వరద ప్రభావిత ప్రాంత ఎస్‌టీల జీవనోపాధిని దెబ్బతీశాయి.
ముంపుతో సంభవించిన కష్టనష్టాలపై ప్రభుత్వానికి సమగ్ర నివేదిక
ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించిన ప్రభుత్వానికి కమిషన్ తరఫున ధన్యవాదాలు
రాష్ట్ర ఎస్‌టీ కమిషన్ ఛైర్మన్ డా. డీవీజీ శంకరరావు…
(ఎన్టీఆర్ ప్రభ న్యూస్ బ్యూరో) : ఇటీవల కురిసిన భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు విజయవాడతో పాటు పరిసర ప్రాంతాల్లోని ప్రజల జీవితాలను అస్తవ్యస్తం చేశాయని… ఎస్‌టీల జీవనోపాధిని బాగా దెబ్బతీశాయని, వాస్తవ స్థితిగతులపై రాష్ట్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందజేయనున్నట్లు రాష్ట్ర ఎస్‌టీ కమిషన్ ఛైర్మన్ డా.డీవీజీ శంకర రావు తెలిపారు.
ఎస్‌టీ కమిషన్ ఛైర్మన్ డా.డీవీజీ శంకరరావు బుధవారం ఎస్‌టీ కమిషన్ సభ్యులు వడిత్యా శంకర్ నాయక్‌తో కలిసి విజయవాడ అర్బన్ పరిధిలోని న్యూ రాజరాజేశ్వరిపేట, వాంబే కాలనీ, జక్కంపూడి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. వరదల కారణంగా ఆదివాసీలు ఎదుర్కొన్న ఇబ్బందులు, వరద ప్రభావం తెచ్చిపెట్టిన కష్టాల నుంచి బాధితులను గట్టెక్కించేందుకు ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు అందిన సహాయ సహకారాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… అభివృద్ధిలో వెనకున్న ఆదివాసీలకు వరద మరిన్ని కష్టాలను తెచ్చిపెట్టిందని.. వరద ప్రభావం వల్ల ఎస్‌టీలకు జరిగిన కష్టనష్టాలను తెలుసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదిక ఇచ్చేందుకు క్షేత్రస్థాయిలో పర్యటించినట్లు వివరించారు.
పూసలు అమ్ముకొంటూ, ఆటోలు నడుపుకుంటూ, చాలా చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఎస్‌టీలు జీవిస్తున్నారని.. వరదల వల్ల వారి జీవనోపాధికి చాలా ఇబ్బంది కలిగిందన్నారు. ముడిసరుకు నీటిపాలై ఆర్థిక సమస్యలు తలెత్తాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు బాధితులను ఆదుకునేందుకు కృషిచేస్తున్నాయని.. బాధితులకు జరిగిన నష్టాన్ని ఎన్యూమరేషన్ చేసి, ప్యాకేజీ ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వానికి ఎస్‌టీ కమిషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు.
ప్రభుత్వ పథకాలన్నీ అందేలా కృషి…
వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి, ఎస్‌టీలతో మాట్లాడటం జరిగిందని, ఆధార్, రేషన్ కార్డులు, పెన్షన్ వంటివి లేవని కొందరు తమ సమస్యలను కమిషన్ దృష్టికి తెచ్చారని.. ఈ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అందరికీ న్యాయం జరిగేలా, ప్రజా క్షేమానికి, సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలన్నీ అందేలా కృషిచేయనున్నట్లు తెలిపారు. ఎస్‌టీలు సమాజంలో మిగిలిన వారితో సమానంగా ఎదిగేందుకు కమిషన్ కృషిచేస్తున్నట్లు డా.డీవీజీ శంకరరావు పేర్కొన్నారు.
వాంబే కాలనీలో సందర్శించిన సమయంలో ఎస్‌టీలు కమిషన్ ఛైర్మన్‌తో మాట్లాడుతూ… తాము చిన్నచిన్న వ్యాపారాలు చేస్తూ బతుకుతున్నామని.. వరద సమయంలో ప్రభుత్వం సహాయ సహకారాలు అందించిందని, హెలికాప్టర్లను సైతం మా దగ్గరికి పంపించి ఆహారాన్ని అందించారని తెలిపారు. రేషన్ కూడా ఇచ్చారని వివరించారు. ఈ పర్యటనలో రాష్ట్ర ఎస్‌టీ కమిషన్ కార్యదర్శి కె.రామశేషు, ఏవో ఎం.విజయ్ కుమార్, నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ (ఎన్‌టీఎఫ్) ప్రెసిడెంట్ మానుపాటి నవీన్, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి జె.సునీత, యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రెసిడెంట్ కె.రామచంద్రయ్య, ఎస్‌టీ సంక్షేమ సంఘం నేత ఉదయ్ కుమార్, విజయవాడ నార్త్ తహశీల్దార్ సీహెచ్ శిరీషా దేవి, రూరల్ తహశీల్దార్ బి.సుగుణ, తదితరులు పాల్గొన్నారు.