తిరుపతి రూరల్: తిరుచానూరు పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన గురువారం ముత్యాలు, మొక్కజొన్న, గుమ్మడి గింజల మాలలతో స్నపనతిరుమంజనం (పవిత్రస్నానం) శోభాయమానంగా జరిగింది. మధ్యాహ్నం 12.30 గంటల నుండి 2.30 వరకు ఆలయంలోని శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో ప్రత్యేకంగా ఫల పుష్పాలతో రూపొందించిన మండపంలో పాంచరాత్ర ఆగమశాస్త్రబద్ధంగా కార్యక్రమం నిర్వహించారు.
పాంచరాత్ర ఆగమసలహాదారు, కంకణభట్టార్ శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఇందులో ముందుగా విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, నవకలశాభిషేకం, రాజోపచారం నిర్వహించారు. అనంతరం పలు సాంప్రదాయక కార్యక్రమాలతో స్నపనం నిర్వహించారు. ఈ వేడుకలో ఒకో క్రతువులో ఒక మాల వంతున మొత్తం ఏడు రకాల మాలలను అమ్మవారికి అలంకరించారు.
ఇందులో ముత్యాలు, మొక్కజొన్న, గుమ్మడి గింజలు, తామరపూల గింజలు, అత్తి ఫలం, రోజాలు, ముత్యాల రోజాలు, తులసి మాలలు, కిరీటాలు, గొడుగులు అమ్మవారికి అలంకరించారు. కార్యక్రమంలో మంత్రి వేణుగోపాలకృష్ణ, ఆలయ డిప్యూటీ ఈవో కస్తూరిబాయి, ఉద్యానవన విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్, ఏఈవో ప్రభాకర్‌రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్బుక్, ట్విట్టర్ పేజీలను ఫాలో అవ్వండి..