Tuesday, November 19, 2024

AP | ఉరకలు వేస్తున్న కృష్ణమ్మ.. 70 గేట్లు ఎత్తివేత !

(ఎన్టీఆర్ ఆంధ్రప్రభ బ్యూరో) : బిరబిరా పరుగులు తీస్తున్న కృష్ణమ్మ సాగర ఒడిలో చేరేందుకు పరుగులు తీస్తోంది. ఎక్కువ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వరద నీటి ప్రవాహంతో కృష్ణమ్మకు నీటి ప్రవాహం గంటకంటకు పెరుగుతోంది. ప్రకాశం బ్యారేజ్ కి పైన ఉన్న ప్రాజెక్టులలో ఉన్న మిగులు జలాలను దిగువకు విడుదల చేయడంతో ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ కి వరద నీరు పోటెత్తుతోంది.

నిన్న మొన్నటి వరకు ముప్పై, నలభై వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా ఆదివారం నాటికి అది కాస్త లక్ష అరవై వేల క్యూసెక్కులకు చేరుకుంది. ప్రస్తుతం బ్యారేజీ వద్ద నీటి ప్రవాహం 12 అడుగులు దాటిన నేపథ్యంలో బ్యారేజీ 70 గేట్లను పైకి ఎత్తి మిగులు జలాలను దిగువకు విడుదల చేస్తున్నారు.

ఇందులో 20 గేట్లను 4 అడుగుల మేర, 50 గేట్లను 3 అడుగుల మేర ఎత్తి మిగులు జలాలను సాగర్లోకి విడుదల చేస్తున్నారు. ఇదే సమయంలో సాగు తాగునీటి అవసరాల కోసం కృష్ణ ఈస్ట్ కెనాల్ వెస్ట్ కెనాల్ కు 5439 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.

ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం 1,62,689 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. కృష్ణా నదికి పెద్ద ఎత్తున వరద నీరు పోటెత్తిన నేపథ్యంలో దిగువ ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. గంట గంటకు పెరుగుతున్న నీటి ప్రవాహం కారణంగా ఎటువంటి విపత్కర పరిస్థితిలో వచ్చిన ఎదుర్కొనేందుకు సిద్ధంగా కంట్రోల్ రూమ్ సైతం ఏర్పాటు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement