Tuesday, November 26, 2024

TTD | దేశంలోనే తొలి సరోగసి దూడ జననం.. టీటీడీ ఆధ్వర్యంలో పిండ మార్పిడి సక్సెస్​

తిరుపతి (రాయలసీమ ప్రభ న్యూస్​బ్యూరో): తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ)కి చెందిన గో సంరక్షణ శాలలో దేశంలోనే తొలిసారిగా పిండ మార్పిడి (సరోగసి ) పద్ధతిలో ఒంగోలు ఆవుకు సాహివాల్ దూడ జన్మించింది. ఎస్వీ గోశాలలో ఇవ్వాల (ఆదివారం) ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టిటిడి ఈవో ధర్మారెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి సూచనలతో టీటీడీ, ఎస్వీ పశువైద్య విశ్వవిద్యాలయం సంయుక్తంగా దేశావాళీ గో జాతులను అభివృద్ధి చేయాలని గత ఏడాది ఎంఓయు కుదుర్చుకున్నాయి.

ఇందులో భాగంగా మేలు రకమైన దేశవాళీ గో జాతిని అభివృద్ధి చేసే క్రమంలో ఎస్వీ గో సంరక్షణ శాలలోని మేలు జాతి ఆవుల నుండి అండం సేకరించి, ఎస్వీ పశువైద్య విశ్వవిద్యాలయంలోని ఐవిఎఫ్ ల్యాబ్ లో కృత్రిమంగా పిండాలను అభివృద్ధి చేశారన్నారు. ఈ విధానం కింద టీటీడీ గోశాలలోని ఆవులలో ప్రవేశపెట్టి దేశంలోనే తొలిసారిగా విజయం సాధించినట్లు ఈవో తెలిపారు. ఈ ప్రక్రియలో శనివారం రాత్రి ఒంగోలు ఆవుకు జన్మించిన సాహివాల్ దూడకు పద్మావతి అని నామకరణం చేసినట్టు ధర్మా రెడ్డి తెలిపారు.

తిరుమల శ్రీవారి ఆలయంలో ధూప దీప నైవేద్యాలకు, నిత్య కైంకర్యాలకు అవసరమయ్యే పాలు, పెరుగు, వెన్న, నెయ్యిని దేశవాళీ ఆవుపాల నుండి ఉత్పత్తి చేయాలని నిర్ణయించినట్లు తెలియజేశారు. ఇందుకోసం ఇప్పటికే 200 దేశీయ గోవులను దాతలు సమకూర్చారని, మరో 300 గోవులను సమకూర్చేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పారు. ఆవుల ఆరోగ్య పరంగా, అధిక పాల దిగుబడి దిశగా నాణ్యత కలిగిన దాణా తయారీ చేసుకోవడానికి ఇటీవలే గోశాలలో ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్ ప్రారంభించినట్లు చెప్పారు. అదేవిధంగా గోశాలలో రోజుకు సుమారు 3 వేల నుండి 4 వేల లీటర్ల ఆవు పాలను ఉత్పత్తి చేయనున్నట్లు ఈవో తెలిపారు. రోజుకు 60 కేజీ ల స్వచ్ఛమైన నెయ్యిని సాంప్రదాయ పద్ధతిలో తయారు చేసి స్వామి వారి నిత్య కైంకర్యం, నైవేద్యాలకు వాడేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు.

- Advertisement -

ఈ సమావేశం లో పాల్గొన్న ఎస్వీ పశు వైద్య విశ్వవిద్యాలయం విసి డాక్టర్ పద్మనాభరెడ్డి మాట్లాడుతూ, రానున్న 5 సంవత్సరాల్లో 324 మేలు రకమైన సాహివాల్ గోజాతి దూడలను ఉత్పత్తి చేయడం జరుగుతుందన్నారు. దీనిలో భాగంగా పిండ మార్పిడి చేయబడిన ఆవులలో ఇప్పటి వరకు 11 గోవులు గర్భం దాల్చినట్లు తెలిపారు. ఒక ఆవు శనివారం రాత్రి సాహివాల్ పెయ్య దూడకు జన్మనిచ్చిందన్నారు. రానున్న రోజుల్లో ఇంకా 10 సాహివాల్ దూడలు జన్మించనున్నాయని తెలియజేశారు. ఈ కార్యక్రమం లో టి టి డి జేఈవో సదా భార్గవి, గో సంరక్షణ ట్రస్ట్ సభ్యులు రామ్ సునీల్ రెడ్డి, గో సంరక్షణ శాల డైరెక్టర్ హరినాథరెడ్డి, ఎస్వీ పశువైద్య విశ్వవిద్యాలయం డీన్ వీర బ్రహ్మయ్య, వెంకట్ నాయుడు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement