అమరావతి, ఆంధ్రప్రభ: వీర మహిళలు, జనసైనికులు, నాయకులు సాధ్యమైనంత వరకూ ప్రజల్లో ఉంటూ, ప్రజా సమస్యలపై దృష్టి పెట్టి అవి పరిష్కారం అయ్యేలా పని చెయ్యాలని జనసేన పార్టీ పీఏసీ సభ్యులు కొణిదెల నాగబాబు స్పష్టం చేశారు. బుధవారం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన నాయకులు, జనసైనికులు, వీరమహిళలతో నాగబాబు మాట్లాడారు. స్థానికంగా, సామాజికంగా పలు సమస్యలు నాగబాబు దృష్టికి తీసుకురాగా ఆయన స్పందిస్తూ.. జనసైనికులుగా మనమంతా పార్టీ బలోపేతం కోసం, పార్టీ గెలుపు కోసం పని చేయాలని సూచించారు.
మన లక్ష్య సాధన దిశ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చెదరనివ్వకూడదని చెప్పారు. చాలా ఇబ్బందులను, అన్ని అవరోధాలను దాటు-కొని మనం ఈ స్థితికి వచ్చామని, మున్ముందు ఇంకెన్ని ఇబ్బందులు ఎదురైనా అలసిపోని గుండె ధైర్యంతో పని చేయాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ భావజాలం మన ఆయుధమని, జనసేన గెలుపు కోసం రానున్న ఎన్నికల సంగ్రామంపై దృష్టి పెట్టాలని కోరారు. పొత్తులు, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక, కమిటీ-ల నియామకం గురించి పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ చూసుకుంటారని, పీఏసీ సభ్యులు, పార్టీలో వివిధ హోదాల్లో ఉన్న నాయకులతో, జిల్లా, రాష్ట్ర స్థాయి నేతలతో చర్చించి మనందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయంతీసుకుంటారని వివరించారు.
ప్రతి నియోజకవర్గంలో, ప్రతి పోలింగ్ కేంద్రాల్లో, ప్రతి బ్యాలెట్ బాక్సులో జనసేనకు ఓటు వేయించాల్సిన బాధ్యతను జనసైనికులుగా మనం తీసుకోవాలని, స్థానికంగా ఎక్కడికక్కడ ప్రజా సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారం కోసం పని చేసి తద్వారా వారి అభినందనలు ఓటు రూపంలో బ్యాలెట్ బాక్సులో వేయించుకోగలగాలని తెలిపారు. జనసేన పార్టీకి రాజ్యాధికారం కట్టబెట్టాల్సిన ఆవశ్యకతను ప్రజలకు వివరించాలని, పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి అయితే పరిపాలనలో చోటు చేసుకునే విప్లవాత్మకమైన మార్పులను ప్రతి పౌరుడికి విడమరచి తెలియజేయాలని నాగబాబు స్పష్టం చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.