అమరావతి, ఆంధ్రప్రభ: ప్రభుత్వానికి ప్రచారం చేసుకోవడంపై ఉన్న శ్రద్ద ప్రజా సమస్యల పరిష్కారంపై లేదని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. బుధవారం మీడియా విడుదల చేసిన ఒక ప్రకటనలో ప్రజాస్వామ్యంలో అత్యంత ముఖ్యమైనవి సమసమాజ, నవసమాజ స్ధాపనలు అని వీటి గురించి ముఖ్యమంత్రి జగన్ ఏ మాత్రం పట్టించుకోవటం లేదని విమర్శించారు. వైకాపా నేతలు ముఖ్యమంత్రి సామాజిక న్యాయంపై చెబుతున్న మాటలు నేతి బీరకాయలో నెయ్యి చందంగా ఉన్నాయని మండిపడ్డారు.
సామాజిక న్యాయం కన్నా ఈ ప్రభుత్వం చేసిన అన్యాయమే ఎక్కువగా ఉందని ధ్వజమెత్తారు. పేద, మద్యతరగతి వర్గాలకు ఏ మాత్రం న్యాయం జరగలేదని, అమ్మ ఒడి, విద్యా దీవెన, రైతు భరోసా ఇలా ప్రతీ పథకంలో కోతలు పెడుతున్నారని ఆరోపించారు. నిబంధనల పేరిట లక్షలాది మందికి సంక్షేమ పథకాలను తొలగించారని యనమల పేర్కొన్నారు. మరో వైపు దళితులు, గిరిజనులు బీసీ వర్గాలపై దాడులు, హత్యలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ది ఉన్నా సంక్షేమంలో పెట్టిన కోతలపై శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని యనమల రామకృష్ణుడు సవాల్ విసిరారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.