Thursday, September 12, 2024

Floods Status – వ‌ర‌ద గుప్పిట్లో గోదావ‌రి జిల్లాలు … ద‌వ‌ళేశ్వ‌రం వ‌ద్ద వ‌ర‌ద ఉదృతి..

అంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – అమ‌రావ‌తి – ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రాజమహేంద్రవరం వద్ద గోదావరి ఉద్ధృతి పెరిగింది. ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజ్‌ వద్ద నీటిమట్టం 10.8 అడుగులకు చేరుకుంది. దీంతో సముద్రంలోకి 3.50 లక్షల క్యూసెక్కులకు పైగా నీటిని విడుదల చేస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం, రాజానగరం, అనపర్తి, మండపేట, కొత్తపేట, పి.గన్నవరం, అమలాపురం నియోజకవర్గాల్లో వర్షం కురుస్తోంది. దీంతో అక్కడి 7 వేల ఎకరాల్లోని పొలాలు నీటమునిగాయి.

కొట్టుకుపోయిన ర‌హ‌దారి

కోనసీమ జిల్లా బూరుగులంక వద్ద గోదావరిలో తాత్కాలిక రహదారి కొట్టుకుపోయింది. దేవీపట్నం మండలం గండిపోశమ్మ ఆలయాన్ని వరద ముంచెత్తింది. దీంతో ఆలయాన్ని మూసివేశారు. విలీన మండలాల్లోనూ వాగులు పొంగుతున్నాయి. వరరామచంద్రాపురం మండలంలో అన్నవరం వాగు పొంగుతోంది. దీంతో చింతూరు-వరరామచంద్రాపురం మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చింతూరు వద్ద శబరి వరద అంతకంతకు పెరుగుతోంది. కోనసీమలోని రాజోలు, ముమ్మిడివరం నియోజకవర్గాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి.

- Advertisement -

ఏజెన్సీ ప్రాంతాలు అత‌లాకుత‌లం

అల్లూరి జిల్లాలో భారీ వర్షాలకు కొండ వాగులు పొంగుతున్నాయి. పాడేరు మండలం రాయగడ్డ, పరదానిపుట్టు వద్ద మత్స్యగెడ్డ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. జి.మాడుగుల మండలం కుంబిడిసింగి బ్రిడ్జిపై వరద ప్రవాహంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పెదబయలు మండలం గిన్నెలకోట, జామిగూడలో గెడ్డలు పొంగాయి. ముంచంగిపుట్టు మండలం బిరిగూడ గెడ్డ పొంగి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అరకు నియోజకవర్గం వ్యాప్తంగా భారీవర్షాలు కురుస్తున్నాయి. డుంబ్రిగూడ మండలం బొందగూడ వద్ద కాజ్‌వేపై వర్షపు నీరు ప్రవహిస్తోంది. అల్లూరి జిల్లాలో అన్ని విద్యాసంస్థలకు నేడు, రేపు కలెక్టర్‌ సెలవు ప్రకటించారు.

విశాఖ జిల్ల‌లోనూ కుంభ‌వృష్టి ..

ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. జ్ఞానాపురం పాత వంతెన వద్ద నీరు నిలిచింది. విశాఖ ఆర్‌అండ్‌బీ నుంచి బిర్లా వరకు సర్వీసు రోడ్డుపై వరద నీరు నిలిచింది. అన్ని విద్యాసంస్థలకు జిల్లా కలెక్టర్‌ సెలవు ప్రకటించారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో ఏకధాటిగా వర్షం కురుస్తోంది. తాండవ, వరాహ నదుల్లోకి వరద వచ్చి చేరుతోంది రైవాడ, కొనాం జలాశయాల్లోకి భారీగా వరద చేరుతోంది. అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ విజయ ఆదేశాలు జారీ చేశారు. ఆర్డీవో, తహసీల్దార్‌ కార్యాలయాల్లో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేశారు. కల్యాణపులోవ రిజర్వాయర్‌లోకి భారీగా వరద వచ్చి చేరుతోంది. గేట్లు ఎత్తి నీటిని సర్పా నదిలోకి విడుదల చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

జ‌ల‌దిగ్బంధంలో మ‌న్యం గ్రామాలు…

ఏడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ఏలూరు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతం వణికి పోతోంది. ఏలూరు జిల్లాలోని మన్యం గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. దీంతో ఏజెన్సీ ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అలివేరు, జల్లేరు, బైనేరు వాగు, అశ్వారావుపేట, పడమటి వాగులు పొంగుతున్నాయి. సుమారు 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి నీటిమట్టం భారీగా పెరిగింది.


వరద నీరు రహదారుల పైకి రావడంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. పోలవరం వద్ద గోదావరి వరద ఉధృతి 29 మీటర్లకు చేరుకుంది. ఎగువ నుంచి భారీగా వరద నీరు ప్రవహిస్తూ ఉండడంతో ప్రాజెక్టు 48 గేట్ల నుంచి మూడున్నర లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. జంగారెడ్డిగూడెం ఎర్రకాలువ జలాశయానికి భారీగా వరద నీరు చేరడంతో ముందస్తు చర్యల్లో భాగంగా ప్రాజెక్టు నాలుగు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో జంగారెడ్డిగూడెం నల్లజర్ల తాడేపల్లిగూడెం నిడదవోలు ప్రాంతాల్లోని పంట పొలాలు నీటిమునగనున్నాయి. జల్లేరు తమ్మిలేరు జలాశయాలకు సైతం వరద నీరుకి ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతోంది.

ఇక ఏజెన్సీ ప్రాంతంలోని గుబ్బల మంగమ్మ ఆలయం సమీపంలో కొండ వాగులు పొంగడంతో పలువురు భక్తులు ఆలయంలో చిక్కుకుపోయారు. వారిని ఆలయ సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఏలూరు జిల్లాలోని ముంపు మండలాలైన వేలేరుపాడు కుక్కునూరు ప్రాంతాల్లో రహదారులపై నీరు చేరడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

చంద్రబాబు సమీక్ష

మరోవైపు.. ఏలూరు జిల్లాలో భారీ వర్షాలు, వరద తీవ్రతపై అర్ధరాత్రి సమీక్ష నిర్వహించారు సీఎం చంద్రబాబు .. ఏలూరు జిల్లా కలెక్టర్, ఎస్పీలతో లేట్ నైట్ టెలీ కాన్ఫరెన్స్ ద్వారా రివ్యూ చేశారు.. వరద పరిస్థితిని పూర్తి స్థాయిలో పర్యవేక్షించాలని ఆదేశించారు.. ప్రాణ నష్టం, పశు నష్టం జరగకుండా చూడాలని సూచించిన ఆయన.. సాధ్యమైనంత వరకు పంట నష్టాన్ని నివారించే చర్యలు తీసుకోవాలన్నారు.. ఏలూరు జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండి, అవసరంలో ఉన్న వారికి సాయం చేయాలన్నారు చంద్రబాబు ..

బంగాళాఖాతంలో అల్ప‌పీడ‌నం … రెండు రోజుల పాటు వ‌ర్షాలు

వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం 2-3 రోజుల్లో మరింత బలపడి ఒడిశా తీరం వైపు కదిలే అవకాశం ఉందని.. దీని ప్రభావంతో రేపు ప్రకాశం జిల్లా, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ భారీవర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది..
ఇక, శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని.. ఇక, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

అలాగే విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ.. ఇక, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.. ఈ సమయంలో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.. ప్రజలు వరద ప్రవహించే వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని సూచించింది.. ఇక, వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉంది.. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్లు కింద ఉండరాదు అని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వార్నింగ్ ఇచ్చింది.

తెలంగాణ అంత‌టా భారీ వ‌ర్షాలు

తెలంగాణ‌లోనూ రెండు రోజుల భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి రెడ్ అలెర్ట్ జారీ చేసింది. దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అలర్ట్ చేసింది. రెడ్ అలెర్ట్ ఇచ్చిన జిల్లాలకు అతి భారీ నుంచి అత్యంత భారీ వర్ష సూచించింది. మధ్య బంగాళాఖాతం వరకు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో రుతుపవన ద్రోణి కొనసాగుతోంది. గాలి వ్యాప్తి 20 డిగ్రీల ఉత్తర అక్షాంశం ద్వారా సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ. ఎత్తు నుండి 5.8 కి.మీ మధ్యలో కొనసాగుతుంది. దీంతో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో రెండు మూడు రోజుల్లో అతి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

దీని ప్రభావంతో తెలంగాణలో ఉరుములు, మెరుపులతో గంటకు 30 నుంచి 40 కి.మీ. మీ ప్రకారం, అప్పుడప్పుడు గంటకు 50 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ములుగు, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాది కొత్తగూడెం జిల్లాలకు రెడ్ అలెర్ట్ ప్రకటించగా.. కరీంనగర్, భూపాలపల్లి, కొమరంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, వరంగల్, హనుమకొండ జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్ తో పాటు పరిసర జిల్లాలకు మోస్తరు నుంచి భారీ వర్ష సూచన తెలిపింది. ఐఎండీ జిల్లాల అధికారులను అలెర్ట్ చేసింది. అవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రజలకు సూచించింది.

భ‌ద్రాచ‌లం వ‌ద్ద వ‌ర‌ద ఉదృతి..

గత రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల వల్ల గోదావరి స్వల్పంగా వరద పెరిగింది. ప్రస్తుతం గోదావరి భద్రాచలం వద్ద 24 అడుగుల వద్ద చేరుకొని ఉంది.. ఇది మరి కొంత పెరిగే అవకాశం కనబడుతుంది.మరోవైపున తాలిపేరు, కిన్నెరసాని ప్రాజెక్టులకి భారీ ఎత్తున నీళ్లు రావడంతో గేట్లు ఎత్తి గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. కిన్నెరసాని ప్రాజెక్ట్ నుంచి 25 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలారు నీటి సామర్థ్యం 407 అడుగులు కాగా వరద ప్రభావం పెరుగు తుండటంతో ప్రస్తుతం 43 అడుగులకి చేరింది .దీంతో గత రాత్రి కిన్నెరసాని గేట్లని ఎత్తారు అదేవిధంగా తాలి పేరు ప్రాజెక్టుకు కూడా పూర్తిస్థాయి నీటిమట్టం రావటంతో 1.50 లక్షల క్యూసెక్కుల నీటిని గోదావరి విడుదల చేశారు.

పెద్ద వాగు ప్రాజెక్ట్ కాలువ‌కు గండ్లు… వ‌ర‌ద నీటిలో 15 గ్రామాలు

ఎడ‌తెగ‌కుండా కురుస్తున్ భారీ వర్షాలకు అనంతారం, కవాడిగుండ్ల, తండాలోని చెరువులు, కుంటలు కోతకు గురవుతున్నాయి. ఆ నీరంతా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం గుమ్మడవల్లి సమీపంలోని పెదవాగు ప్రాజెక్టులోకి చేరింది. దీంతో గురువారం నదికి వరద ఉధృతి పెరిగింది. దీనికి తోడు ఎగువన ఉన్న కొండలు, గుట్టల నుంచి కూడా వరద నీరు ప్రాజెక్టులోకి చేరడంతో నీటిమట్టం పొంగిపొర్లడంతో గట్టు తెగుతున్నాయి. పెదవాగు ప్రాజెక్టు సామర్థ్యం 45 వేల క్యూసెక్కులు కాగా భారీ వర్షాలకు సుమారుగా 70 వేల క్యూసెక్కుల వరకు వరద నీరు ప్రాజెక్టుకు చేరుకోవడంతో ప్రాజెక్టు నుంచి ఖమ్మంపాడు వైపుగా వెళ్లే కాలువ గ‌ట్లు ప‌లు చోట్ల కొట్టుకుపోయాయి.

దీంతో అప్రమత్తమైన అధికారులు లోతట్టు ప్రాంతంలోని గుమ్మడవల్లి గ్రామంలోని 300 కుటుంబాలు, కొత్తూరు గ్రామంలోని 200 కుటుంబాల ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రాజెక్టు ఎప్పుడు దెబ్బతింటుందో తెలిసే పరిస్థితి లేదని ఆయా గ్రామాల ప్రజలకు వివరించారు. పోలీసు, రెవె న్యూ, నీటిపారుదల శాఖ అధికారులు అక్కడే మకాం వేసి పరిస్థితిని అంచనా వేస్తూ, వరదల స్థాయిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచారు. అయితే ప్రాజెక్టు వరద నీరు దిగువకు వెళ్తుండడంతో ఏపీ రాష్ట్రంలోని ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం గుల్లవాయి, మాధారం, రెడ్డిగూడెం, మరో నాలుగు గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. వరద నీరంతా గ్రామాల మీదుగా ప్రవహించి రుద్రంకోట వద్ద గోదావరిలో కలుస్తోంది.

దీంతో వరద నీరు దిగువ ప్రాంతానికి రావడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రాజెక్టు దిగువన ఉన్న 15 గ్రామాల ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండగా ప్రాజెక్టు పైనుంచి వరద నీరు పొంగి పొర్లటంతో వరద నీరు దిగువ ప్రాంతాలకు చేరగా ఇప్పుడు గండి కూడా పడటంతో ఏ నిమిషం ఏమవుతుందోనని ప్రజలు ఆందోళన పడుతున్నారు. వర్షాలు ఇలాగే మరో ఒకటి రెండు రోజులు కొనసాగితే ప్రాజెక్టు ఆనకట్ట కొట్టుకుపోయే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు .ఇదే జరిగితే పెనుముప్పు సంభవించే అవకాశం ఉందని భయ పడుతున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement