ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరెంటు కోతలు పెరిగాయి. ఇప్పటికే రోజుకు దాదాపు 6 గంటల పాటు కరెంటు కట్ అవుతుంది. ఈ క్రమంలో విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొలిసారిగా రాష్ట్రంలోని పరిశ్రమలకు పవర్ హాలిడేలు ప్రకటించింది. రాష్ట్రంలో మూడు డిస్కం పరిధిలో ఉన్న పరిశ్రమలకు పవర్ హాలీడే ప్రకటన చేసింది. పరిశ్రమలకు ప్రతి వారం ఒక్క రోజు పవర్ హాలీడే ఉంటుందని ప్రకటించింది. ఇక, వారంతపు సెలవుకు ఈ పవర్ హాలీడే అదనంగా ఉంటుందని వెల్లడించింది. శ్రీకాకుళం, విశాఖ, చిత్తూరు, కడప, అనంతపురం, నెల్లూరు, కర్నూలుతోపాటు ఉభయగోదావరి జిల్లాల్లో ఉన్న పరిశ్రమలకు వారానికి రెండు పవర్ హాలీడేస్ రాబోతున్నాయి. మిగత రోజుల్లో విద్యుత్ డిమాండ్ లో 50 శాతం సరఫరా చేయనున్నారు.
ఏపీ ట్రాన్స్ – కో తీసుకున్న ఈ నిర్ణయం నేటి (ఏప్రిల్ 8) నుండి ఏప్రిల్ 22 వరకు అమల్లో ఉంటుంది. దీంతో వారానికి ఒకరోజు మొత్తం విద్యుత్ కోత ఉంటుంది. సాధారణ రోజుల్లో కరెంటు కోతలు లేకుండా చూసుకోవడమే పవర్ హాలిడేస్ కాన్సెప్ట్ అని ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్రంలో మొత్తం 1,696 పరిశ్రమలకు వారానికి రెండు రోజుల పవర్ హాలీడేస్ ఉంటాయని తెలిపింది. అలాగే 253 ప్రాసెసింగ్ పరిశ్రమలు కూడా 50 శాతం కరెంటును వాడుకోవాలని సూచించింది.