నాయుడుపేట, (ప్రభన్యూస్): జిల్లాలో రొయ్యల సాగుతో పాటు చేపల పెంపకం ద్వారా మంచి లాభాలు గడిస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ చేపలు, రొయ్యలను విక్రయించడం, పరిశుభ్రత లేని ప్రదేశంలో వీటిని అమ్ముతుండడంతో వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పైగా నాణ్యవంతంగా, సరసమైనటువంటి ధరలకు అవి లభించడం లేదన్న ఆందోళన ఉంది. ఇలాంటి వాటికి స్వస్తి పలుకుతూ నాణ్యమైన, సరసమైన ధరలకు హైజెనిక్‌గా వినియోగదారులకు అందించాలన్న ఆలోచనతో ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా ఫిష్‌ఆంధ్ర మినీ అవుట్‌లెట్లను ఏర్పాటు చేస్తోంది.
మత్య్సశాఖ ద్వారా వీటిని ఏర్పాటు చేసే విధంగా శ్రీకారం చుట్టింది. దీంతో మత్య్సశాఖ అధికారులు జిల్లా వ్యాప్తంగా వీటిని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు ప్రారంభించారు. ఇప్పటికే నెల్లూరులో 220 మినీ అవుట్‌లెట్లు ఏర్పాటు చేసేందుకు వ్యాపారస్తులు ముందుకు వచ్చారు. ప్రతి సచివాలయంలో ఒక మినీ ఫిష్ రిటైల్ అవుట్‌లెట్ ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపడుతున్నారు. చేపలు అమ్మేవారికి ఒక వేళ షాపులు ఉంటే షిఫ్ ఆంధ్ర బ్రాండ్ మత్య్సశాఖ ద్వారా ఏర్పాటు చేస్తారు. వారికి ఐస్‌బాక్సులు, కట్టర్‌లు, వెయిట్ మిషన్లు, షాపుకు అవసరమైనటువంటి డిజైనింగ్ మత్య్సశాఖ వారు అందజేస్తారు.
నిరుద్యోగ యువతీ, యువకులకు స్వయం ఉపాధి కల్పించే విధంగా ప్రభుత్వం కొత్తగా మినీ ఫిష్ రిటైల్ అవుట్‌లెట్లను తీసుకువచ్చింది. మన చేప -మన ఆరోగ్యం అన్న నినాదంతో ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందులో లబ్దిదారుడు కేవలం బ్యాంకు ఖాతాలో రూ 30వేలు డిపాజిట్ చేస్తే మిగిలిన సొమ్మును బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా అందించనున్నారు. దీంతో సొంతంగా మినీ ఫిష్ రిటైల్ అవుట్‌లెట్లను పెట్టుకుని వ్యాపారం చేసుకునే వెసులుబాటు ప్రభుత్వం కల్పిస్తోంది.
లోకల్ టు గ్లోబల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily