భద్రాచలం జూలై 21 (ప్రభ న్యూస్):భద్రాచలం వద్ద గోదావరి గంట గంటకు పెరుగుతుంది. ఆదివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో గోదావరి నీటిమట్టం 38.5 అడుగులుగా దిగువకు 7 లక్షల పైచిలుక క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు.ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ఇంద్రావతి నది , ఎగువ ప్రాంతం నుండి వచ్చే వరదతో గోదావరి నీటిమట్టం గంట గంటకు వేగంగా పెరుగుతుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు.
చర్ల ,దుమ్ముగూడెం , భాద్రాచలం మండలంలోని ముంపు గ్రామాల ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలిరావడానికి సహకరించాలని ఆయన కోరారు. గోదావరికి ఎగువనున్న ప్రాజెక్టుల నుంచి ఉదృతంగా నీరు వస్తున్నందున ఈ రోజు సాయంత్రం వరకు భద్రాచలం వద్ద గోదావరి 40 అడుగులకు చేరే అవకాశం ఉన్నదని యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ముంపుకు గురయ్యే ప్రాంత ప్రజలు జాప్యం చేయక యంత్రాంగానికి సహకరించి పునరావాస కేంద్రాలకు రావాలని కలెక్టర్ సూచించారు. వరద నిలిచిన రహదారులల్లో రవాణా నియంత్రణకు ట్రాక్టర్లు అడ్డు పెట్టాలని అధికారులను ఆదేశించారు.