అమరావతి,ఆంధ్రప్రభ: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌ని అనుమానాస్పద వ్యక్తులు ఈ మధ్య ఎక్కువగా అనుసరిస్తున్నారని జనసేన పార్టీ తెలిపింది. ముఖ్యంగా విశాఖ సంఘటన తరువాత పవన్ కళ్యాణ్ ఇల్లు, పార్టీ కార్యాలయం దగ్గర సందేహాస్పదంగా ఉన్న వ్యక్తులు తచ్చాడుతున్నారని, పవన్ కళ్యాణ్ ఇంటి నుంచి బయటకు వెళుతున్నప్పుడు, తిరిగి వస్తున్నప్పుడు ఆయన వాహనాన్ని అనుసరిస్తున్నారని వెల్లడించింది. ఈ మేరకు ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పత్రికా ప్రకటన విడుదల చేశారు. కారులో వెంబడిస్తున్న వ్యక్తులు పవన్ కళ్యాణ్ వాహనాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారని, అనుసరిస్తున్న వారు అభిమానులు ఎంత మాత్రం కాదని పవన్ కళ్యాణ్ వ్యక్తిగత రక్షణ సిబ్బంది చెబుతున్నారని తెలిపారు.
వారి కదలికలు అనుమానించే విధంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం కారులోనూ, మంగళవారం నాడు ద్విచక్రవాహనాలపై అనుసరించారని చెప్పారు. కాగా సోమవారం అర్ధరాత్రి ముగ్గురు వ్యక్తులు పవన్ కళ్యాణ్ ఇంటి వద్దకు వచ్చి గొడవ చేశారని, ఇంటికి ఎదురుగా వారు కారు ఆపారని, సెక్యూరిటీ- సిబ్బంది నివారించబోగా బూతులు తిడుతూ, పవన్ కళ్యాణ్‌ని దుర్భాషలాడుతూ గొడవ చేశారని, సిబ్బందిని కవ్వించి రెచ్చగొట్టడానికి ప్రయత్నించారని చెప్పారు. ఆయినా సంయమనం పాటించిన సిబ్బంది.. ఈ సంఘటనను వీడియో తీసి జనసేన తెలంగాణ ఇంచార్జి శంకర్ గౌడ్‌కి అందించగా ఆయన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో బుధవారం పిర్యాదు చేశారని ప్రకటనలో పేర్కొన్నారు.