కర్నూల్ బ్యూరో : శ్రీశైలం జలాశయం గేటు గురువారం మరో మారు తెరుచుకుంది. ఎగువ తుంగభద్ర, కృష్ణా నుంచి వరద జలాలు పోటెత్తడంతో ఒక గేటును పది అడుగుల మేర ఎత్తి దిగువ నాగార్జునసాగర్ కు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైల జలాశయానికి తుంగభద్ర, జూరాల నుంచి 1,06,259 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. డ్యామ్ నీటిమట్టం 885 అడుగులకు చేరుకోవడంతో ఉదయం 9:30 గంటలకు ఒక గేటును ఎత్తి 27వేల క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్ కు విడుదల చేశారు.
వాస్తవంగా జలాశయంకు వరద ప్రవహం తగ్గడంతో బుధవారం అన్ని గేట్లను మూసివేసిన సంగతి విధితమే. అయితే తుంగభద్ర, కృష్ణా నుంచి తిరిగి వరదనీరు పోటెత్తడంతో గంటల వ్యవధిలోనే మళ్లీ డ్యామ్ గేటును ఎత్తాల్సి వచ్చింది. ప్రస్తుతం డ్యామ్ గేట్లను ఎత్తివేయడం గత 40రోజుల్లో ఇది మూడవసారి. వాస్తవంగా ఈ ఏడాది వాటర్ ఇయర్లో భాగంగా జులై 29న శ్రీశైలం డ్యామ్ రేడియల్ క్రస్ట్ గేట్లు తెరుచుకున్నాయి. ఆ తర్వాత ఆగస్టు 12న క్లోజ్ చేశారు. మళ్లీ ఆగస్టు 28వ తేదీన తెరిచి బుధవారం మూసివేశారు. అంతలోనే తిరిగి గేట్లు తెరవడం విశేషం. కాగా శ్రీశైల జలాశయం నుంచి ఈ 40 రోజుల్లో దిగువకు 525.85 టీఎంసీల నీటిని విడుదల చేశారు.
మొదటిసారి జులై 29న గేట్లు ఎత్తివేసి 15 రోజుల పాటు స్పిల్ వే ద్వారా 363.43 టీఎంసీల నీటిని దిగువ సాగర్‌కు విడుదల చేశారు. ఆ తర్వాత రెండోసారి ఆగస్టు 28న రేడియల్ క్రస్ట్‌గేట్లను పైకెత్తారు. 10గేట్ల ద్వారా 162.42 టీఎంసీలు దిగువకు విడుదల చేయడం గమనార్హం. ఇక విద్యుత్తు ఉత్పత్తికి 86.02 టీఎంసీల నీటిని వినియోగించారు. ఇందులో ఏపీ పరిధిలోని కుడిగట్టు జలవిద్యుత్తు కేంద్రంలో 70.62 టీఎంసీల నీటిని వినియోగించుకొని 422.78 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేశారు.
ఈ వాటర్ ఇయర్ లో 1000 మెగా వాట్లకు పైగా విద్యుత్ ఉత్పత్తి చేయాలన్నది టార్గెట్. అయితే ఇందులో ఇప్పటికే సగం టార్గెట్ రీచ్ కావడం విశేషం. మరో రెండు నెలలు సమయం ఉండటం వల్ల శ్రీశైల జల విద్యుత్ కేంద్రంలో 1000 మెగావాట్లకు పైగా విద్యుత్ ఉత్పత్తి చేయడం ఖాయంగా కనిపిస్తుంది.