Tuesday, November 12, 2024

Flood Effect – కారు.. బేజారు! షెడ్డుకు క్యూ కడుతున్న బండ్లు

వరదలతో వాహనదారులకు తప్పని కష్టాలు
భారీ వర్షాలు మోసుకొచ్చిన తీవ్ర నష్టాలు
రిపేర్​కు క్యూ కడుతున్న వాహనాలు
ఒక్కో కారుకు కనిష్టంగా ₹70వేల ఖర్చు
కోట్లు ఖరీదు చేసే లక్జరీ కార్లకు కష్టకాలం
పడిపోయిన రీసేల్​ వ్యాల్యూ
జేబులు తడుముకుంటున్న యజమానులు

ఏపీలోని విజయవాడలో వరద బీభత్సానికి కార్లు పెద్ద సంఖ్యలో దెబ్బతిన్నాయి. కృష్ణమ్మ మహోగ్రరూపం, బుడమేరులో ఊహించని వరదకు ఇంటి సెల్లార్లోనే కాకుండా రోడ్డుపక్క పార్కు చేసిన కార్లు కూడా తలకిందులయ్యాయి. వరద తగ్గుముఖం పట్టడంతో దెబ్బతిన్న కార్లను షోరూమ్‌ల వద్దకు తీసుకొచ్చి సర్వీసింగ్‌ చేయించేందుకు యజమానులు నానాయాతన పడుతున్నారు. ఒక్కో కారుకు కనిష్ఠంగా ₹70 వేల నుంచి ₹1 లక్షకు పైగా ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. ₹12 లక్షల నుంచి ₹1 కోటి వరకు కొనుగోలు చేసిన కార్లలో కొన్నింటికి కనీస రీసేల్​ ధర కూడా వచ్చేలా లేదని బాధితులు గగ్గోలు పెడుతున్నారు.

- Advertisement -

వేలాదిగా దెబ్బ తిన్న కార్లు

విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎటు చూసినా వాహనాలు రోడ్లపై చెల్లాచెదురయ్యాయి. నీటి ప్రవాహానికి పార్కింగ్‌ చేసిన వాహనాలు కూడా కొట్టుకుపోయాయి. మరికొన్ని కాల్వల్లో బోల్తాకొట్టాయి. ఇంకొన్ని తలకిందులై నీటమునిగిపోయాయి. నీటి ఉధృతి తగ్గి.. సాధారణ పరిస్థితులు నెలకొంటున్న తరుణంలో వాహనదారులు కార్లను షోరూమ్‌లకు పంపుతున్నారు. వరదలు ముంచెత్తడంతో పాత, కొత్త అనే తేడా లేకుండా వేలాది కార్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

రిపేర్లకు భారీగా ఖర్చు..

వరదల్లో నీట మునిగిన కార్ల మరమ్మతులకు పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుందని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. విజయవాడ చుట్టుపక్కల శివారు ప్రాంతాల్లో టాటా, హుందాయ్ ఇతర కార్ల కంపెనీల గోడౌన్లు ఉన్నాయి. మిగిలిన చోట్ల ఉన్న కార్ల షోరూమ్​లలో వరద నీరు చేరింది. సింగ్ నగర్, గొల్లపూడి, భవానీపురం ప్రాంతాల్లో వేల సంఖ్యలో కార్లు నీటిలో మునిగాయి. కార్ల నష్టాన్ని అంచనా వేయలేని రీతిలో ఉన్నాయని చాలా మంది చెబుతున్నారు.

సర్వీసుకు వచ్చిన కార్లకు లక్షల్లో ఖర్చు ..

వరద ఉధృతి తగ్గడంతో కాలనీల నుంచి వివిధ కంపెనీలకు చెందిన కార్లను ట్రక్​లపై, గొలుసులతో కట్టి సర్వీసు సెంటర్లకు తీసుకువస్తున్నారు. పలు ప్రాంతాల్లో నీరు ఉన్నందున ఇంకా కొన్ని కార్లు వరదలోనే నానుతున్నాయి. సర్వీస్ కోసం వచ్చిన కార్లకు ₹లక్షల్లో ఖర్చు అయ్యే అవకాశం ఉందని, వరదల్లో తడిసిన కార్లను సర్వీస్ చేయిస్తే కానీ దూర ప్రయాణాలతో ఇబ్బందులు తలెత్తవని మెకానిక్​లు సలహా ఇస్తున్నారు. అలాగే కార్లకు జరిగిన నష్టాన్ని 3 విభాగాలుగా విభజించి, ఇన్సూరెన్స్ లేని వాహనాలకు కూడా తమ వంతు కర్తవ్యంగా ఆర్థిక భారం కాకుండా చేస్తామని కంపెనీల మేనేజర్లు చెబుతున్నారు. కార్లకు మరమ్మతులు కోసం భారీగా ఖర్చు కావొస్తుండడంతో ఏదో ఓ ధరకు విక్రయించి కొత్త వాటిని చూసుకోవడమే మేలనే అభిప్రాయంతో కొందరు యజమానులున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement