Friday, November 22, 2024

దేశ జిడిపిలో మత్స్య ఉత్పత్తుల రంగం కీలకం…కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు

మచిలీపట్నం, జూలై 7( ప్రభ న్యూస్): భారతదేశ జిడిపిలో మత్స్య ఉత్పత్తుల రంగం ప్రధానమైనదని కేంద్ర సముద్ర విజ్ఞాన శాస్త్ర మంత్రిత్వ శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా సముద్ర సమాచార వ్యవస్థల భారత జాతీయ కేంద్రం ఆధ్వర్యంలో సముద్ర సమాచారం, సలహా సేవలపై భారీ అవగాహన కార్యక్రమం శుక్రవారం కృష్ణా జిల్లా మచిలీపట్నం రెవెన్యూ కల్యాణ మండపంలో నిర్వహించారు. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, బందరు పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి, జాయింట్ కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్ తదితరుల సమక్షంలో కేంద్ర మంత్రి జ్యోతి ప్రజ్వలన గావించి అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. సముద్ర సమాచార వ్యవస్థల భారత జాతీయ కేంద్రం హైదరాబాద్ వారు మత్స్యకారులు చేపల వేట యజమానులకు నిరంతరం సముద్ర సమాచారం అందిస్తున్నారని, సునామీ వంటి ప్రకృతి విపత్తుల విషయంలో ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తున్నారని అన్నారు. సముద్రంలో చేపలు సమృద్ధిగా దొరుకు ప్రాంతాలను గుర్తించి మత్స్యకారులు బోటు యజమానులకు తెలియజేస్తూ, సముద్రంలో ప్రమాదకరమైన ప్రాంతాలను గుర్తించి హెచ్చరించడం వంటి బృహత్తర సమాచారాన్ని అందజేస్తున్నట్లు తెలిపారు. ఇంతటి బృహత్తర కార్యకలాపాలను నిర్వహిస్తున్న ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓ షన్ ఇన్ఫర్మేషన్ సిస్టం (ఐ ఎన్ సి ఓ పి ఐ) వారు వారి కార్యకలాపాలను సముద్ర సంబంధిత సమాచారాన్ని మత్స్యకారులకు నేరుగా/ ప్రత్యక్షంగా వివరించి అవగాహన కల్పించేందుకు భారత ప్రభుత్వ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా భారతదేశ తూర్పు, పశ్చిమ తీరాలలో నిర్వహించ తలపెట్టిన 5 వర్క్ షాపుల్లో మొదటిగా ఆంధ్రప్రదేశ్ లో మచిలీపట్నంలో నేడు వర్క్ షాప్ ఏర్పాటు చేయడం మనందరికీ ఆనందదాయకమన్నారు.

దేశీయంగా అభివృద్ధి చేసిన సాంకేతికత ద్వారా సముద్ర సమాచారం, సలహా సేవలు అందజేయడం ఆత్మ నిర్భర్ భారత్ (భారతదేశ స్వావలంబన)కు ఎంతగానో దోహదం చేస్తుందన్నారు. గతంలో సముద్ర తీరంలో గుర్తించిన గ్రామాలలో ఏర్పాటు చేసిన సమాచార కేంద్రాల ద్వారా ఈ సమాచారాన్ని మత్స్యకారులకు, బోటు యజమానులకు అందించేవారన్నారు. కాలానుగుణంగా వచ్చిన సాంకేతిక అభివృద్ధి వలన నేడు మత్స్యకారులు, బోటు యజమానులు, సముద్ర సంబంధిత సంస్థలు, పరిశోధనా సంస్థలు, విద్యా కేంద్రాలు, విద్యార్థులు, సముద్ర పరిశోధకులు, నౌకా పరిశ్రమ, చమురు సహజవాయువు పరిశ్రమ, భారత నావికా దళం మరియు కో స్ట్ గార్డ్ మొదలగువారి ఆండ్రాయిడ్ /స్మార్ట్ ఫోన్ లకు ఇన్కయిస్ వారు నేరుగా సమాచారాన్ని చేరవేస్తున్నారన్నారు.

- Advertisement -

చేపలు సమృద్ధిగా దొరుకు ప్రాంతాల సమాచారం ద్వారా సమయం, ఇంధనం, డబ్బు, మానవ శక్తి ఆదా అవుతాయన్నారు. సునామీ వంటి ప్రకృతి విపత్తులకు సంబంధించిన ముందస్తు హెచ్చరికలు తీర ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకు ప్రత్యేకించి మత్స్యకారులకు ఆస్తి, ప్రాణ నష్ట నివారణకు ఎంతగానో ఉపయోగమన్నారు. ఈ ప్రాంత మత్స్యకారులు, బోటు యజమానులకు సముద్ర సంబంధిత విషయాలు చేపల సమృద్ధిగా దొరుకు ప్రాంతాలను గురించి మంచి అవగాహన పొందాలని కేంద్ర మంత్రి సూచించారు. భారతదేశానికి అపార సముద్ర తీరం ఉండడం మత్స్య రంగ అభివృద్ధికి దోహదం చేస్తున్నదని అన్నారు భారతదేశ జిడిపిలో మత్స్యరంగానిదే అగ్రస్థానం అన్నారు. సముద్ర తీరం అధికంగా గల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మత్స్య రంగ అభివృద్ధికి అపార అవకాశాలు ఉన్నాయని అన్నారు 2047 నాటికి భారతదేశ అభివృద్ధికి ప్రధాని దిశ నిర్దేశం చేశారని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement