తిరుమల , ప్రభన్యూస్ : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 5 వరకు అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని, కరోనా కారణంగా రెండేళ్ళ తరువాత మాడవీధుల్లో వాహన సేలవలు నిర్వహించి భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తామని ‘టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. బ్రహ్మోత్సవాల తొలిరోజు ధ్వజారోహణం సందర్భంగా రాష్ట్రప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి శ్రీవారికి పట్టు వస్త్రాలను సమర్పిస్తారని, అక్టోబర్ 1న గరుడ సేవ జరగనుందని చెప్పారు. సోమవారం టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన టీటీడీ పాలకమండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఇలా ఉన్నాయి. ఆగస్టు 16 నుంచి 20వరకు నెల్లూరులో శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాలు నిర్వహించనున్నారు తిరుమల శ్రీవారి దర్శనార్ధం వచ్చే భక్తులకు ఎలాంటి టోకెన్లు లేకుండా నేరుగా దర్శనానికి పంపేవిధానం కొనసాగుతుందని,. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా దర్శనం చేయించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.
అలాగే తిరుపతిలో సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్ల కౌంటర్ల ఏర్పాటుకు సంబంధించి సమగ్రంగా అధ్యయనం చేయాలని అధికారులకు ఆదేశించామని, అదేవిధంగా రూ.154.50 కోట్ల వ్యయంతో తిరుపతిలో శ్రీపద్మావతి పీడీయాట్రిక్ సూపర్ స్పెషాలిటి నిర్మాణానికి టెండర్లు ఆమోదం. రూ.2.07 కోట్లతో తిరుమల పార్వేట మండపం స్థానంలో నూతన మండపం నిర్మాణానికి టెండర్లకు ఆమోదం. ఇక తిరుమలలో ఆక్టోపట్ బేస్ క్యాంపులో మిగిలి ఉన్న పనులను రూ. 7 కోట్లతో పూర్తి చేయాలని, రూ.7.32 కోట్లతో ఎస్వి గోశాలలో 10 నెలల కాలానికి గాను పశువుల దానా కొనుగోలుకు పాలకమండలి ఆమోదం తెలిపిందని చైర్మన్ తెలిపారు. రూ.2.90 కోట్లతో అమరావతిలో శ్రీవారి ఆలయం వద్ద పూలతోటల పెంపకం, పచ్చదనాన్ని పెంపొందించేందుకు,. రూ.198.75 లక్షలతో తిరుమలలోని భేడి ఆంజనేయస్వామివారి మూలమూర్తికి రాగి కవచాల పై బంగారు తాపడం పనులు చేపట్టేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు, తిరుమలలో ఎస్వీ ప్రాధమిక పాఠశాల, ఎస్వీ ఉన్నత పాఠశాల అభివృద్దికి ముంబైకి చెందిన సింఘానియా ఎడ్యుకేషన్ ట్రస్టు ముందుకొచ్చింది. ఇక్కడున్న 638 మంది విద్యార్దులకు, ఉపాధ్యాయులకు నైపుణ్యాభివృద్ది శిక్షణతో పాటు మౌళిక సదుపాయాలు కల్పించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాం.
ఇక 2023 సంవత్సరానికి సంబందించి 8 రకాల క్యాలెండర్లు, డైరీలు మొత్తం కలిపి 33 లత్రక్షల ప్రతులు ముద్రించాలని నిర్ణయం. సప్తగిరి మాస పత్రికను ఐదు భాషల్లో నెలకు 2.10 లక్షల కాపీలు ముద్రించేందుకు ఆమోదం. చెన్నైకి చెందిన డాక్టర్ పర్వతం అనే భక్తురాలు తిరువాన్వయూర్, ఉత్తాండి ప్రాంతాల్లో రూ.6 కోట్లు విలువచేసే రెండు ఇళ్ళను శ్రీవారికి కానుకగా అందించాలని ముందుకు రాగా వాటిని స్వీకరించేందుకు పాలకమండలి ఆమోదం తెలిపిందన్నారు. అమెరికాకు చెందిన డాక్టర్ రామనాథం గుహ బెెంగుళూరులోని డాలర్స్ కాలనీలో ఉన్న 3.23 కోట్లు విలువచేసే అపార్ట్ మెంట్‌ను స్వామివారికి విరాళంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. ఈ విరాళాన్ని స్వీకరించడానికి ఆమోదం. రూ. 4.42 కోట్లతో స్విమ్స్‌లో రోగులు, డాక్టర్ల, ఇతర అన్ని వివరాలను నిక్షిప్తంచేసేలా ఐటి ఇన్‌ఫ్రాస్ట్రక్ష్చర్ ఏర్పాటుకు టెండర్లకు ఆమోదం. తిరుమల బూందీపోటు అధునీకరణ కోసం ఆస్ట్రోలిలా, స్విట్టర్ల్యాండ్కు చెందిన సంస్థలు ప్రతిపాదించిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పై అధ్యయనం చేయాలని అధికారులకు ఆదేశం. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు మార్క్‌ఫెడ్ ద్వారా 12 రకాల ఉత్పత్తుల కొనుగోలుకు నిర్ణయం. ధరల ఖరారుకు మార్క్‌ఫెడ్ అధికారులతో అవగాహన కుదుర్చుకున్నాం. అదేవిధంగా తిరుమల శ్రీవారి ఆనందనిలయం బంగారు తాపడం పనుల పై ఆగమపండితులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. ఈ సమావేశంలో టిటిడి ఈవో ఏవి.ధర్మారెడ్డి, దేవాదాయశాఖ కమీషనర్ హరిజవహర్‌లాల్, బోర్డు సభ్యులు ఇతర అధికారులు పాల్గొన్నారు.