అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న పంచాయతీ సర్పంచ్‌లు, వార్డు మెంబర్ల ఎన్నికకు ఎస్‌ఈసీ ఆదివారం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నెల 19వ తేదీన ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు ఎన్నికల పోలింగ్‌ను నిర్వహించనున్నట్లు వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా 484 మండలాల్లో 1033 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ ఇచ్చింది. మొత్తం 66 సర్పంచ్ స్థానాలతో పాటు 1064 వార్డు మెంబర్ల ఎన్నికను నిర్వహించనున్నట్లు వెల్లడించింది.
ఈ నెల 8వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని అలాగే నామినేషన్ల ఉపసంహరణ గడువు 14వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ముగుస్తుందని నోటిఫికేషన్‌లో పేర్కొంది. 19వ తేదీనే ఎన్నికలు నిర్వహించడంతో పాటు అదే రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి కౌంటింగ్ కూడా జరుగుతుందని ఎస్‌ఈసీ స్పష్టం చేసింది. ఎక్కడైనా ఎన్నికలు నిలిచినట్లయితే ఈ నెల 20వ తేదీన రీ పోలింగ్ నిర్వహిస్తామని ఈ ప్రక్రియ యథావిధిగా ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సాగుతుందని ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌లో పేర్కొంది.