల యాజమాన్యం ఉంచటం విశేషం.

ఎవరికీ తెలియకుండా నంద్యాలకు చెందిన ఇద్దరు ప్రముఖ ఆసుపత్రుల వైద్యంతో పాఠశాలలోనే విద్యార్థులకు చికిత్స అందించినట్లు తెలుస్తోంది. వైద్యులను స్కూల్ కు పిలిపించుకుని గుట్టు చప్పుడు కాకుండా మీడియా మిత్రులకు కూడా చెప్పకుండా వైద్యం ఇప్పించిన సమాచారం బయటకి లీక్ అయ్యింది. విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా విషయం తెలపక పోవడంతో వారు ఆందోళన వ్యక్తం చేసిన సంఘటన జరిగింది. లక్షల రూపాయల ఫీజులు తీసుకొని విద్యార్థులకు ఏం జరిగినా తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకపోవడంతో విద్యార్థి సంఘాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

విషయం జిల్లా కలెక్టర్ రాజకుమారికి తెలియడంతో విద్యాశాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే విద్యార్థులకు వైద్యం అందించి ఏం జరిగిందో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అధికారులు హడావుడిగా సంఘటన జరిగిన పాఠశాల ప్రాంగణానికి వెళ్లారు. నంద్యాల ఆర్డీఓ మల్లికార్జునరెడ్డి ఎంఈఓ బ్రహ్మం తో పాటు వీఆర్వో ఏఎన్ఎంలు పాఠశాలకు వెళ్లారు. అక్కడ జరిగిన సంఘటన దృష్టిలో ఉంచుకుని విద్యార్థులని అడిగి వివరాలను తెలుసుకున్నారు. ఆ పాఠశాల విద్యార్థులు రాత్రి అన్నం తిన్న తర్వాత 20మంది విద్యార్థులు వాంతులు విరేచనాలు చేసుకున్న మాట వాస్తవమేన‌ని ఆర్డీఓ మల్లికార్జున్ రెడ్డి విలేకరులకు తెలిపారు.

- Advertisement -

ఆయన మాట్లాడుతూ… పుట్టినరోజు వేడుకలు ఆ పాఠశాలలో జరిగాయని సుమారు 100 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అందులో అన్నం తిన్న విద్యార్థులు వాంతులు విరేచనాలు చేసుకున్న మాట వాస్తవమని, 20 మంది విద్యార్థులకు సెలైన్ బాటిల్లు ఎక్కించి ప్రథమ చికిత్స చేశారని తెలిపారు. ప్రస్తుతం విద్యార్థులతో మాట్లాడాలని వారందరూ ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. కొంతమంది విద్యార్థులు తల్లిదండ్రులకు సంఘటన తెలిసినా బయటకు చెప్పవద్దని యాజమాన్యం ప్రాధేయ పడినట్టు తెలుస్తోం. పాఠశాల యాజమాన్యం పోలీసులకు, అధికారులకు సమాచారం ఇవ్వకుండా దాచి పెట్టడంలో ఆంతర్యమేమిటని, విద్యార్థులకు ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ ఘటన జరిగింది వాస్తమేనని విచారణ చేసిన అధికారులు పేర్కొనడంతో నివేదికను జిల్లా కలెక్టర్ కు పంపించినట్లు ఆర్డీవో మల్లికార్జున్ రెడ్డి తెలిపారు. జిల్లాలోని హాస్టళ్లలోనూ ఆకస్మిక తనిఖీలు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించినట్లు పేర్కొన్నారు. మరుగుదొడ్లను, స్థానపు గదులను విద్యార్థులు అసౌకర్యంగా ఉంటే చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement