జగ్గయ్యపేట – స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబును నాయుడికి నిన్న విజయవాడలోని ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయనను నిన్న అర్ధరాత్రి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ రాష్ట్ర వ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చింది. రాష్ట్రంలో పోలీసులు 144 సెక్షన్ అమలు చేసినా.. టీడీపీ నేతలు తమ నిరసన కొనసాగిస్తున్నారు. తాజాగా ఏపీలో సీనియర్ ఎన్టీఆర్ పేరుతో ఉన్న ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. జగ్గయ్యపేట పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్‌లో ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ‘థాంక్యూ జగన్ నా ఆత్మకు శాంతి చేకూర్చావంటూ’ ఫ్లెక్సీలు వెలిశాయి. తెలుగు ప్రజలందరూ సెప్టెంబర్ 10ని ఆత్మశాంతి దినోత్సవంగా జరుపుకోవాలంటూ ఫ్లెక్సీలో కోరారు’.
”నన్ను చివరి దశలో అనేక అవమానాలకు, అత్యంత క్షోభకు గురి చేసి నా మరణానికి కారణమైన నీచుడు చంద్రబాబు. నేను చనిపోయాక నా మరణాన్ని వాడుకుని, నా కుమారుడు హరికృష్ణ మరణాన్ని కూడా వీటి కుటిల రాజకీయాలకు వాడుకుని చివరికి నా మనువడు తారకరత్న మరణాన్ని కూడా వీడి కొడుకు నీచ రాజకీయానికి వాడుకున్న నీచుడికి బుద్ధి చెప్పి, నా ఆత్మకు శాంతిని చేకూర్చావు. నీచుడు, దుర్మార్గుడైన చంద్రబాబు సెప్టెంబర్ 10న జైలుకు వెళ్తున్న సందర్భంగా తెలుగు ప్రజలందరూ కూడా ఈ రోజును (సెప్టెంబర్ 10ని) ఆత్మ శాంతి దినోత్సవంగా జరుపుకోవాలని నా విజ్ఞప్తి ఇట్లు నందమూరి తారకరామారావు (సినీయర్ ఎన్టీఆర్)” అంటూ ఫ్లెక్సీలో పేర్కొన్నారు. ఇక ఫ్లెక్సీలో సీఎం జగన్‌కు హరికృష్ణ, ఆయన కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ బోకే ఇస్తున్న ఫొటో ఉంది. ..ఈ ఫ్లెక్సీలపై తెలుగు తమ్ముళ్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..