Saturday, November 23, 2024

వచ్చే నెలలో మత్స్యకార భరోసా.. ఆర్బీకేల వారీగా గుర్తింపు

అమరావతి, ఆంధ్రప్రభ : మత్స్యకారులకు వేట నిషేధ భృతి అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. మేనెల రెండవ వారంలో అమలు చేసే పథకానికి సంబంధించి అర్హులైన మత్స్యకారుల ఎంపిక కోసం క్షేత్రస్థాయి నుంచి సమాచారం సేకరించి డేటా సిద్ధం చేయాల్సిందిగా అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సముద్రంలో చేపల పునరుత్పత్తి కోసం ప్రభుత్వం ప్రతి సంవత్సరం రెండు నెలల పాటు- వేటను నిషేధిస్తోంది. ఈ ఏడాది ఈనెల 14 అర్ధరాత్రి నుంచి వేటపై నిషేధాజ్ఞలు అమల్లోకి వచ్చాయి. ఈ నిషేధం 61 రోజుల పాటు- అమలులో ఉంటు-ంది. వేట నిషేధ సమయంలో ఉపాధి కోల్పోయే మత్స్యకారులకు ప్రభుత్వం ఏటా రూ 10 వేల ఆర్ధికసాయం అందిస్తోంది.

గతంలో రూ 4 వేలుగా ఉన్న ఆర్ధిక సహకారం వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ మత్స్యకార భరోసా పేరుతో వేట నిషేధ భృతిని రూ 10 వేలకు పెంపుదల చేసింది. రాష్ట్రంలో 974 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న సముద్ర తీరంలో 555 మత్స్యకార గ్రామాలున్నాయి..అధికారిక లెక్కల ప్రకారం సుమారు 8.5 లక్షల మత్స్యకార కుటుంబాలు ఉండగా 1.6 లక్షల కుటుంబాలు కేవలం సముద్ర వేటపై ఆధారపడి జీవిస్తున్నాయి. 1610 మెకనైజ్డ్‌, 22,011 మోటరైజ్డ్‌, 6343 సంప్రదాయ బోట్ల ద్వారా వారంతా సముద్ర వేట సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిషేధాజ్ఞలు అమలులో ఉండే రెండు నెలల పాటు- ఉపాధి కోల్పోయే వారందరికి ప్రభుత్వం మత్స్యకార భృతిని అమలు చేస్తోంది. 2019 నుంచి 2022 వరకు సుమారు 4.14 లక్షల మంది అర్హులైన మత్స్యకారులకు రూ 10 వేల చొప్పున రూ 414.49 కోట్ల ఆర్ధిక సహకారాన్ని అందించిన ప్రభుత్వం ఈ ఏడాది వచ్చే నెల రెండవ వారంలో భృతిని అందించేందుకు లబ్దిదారుల ఎంపిక కోసం కసరత్తు చేస్తోంది.

- Advertisement -

ఆర్బీకేల వారీగా గుర్తింపు..

రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే) వారీగా లబ్దిదారులను ఎంపిక చేసే పనిలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. ఆర్బీకేల్లో మత్స్య సహాయకుడు, వాలంటీర్‌, సాగర్‌ మిత్రలతో ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు వేట నిషేధాన్ని ఖచ్చితంగా అమలు చేస్తున్న వారి వివరాలను సేకరిస్తున్నాయి. ఈ మేరకు ఈనెల 27న తీర ప్రాంత గ్రామాల్లో వేటకు వెళ్లకుండా లంగరేసిన గుర్తింపు ఉన్న బోట్ల వివరాల నమోదు ప్రక్రియ చేపట్టనున్నారు. మత్స్యకారులు లంగరేసిన బోటు రిజిస్ట్రేష్రన్‌ డాక్యుమెంట్లు, ఫిషింగ్‌ లైసెన్స్‌, ఆధార్‌, బ్యాంకు వివరాలు అందించాల్సి ఉంటుంది. మొత్తం ఆరుదశల పరిశీలన పూర్తి చేసి లబ్దిదారుల ఎంపిక తుది ప్రక్రియను ఈనెలాఖరుకు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

వేట నిషేధ భృతిని అందుకునే వారి వయసు 18 నుంచి 60 ఏళ్ళ లోపు ఉండాలి..వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ 1.2 లక్షలు, అర్బన్‌ ప్రాంతాల్లో రూ 1.44 లక్షలకు మించకూడదు. అర్భన్‌ ప్రాంతాల్లో వెయ్యి చదరపు అడుగుల విస్తీర్ణం ఇల్లు ఉన్న వారితో పాటు- ఆదాయ పన్ను చెల్లించే వారికి ఈ పథకం వర్తించదు. 3 ఎకరాల మాగాణి, 10 ఎకరాల మెట్ట..రెండు కలిపి 10 ఎకరాలకు మించి భూమి ఉన్న వారు కూడా ఈ పథకానికి అనర్హులు. 18 మీటర్ల లోపు ఉన్న మోటరైజ్డ్‌ బోట్లకు యజమాని కాకుండా 8 మందికీ, 18 మీటర్ల కన్నా ఎక్కువ పొడవు ఉండే మెకనైజ్డ్‌ బోట్లకు యజమాని కాకుండా 10 మందికీ, ఇతర మోటరైజ్డ్‌ బోట్లకు యజమానితో కలిపి ఆరుగురు, నాన్‌ మోటరైజ్డ్‌ బోట్లకు యజమానితో సహా ముగ్గురు ఈ పథకం ద్వారా లబ్ది పొందేలా ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది

Advertisement

తాజా వార్తలు

Advertisement