అమరావతి, ఆంధ్రప్రభ: విద్యుత్ ప్రమాదాల నివారణకు అన్ని స్థాయిల్లో కట్టు-దిట్టమైన భద్రతా వ్యవస్థను రూపొందించాలని విద్యుత్ సంస్థలను ప్రభుత్వం ఆదేశించింది. అభివృద్ధి చెందిన దేశాల్లో ఉన్న విద్యుత్ భద్రతా వ్యవస్థలను అధ్యయనం చేసి, తగిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించి, సమర్పించాలని స్పష్టం చేసింది. అలాగే విద్యుత్ ప్రమాదాల నివారణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పెద్దఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని కూడా సూచించింది. ఇటీ-వల చోటు చేసుకున్న ప్రమాదాల నేపథ్యంలో రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విద్యుత్ ప్రమాదాల నివారణపై అధికారులతో ఆదివారం మరోసారి టెలీకాన్ఫెరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో సాధ్యమైనంత మేర విద్యుత్ ప్రమాదాలను నివారించే వ్యవస్థను రూపొందించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు.
ఇది విద్యుత్ సంస్థల ప్రాథమిక బాధ్యతని, ఇందుకోసం అభివృద్ధి చెందిన దేశాల్లో ఉన్న విద్యుత్ భద్రతా వ్యవస్థలను అధ్యయనం చేయాలని మంత్రి సూచించారు. వీటి ఆధారంగా స్థానిక అవసరాలకు తగినట్లు- కట్టు-దిట్టమైన భద్రతా వ్యవస్థను రూపొందించాలని ఆయన ఆదేశించారు. దీనిలో ప్రజలను కూడా భాగస్వాములను చేయాల్సిన అవసరముందన్నారు. తద్వారా విద్యుత్ ప్రమాదాలపై ప్రజల్లో పెద్దఎత్తున అవగాహన కలిగించవచ్చన్నారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ సబ్ స్టేషన్ల కమిటీ- సమావేశాలు నిర్వహించాలన్నారు. ఆ సమావేశాల్లో విద్యుత్ ప్రమాదాల నుంచి రక్షణకు సంబందించిన అంశాలను చర్చించాలని సూచించారు. ఈ కమిటీ-ల సహకారంతో గ్రామాల వారీగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు సమావేశాలు నిర్వహించాలన్నారు.