కాల్వలు పూడికలు, తుప్పలు,
తూటికాడలతో ఉన్నాయి
వాటిని తొలగిస్తేనే చివరి భూములకు నీళ్లు
ఇరిగేషన్ శాఖ అధికారులకు పవన్ లేఖ
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కాలువల నిర్వహణ పనులపై గత అయిదేళ్లుగా దృష్టి పెట్టలేదని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో విమర్శించారు. సాగునీటి అవసరాలు తీర్చే కాలువలు, వాటికి సంబంధించిన డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థలకు అవసరమైన నిర్వహణ, మరమ్మతులు వేసవి సమయంలో చేపట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎన్నికల హడావిడి ముగిసిన తరుణంలో- మధ్యంతర ప్రభుత్వం ఈ అంశంపై జల వనరుల శాఖతో సమీక్షించాలని కోరారు.
ప్రభుత్వ అధికారులు కాలువలకు సంబంధించిన నిర్వహణ పనులపై దృష్టి సారించాలని పవన్ అన్నారు. రాష్ట్రంలో ఏ పంట కాలువ చూసినా పూడిక చేరిపోయి, తుప్పలు, తూటి కాడలు పెరిగిపోయి ఉన్నాయని చెప్పారు. కాలువలకు నీరు వదిలినా ప్రవాహం ముందుకు వెళ్ళే పరిస్థితి లేదని వివరించారు. దీంతో చివరి ఆయకట్టుకు నీరు అందటం లేదన్నారు.
గత ఏడాది పశ్చిమ కృష్ణా డెల్టాలో పంటలు ఎండిపోవడానికి కారణం కాలువల నిర్వహణ సరిగా లేకపోవడం కూడా ఓ కారణమన్నారు పవన్ కల్యాణ్. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా రైతాంగం నుంచి ఈ సమస్యపైనే ఎక్కువ విజ్ఞాపనలు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. జలవనరుల శాఖ యుద్ధ ప్రాతిపదికన కాలువలకీ, లాకులకు మరమ్మతులు ఈ వేసవి ముగిసేలోగా పూర్తి చేయాలన్నారు.. రుతు పవనాలు ప్రవేశించేలోగా పనులు పూర్తయితేనే రైతాంగానికి మేలు జరుగుతుందని జనసేనాని ఆశాభావం వ్యక్తం చేశారు..
ఏపీలో కూటమిదే విజయం..
ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో ఎన్టీయే కూటమి విజయం సాధించడం తథ్యమని జనసేనాని పవన్ కల్యాణ్ చెప్పారు.. ఈ ఎన్నికల్లో ఓటర్లు తీర్పు స్పష్టంగా ఇచ్చారన్నారు. ప్రధాని మోదీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వారణాసి వెల్లిన పవన్ ఆక్కడ నేడు మీడియాతో మాట్లాడుతూ…. భారీ మెజార్టీతో ఎన్టీయే కూటమి రాష్ట్రంలో గెలవబోతోందని ధీమా వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సుపరిపాలన అందించేలా పాలన రాబోతోందన్నారు. ‘‘ప్రధాని మోదీ గారిపై అపార గౌరవంతో ఆయన ముచ్చటగా మూడోసారి ప్రధాని కావాలనే సంకల్పంతో ఆయనకు మద్దతు తెలియజేసేందుకు వచ్చాను. మోదీ పాలనలో దేశం అన్ని రంగాల్లోనూ దూసుకువెళ్తోంది. దేశ అభ్యున్నతికి ఈ కీలక సమయంలో దేశ ప్రజలంతా తోడుగా ఉంటారని భావిస్తున్నాను. రాష్ట్రంలోనూ ఎన్టీయే కూటమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురోగమనానికి తగిన విధంగా పని చేస్తుంది. ప్రజాపాలనతో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో విజేతగా నిలుపుతాం’’ అన్నారు.