తిరుపతి,ఆంధ్రప్రభబ్యూరో (రాయలసీమ) : ఎక్కడో వేల కిలోమీటర్ల దూరం నుంచి ఎగురుకుంటూ విహారానికి వచ్చి నచ్చిన తోడు తో జత కట్టి పిల్లలను కని కుటుంబ సమేతంగా తిరిగివెళ్ళే అరుదైన పక్షుల జాతి కథ ఇది. వేల సంఖ్యలో ప్రతి ఏటా రావడం, అయిదారు నెలలపాటు సహజీవనం చేయడం, పుట్టిన పిల్లలకు రెక్కలు వచ్చేదాకా ఉండి తిరిగి వెళ్ళడం అనే విలక్షణ జీవన విధానానికి తిరుపతి జిల్లా సరిహద్దుల్లోని సూళ్లూరుపేట ప్రాంతం వేదిక అవుతోంది.
ఈ ప్రాంతానికి ఆరు దశాబ్దాల క్రితమే అభయారణ్య హోదా లభించినా రెండు దశాబ్దాల క్రితం నుంచే ఆ పక్షులకు స్వాగతం పలికే విధంగా ఫ్లెమింగో ఫెస్టివల్ పేరుతో మూడు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించడం ప్రారంభం అయింది. కరోనా కారణంగా బ్రేక్ పడిన ఈ ఉత్సవాలు ఈ ఏడాది మొదలై వేలాదిమంది పర్యాటకులను, పక్షి ప్రేమికులను,. పరిశోధకులను ఆకట్టుకుంటోంది.
ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల సరిహద్దుల్లో 450 హెక్టార్ల విస్తీర్ణం కలిగిన పులికాట్ సరస్సు కు 20 కిలోమీటర్ల దూరంలో సూళ్లూరుపేట ప్రాంత పరిధిలో విస్తరించి ఉన్న నేలపట్టు ప్రాంతం అనతికాలంలోనే ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందింది. అందుకు వివిధ దేశాల నుంచి ఏటా తరలి వచ్చి ఐదారు నెలల పాటు ఇక్కడే కొలువుతీరి కనువిందు చేసే విదేశీ వలస పక్షులే కారణం అవుతుంటాయి. అరుదైన పక్షి, జల జంతుజాలానికి వేదికైన నేలపట్టు ప్రాంతాన్ని 1976 లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అభయారణ్యంగా ప్రకటించింది.
2001 లో నెల్లూరు జిల్లా కలెక్టర్ గా పని చేసిన ప్రవీణ్ కుమార్ నేలపట్టు ప్రాంతాన్ని సందర్శించినప్పుడు విదేశీ పక్షుల సోయగాన్ని చూసి మైమరచి పోయారు. వివిధ దేశాలనుంచి తరిలి వచ్చి ఐదారు నెలలపాటు ఇక్కడే బస చేసి కనువిందు చేసే ఆ పక్షులకు ఆహ్వానం పలికే విధంగా ఒక ఉత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించారు.
ఆ నిర్ణయం మేరకు వచ్చే పక్షులలో అందంగా ఉండే ఫ్లెమింగో పక్షుల పేరుతో మూడు రోజుల పాటు ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహించడం మొదలైంది . అధికారిక కార్యక్రమంగా నిర్వహించే ఫ్లెమింగో ఫెస్టివల్ ఇటు నెల్లూరు, చిత్తూరు జిల్లాల వాసులతో పాటు అటు తమిళనాడు నుంచి వచ్చే పర్యాటకులను కూడా ఆకట్టుకోవడం ఊపందుకుంది.
11 రకాల విదేశీ పక్షులు ఆస్ట్రేలియా, సైబీరియా ,రష్యా మొదలైన ప్రాంతాల నుంచి ఏటా అక్టోబర్ నెలలో వేల సంఖ్యలో తరలి వచ్చే విదేశీ పక్షులు మరుసటి ఏడాది ఏప్రిల్ నెల వరకు నేలపట్టు ప్రాంతంలోనే ఉంటాయి. అందులో ఫెలికాన్, ఓపెన్ బిల్ స్కార్క్, వైట్ ఐబిస్, నైట్ హెరాన్, స్పూన్ బిల్స్, కార్మొమెంట్ మొదలైన 11 రకాల అరుదైన పక్షి జాతులు ఉంటాయి. వాటిలో కేవలం నాచు తిని జీవించే శాకాహార పక్షుల నుంచి చేపల వంటి జలచరాలను తిని జీవించే మాంసాహార పక్షులు కూడా ఉంటాయి.
ఇందులో అత్యంత ఆకర్షణీయంగా ఎర్రటి కాళ్లతో ఉండే ఫ్లెమింగో పక్షులు ఇసుక తిన్నెల్లోనే గూళ్ళు కట్టుకుని జీవిస్తే పెలికాన్ వంటి బాతు జాతి పక్షులు చెట్లపై గూళ్ళు కట్టుకుని జీవిస్తాయి. దాదాపుగా అన్ని వచ్చిన తరువాత మొగ , ఆడ పక్షులు జత కడ్తాయి. ఇందులో పుట్టిన పిల్లలను పెద్దయ్యేదాకా ఆడపక్షులు చూసుకుంటే మొగ పక్షులు ఆహారాన్ని సేకరించితెచ్చి పోషించే సాధారణ మానవ కుటుంబ వ్యవస్థ లా జీవించే పక్షులే కాక పిల్లలను గూళ్ళలో వదిలిపెట్టి మొగ ఆడ పక్షులు కలిసి వెళ్లి ఆహారాన్ని సేకరించి తెచ్చి పోషించే ఆధునికి కుటుంబ వ్యవస్థను ప్రతిఫలించే పక్షులు కూడా ఉండడం చెప్పుకోదగిన విశేషం.
జతకట్టిన పక్షులు తమ పిల్లలకు రెక్కలు వచ్చి ఎగిరే స్థితికి వచ్చేదాకా ఉండి అన్నీ కలిసి తమ దేశాలకు తిరుగుప్రయాణం మవుతాయి. ఈ అరుదైన పక్షి జాతుల జీవన విధానం పై గత అయిదారు మధ్యకాలంలో ఇటు ఆంధ్రప్రదేశ్, అటు తమిళనాడు రాష్ట్రాలకు చెందిన వందలాదిమంది జంతు జీవశాస్త్ర పరిశోధకులు తమ పరిశోధనా వ్యాసాలను సమర్పించడం మరో విశేషం. తరతరాలుగా పక్షులు ఒక ప్రణాళిక బద్దంగా వేల కిలోమీటర్లు దాటి ఇక్కడకు వచ్చి ఐదారునెలల పాటు జీవించి పిల్లా పాపలతో తిరిగి వెళ్ళడానికి ఈ ప్రాంతం లో ఉన్న ప్రత్యేకత పై మరింత పరిశోధలను కొనసాగుతున్నాయి.
మూడేళ్ల విరామం తరువాత … గత ప్రభుత్వ హయాంలో కరోనా కారణంగా 2020 లో చివరిసారిగా ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహించిన ఆ సమస్య తీరిపోయినా ఆసక్తిలేక, నిధులు లేక కొనసాగించ లేక పోయారు. జిల్లాల పునర్విభజన ప్రక్రియలో భాగంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా పరిధినుంచి విడిపోయిన సూళ్లూరుపేట ప్రాంతం కొత్తగా ఏర్పడిన తిరుపతి జిల్లా పరిధిలోకి వచ్చింది.
ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో అధికారం చేపట్టిన ఎన్ డి ఏ కూటమి ప్రభుత్వం మళ్ళీ ఫ్లెమింగో ఫెస్టివల్ ను కొనసాగించాలని నిర్ణయించడంతో ప్రస్తుతం జరుగుతున్నాయి. ప్రభుత్వం కేటాయించిన నిధులతో సమీపంలోని ప్రముఖ వాణిజ్య నగరం శ్రీసిటీ సహాయ సహకారాలతో ఈ ఏడాది ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.
వచ్చే వారి కోసం నాలుగు వేర్వేరు చోట్ల ప్రత్యేక ఏర్పాట్లు చేశారు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే ప్రజల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేసింది. ఉత్సవాలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన వివిధ శాఖలకు చెందిన ఎగ్జిబిషన్ స్టాల్స్ లో ఆప్కో, చేనేత, హ్యాండీక్రాఫ్ట్స్ కలంకారి, షార్ అంతరిక్ష కేంద్రం నమూనా స్టాల్, శ్రీ సిటీ పరిశ్రమలకు సంబంధించిన స్టాల్, పర్యాటకశాఖ వారి ఫుడ్ కోర్ట్ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
ఈ ఉత్సవాల సందర్భంగా నిర్వహించే రకరకాల ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలతో విదేశీ పక్షుల విహారయాత్రా స్థలం కళకళ లాడుతోంది