నెల్లూరు, ప్రభన్యూస్ : సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకునే నిరుద్యోగ యువతకు ప్రభుత్వం గొప్ప అవకాశాన్ని కల్పించింది. సచివాలయం పరిధిలో ఒక మినీ రిటైల్ అవుట్ లెట్ ఏర్పాటు చేసి వివిధ రకాల తాజా చేపలు, పీతలు, రొయ్యల విక్రయాల సాగించి యువత లాభసాటి వ్యాపారం వైపు అడుగులేసేలా కార్యాచరణ రూపొందించింది. జిల్లాలో 169 కిలోమీటర్ల తీర ప్రాంతంతో పాటు 1,756 ఇరిగేషన్ చెరువులు, 7 రిజర్వాయర్లు, 4221 హెక్టర్ల మంచి నీటి సాగు, 9955 హెక్టర్ల ఉప్పునీటి సాగుతో అపారమైన నీటి వనరులు అందుబాటులో ఉన్నాయి. మన జిల్లాలోని నీటి వనరుల నుండి 5,08,580 టన్నుల చేపలు, రొయ్యలు, ఉత్పతి జరుగుతుంది. మత్స్య ఉత్పతి ఎక్కువగా పక్క రాష్ట్రాలకు, ఇతర దేశాలకు ఎగుమతి అవుతుంది. మన తలసరి చేపల వినియోగం ఏడు నుండి ఎనిమిది శాతం మాత్రమే ఉంది. దీనిని రానున్న మూడేళ్లలో 15 శాతానికి పెంచేందుకు ‘ఫిష్ ఆంధ్ర ఫిట్ ఆంధ్ర’ పేరిట రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక అమలు చేస్తుంది. ఇందుకు గాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా వంద ఆక్వా హబ్‌లు ఈ ఏడాదిలోనే అందుబాటులోకి తీసుకువచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ ఆక్వా హబ్ ల పరిధిలో మినీ రిటైల్ అవుట్లను సచివాలయం పరిధిలో ఒకటి ఏర్పాటు చేయనున్నారు. ఆసక్తిగల యువత ముందుకొస్తే రుణ సదుపాయం కల్పించి వ్యాపార అభివృద్ధికి అవసరమైన సహాయ సహకారాన్ని ప్రభుత్వం అందిస్తోంది. జిల్లాలో విరివిగా లభించే చేపలు, రొయ్యలు, పీతలు వంటి ఆరోగ్యానికి మేలు చేసే మత్స్య ఉత్పత్తులను మత్స్యకారుల నుంచి నేరుగా ఆక్వా హబ్ లకు చేర్చి అక్కడి నుంచి ఫిష్ ఆంధ్ర రిటైల్ అవుట్ లెట్లకు తరలించి ప్రజలకు అందుబాటులో ఉంచుతారు. అలాగే ఆక్వా హబ్ కు అనుసంధానంగా రెడీ టు కుక్ – రెడీ టు ఈట్ పేరుతో మత్స్య ఉత్పత్తుల ఆహారపదార్థాలను నిమిషాల్లో రెడీ చేసి అందించేలా ప్రణాళిక రూపొందించారు. ఈ రిటైల్ అవుట్ లెట్ల ఏర్పాటుకు మత్స్యశాఖ అధికారులు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అనుమతులు మంజూరు చేస్తున్నారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్వై) ద్వారా ఈ కార్యక్రమాన్ని వేగంగా అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం డిస్టిక్ ప్రోగ్రాం మేనేజర్ని, రాష్ట్ర ప్రభుత్వం జిల్లా సమన్వయకర్తను ప్రత్యేకంగా నియమించాయి.
జిల్లాకు నాలుగు ఆక్వా హబ్‌లు
జిల్లాకు నాలుగు ఆక్వా హబ్ లను ప్రభుత్వం మంజూరు చేసింది. నెల్లూరు, గూడూరు, ఆత్మకూరు, కావలిలో వీటిని ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తుంది. ఒక్కో హబ్ ఏర్పాటుకు రూ.2 కోట్ల ఖర్చు అవుతుండగా, లబ్ధిదారుని వాటాగా రూ.30 లక్షలు చెల్లిస్తే, మరో నలభై లక్షలు ప్రభుత్వం సబ్సిడీగా మంజూరు చేసి మిగతాది బ్యాంకు రుణంగా సమకూరుస్తుంది. ఒక్కో ఆక్వా హబ్‌కు అనుగుణంగా సుమారు 200 వరకు మినీ రిటైల్ అవుట్ లెట్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. వీటి ఏర్పాటుకు మత్స్యకారులకు, ఆక్వా రైతులకు, ఔత్సాహికులకు కేవలం రూ.36 వేల రూపాయలు పెట్టుబడి కాగా, మిగతాది రూ.1.89 లక్షలను ప్రభుత్వం రుణం మంజూరు చేయిస్తోంది. ఆక్వా హబ్ నిర్వాహకులు మత్స్యకారుల నుంచి, ఆక్వా రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసి రిటైల్ అవుట్ లెట్లకు తక్కువ లాభంతో అందిస్తారు. వాటిని కొనుగోలు చేసిన అవుట్ లెట్లు సరసమైన ధరకు ప్రజలకు విక్రయిస్తాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..