Friday, November 22, 2024

కడప నుంచి విమాన సర్వీసులు బంద్.. ఇప్పటికే టికెట్స్‌ నిలిపివేత

కడప, ప్రభన్యూస్‌ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన వీజిఎఫ్‌ నిధులను చెల్లించకుంటే కడపకు విమాన సర్వీసులు నిలిపివేస్తామని ఇండిగో విమానయాన సంస్థ హెచ్చరించింది. సెప్టెంబర్‌ 1 నుంచి కడపకు, కడప నుంచి హైదరాబాద్‌, విజయవాడ, చెన్నై, బెంగుళూరుకు విమానాలు రద్దు చేసుకుంటామని ఇండిగో సంస్థ తేల్చి చెప్పింది. ఇప్పటికే ఆన్‌లైన్‌ టికెట్ల జారీని కూడా నిలిపివేసింది. అయితే కలెక్టర్‌ వినతిమేరకు 15 రోజులు గడువు ఇచ్చినట్లు తెలుస్తోంది. అందరికి విమానయానం అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో ఉడాన్‌ పథకం కింద టైర్‌-2,3 నగరాల మధ్య విమాన సర్వీసులు నడిపారు.

అందులో భాగంగా ట్రూజట్‌ సంస్థ కడప నుంచి సర్వీసులు ప్రారంభించింది. కడప నుంచి దేశంలోని హైదరాబాద్‌, విజయవాడ, బెంగుళూరు, చె న్నైలకు సర్వీసులు నడిపింది. అయితే ఆ తరువాత పలు కారణాలతో ఆరు నెలలకు పైగా సర్వీసులు ఆగిపోయాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి ఇండిగోతో ఎయిర్‌ పోర్టు అథారిటీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ద్వారా ఒప్పందం చేసుకుంది. వయబిలిటీ గ్యాప్‌ ఫండ్‌(వీజీఎఫ్‌) కింద ఏడాదికి రూ.20 కోట్లు చెలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది.

దీంతో 27 మార్చి 2022 నుంచి విమాన సర్వీసులు ప్రారంభించింది. ఫలితంగా కడప నుంచి విజయవాడ, హైదరబాద్‌, చెన్నై, బెంగుళూరు, విశాఖపట్నం నగరాలకు విమానాలను నడిపింది. అప్పటి నుంచి ప్రజలు కూడా విమాన సర్వీసులకు అలవాటు పడ్డారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం మేరకు వీజీఎఫ్‌ నిధులు ఇవ్వలేదని కొద్ది మాసాలుగా ఇండిగో సంస్థ తమ అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉంది. తమకు చెల్లించాల్సిన రూ.20కోట్లను సంస్థకు చెల్లించాలని లేఖలు రాసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో ఏకంగా కడప నుంచి విమాన సర్వీసులు నిలిపివేయాలని ఇండిగో నిర్ణయించింది.

- Advertisement -

ఈ మేరకు సెప్టెంబర్‌ 1 నుంచి తమ సర్వీసులు రద్దు చేసుకుంటున్నామని తెలియ జేస్తూ ప్రస్తుతం ఆన్‌లైన్‌ టికెట్‌ బుకింగ్‌ నిలిపివేసింది. అయితే తగినంత మంది ప్రయాణికులు లేని సమయాల్లోనే వీజీఎఫ్‌ నిధులు చెల్లిస్తామని తాము అంగీకరించామని, అయితే ప్రస్తుతం ప్రయాణికుల సంఖ్య ఆశించిన స్థాయిలో ఉన్నారని ప్రభుత్వ వాదన.

కలెక్టర్‌ వినతి మేరకు 15 రోజులు గడువు…

ప్రస్తుతం ఇండిగో తమ సర్వీసులు రద్దు చేసుకుంటే జిల్లా ప్రజలు విమానయానాన్ని కోల్పోతారని భావించిన కలెక్టర్‌ విజయరామరాజు ప్రభుత్వంతో చర్చించారు. ఇండిగోతో కూడా సంప్రదించడంతో వీజీఎఫ్‌ నిధుల చెల్లింపుకు సదరు సంస్థ మరికొంత గడువు ఇచ్చింది. దీంతో సెప్టెంబర్‌ 15లోపు నిధులు చెల్లిస్తే తమ సర్వీసులు యధావిధిగా కొనసాగుతాయని, లేకుంటే రద్దు చేసుకోవాల్సి వస్తుందని ఇండిగో తేల్చి చెప్పింది. దీనిపై ప్రభుత్వం స్పందించి సమస్యను పరిష్కరిస్తుందని భావించాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement