Tuesday, September 17, 2024

Flood – కోలుకుంటున్న‌ బెజ‌వాడ‌ ….. హమ్మయ్య ఎండొచ్చింది

ఇళ్ల‌ల్లోంచి తగ్గుముఖం ప‌ట్టిన నీళ్లు
వీధుల్లోకి క‌దిలిన‌ జ‌నం
కరెంటు కోసం ఎదురుచూపులు
ఎవరు బతికారు? ఎవరు లేరు?
ఆరా తీస్తున్న అధికారులు
పారిశుధ్య పనుల్లో 10వేల మంది నిమగ్నం
ఇంటింటికీ భోజనం సరఫరాలో బిజిబిజీ

ఆంధ్ర ప్రభ స్మార్ట్, ఎన్టీఆర్ బ్యూరో :
హమ్మయ్య ఎండొచ్చింది. మెయిన్ రోడ్డుల్లో నీళ్లు తగ్గాయి. వీధుల్లో నీరూ తగ్గుతోంది. నాలుగు రోజుల పాటు ఊపిరి బిగబట్టిన విజయవాడ జనం గురువారం వీధుల్లోకి వస్తున్నారు. ఇంటిలో పేరుకు పోయిన బురదను నీటితో కడిగేస్తున్నారు. ఇంకా కరెంటు రాలేదు. ఇప్పడిప్పుడే భోజనం ప్యాకెట్లతో సహాయక సిబ్బంది పత్యక్షమవుతున్నారు. ఇక సీఎం చంద్రబాబు సహా .. మంత్రులు పి.నారాయణ, కొల్లు రవీంద్ర తదితరులు వీధుల్లోకి వస్తున్నారు. ఇప్పటికే 10 వేల మంది పారిశుధ్య కార్మికులు పనిలో నిమగ్నమయ్యారు. కండ్రిక, సింగ్నగర్, న్యూ రాజరాజేశ్వరీ పేట, ఖద్దూస్ నగర్, అయోధ్యనగర్, దేవీ నగర్ ల్లో బుడమేరు ప్రతాపంతో 68వేల ఇళ్ల నీటిన మునిగాయి. ఈ ఇళ్లన్నీ ఇప్పుడిప్పుడే నీటి నుంచి బయట పడుతున్నాయి. వీధుల్లో నీరు స్వల్పంగా తగ్గింది.

బుడమేరు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు

విజయవాడ: నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు మరోసారి పర్యటించారు. ఎనికేపాడు వద్ద ఏలూరు కాలువ దాటి బుడమేరు ముంపు ప్రాంతాలను ఆయన పరిశీలించారు. బల్లకట్టుపై వెళ్లి ముంపు ప్రాంతాల్లో సీఎం పర్యటించారు. గండ్లు పడిన ప్రాంతాల్లో పనులపై అధికారులతో ఆయన చర్చించారు. దెబ్బతిన్న పంటల వివరాలు స్థానికులను అడిగి తెలుసుకున్నారు.

ఇప్పుడిప్పుడే జనం ఊపిరి

- Advertisement -

విజయవాడ నగరం వర్షం కురుస్తోందంటేనే చిగురుటాకులా వణికి పోతోంది. గత నాలుగు రోజులుగా విజయవాడలోని ప్రజానీకం ఇంకా వరద నీటిలోనే కాలం గడుపుతోంది. ఇప్పుడిప్పుడు పరిస్థితులు కాస్త కుదురుకుంటున్నా కూడా ఇంకా తెలియని ఆందోళన జనాల్లో వ్యక్తమవుతోంది. విజయవాడ నగరం ఎన్నడూ లేనంత సంక్షోభానికి గురైంది. చివరకు సీఎంతో సహా మంత్రులు, అధికార యంత్రాంగమంతా నిద్రాహారాలు మాని పరిస్థితులు అదుపులోకి వచ్చే వరకూ శ్రమించాయి. ప్రజలకు ఆహారం, నీళ్లు, పాలు అందిస్తూ వారు కూడా వరద నీటిలోనే కాలం వెళ్లదీశారు.

వీధుల్లో మంత్రులు ..

విజయవాడ నగరంలో వరద తగ్గిన ప్రాంతాల్లో పారిశుధ్య పనులను మంత్రులు పొంగూరు నారాయణ, సవిత పరిశీలించారు. 54 వ డివిజన్‌లో చెత్త తొలగింపు, ఫైర్ ఇంజన్‌లతో క్లీనింగ్ చేస్తున్న ప్రాంతాలను మంత్రులు పరిశీలించారు. వరద బాధితుల ఇళ్లకు వెళ్లి బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వించిపేటలో ఫైర్ ఇంజిన్ ద్వారా పాఠశాలను కొంతమేర మంత్రి నారాయణ శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విజయవాడలో గతంలో ఎప్పుడూ లేనంత వరదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. వరద ప్రాంతాల్లో మొదటి రోజు ప్రజలను రక్షించేందుకు వెళ్లిన బోట్లు, ట్రాక్టర్లు కూడా బోల్తా పడ్డాయన్నారు. వరద బాధితులందరికీ సరిపడా ఆహారం, తాగునీరు, పాలు, బిస్కట్లు, పండ్లు అందించేలా సీఎం చంద్రబాబు అన్ని చర్యలు తీసుకున్నారని తెలిపారు. ఇప్పటి వరకూ 80 శాతం వరద తగ్గిందని పేర్కొన్నారు.

రేపటి నుంచి నిత్యవసర సరకుల పంపిణీ

వరద బాధితులకు రేపటి నుంచి నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని మంత్రి నారాయణ తెలిపారు. పారిశుధ్యం పనులు శరవేగంగా జరుగుతున్నాయని వెల్లడించారు. మొత్తం 10 వేల మంది పారిశుధ్య కార్మికులు చెత్త తొలగింపు, బ్లీచింగ్ చల్లే పనుల్లో నిమగ్నమై ఉన్నారని వెల్లడించారు. అత్యాధునిక యంత్రాలు ఉపయోగించి చెత్తను త్వరితగతిన తొలగించేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. కేవలం బుధవారం బాధితులకు 26 లక్షల వాటర్ బాటిల్స్,10 లక్షల బిస్కట్ ప్యాకెట్లు, 8 లక్షల పాల ప్యాకెట్లు సరఫరా చేశామని మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు.

ప్చ్.. నలుగురిని కాపాడి..

బుడమేరు వరదల్లో నలుగురిని ప్రాణాలతో కాపాడిన వ్యక్తం అదే వరదలో కొట్టుకుపోయాడు. మృతి చెందాడు. ఈ హృదయవిదారక ఘటన విజయవాడలో చోటు చేసుకుంది. విజయవాడ సింగ్ నగర్‌ కు చెందిన చంద్రశేఖర్(32) డెయిరీ ఫాంలో పనిచేస్తున్నాడు. అతడి భార్య 8 నెలల గర్భణీ. బుడమేరు పొంగటంతో తనతో పనిచేస్తున్న తన ఇద్దరు సోదరులు, మరో ఇద్దరిని షెడ్డు పైకప్పు మీదకు ఎక్కించి, తాళ్లతో కట్టేసిన ఆవులనూ వదిలేశాడు. తిరిగి తాను షెడ్డుపైకి ఎక్కేందుకు ప్రయత్నిస్తుండగా కాలు జారి వరదలో కొట్టుకుపోయాడు. ఈ వరద నీటిలో ప్రాణాలు వదిలాడు

Advertisement

తాజా వార్తలు

Advertisement