పేలిన ఆరు సిలిండర్లు
కట్టుబట్టలతో 14 కుటుంబాలు రోడ్డు పాలు
చలించిన మంత్రి నారాయణ
ఒక్కొక్క కుటుంబానికి రూ.15 వేలు ఆర్థిక సాయం
తక్షణ సాయం చర్యల్లో కలెక్టర్ హరినారాయణ్
నెల్లూరు సిటీలోని బర్మాస్టాల్ గుంటలో భారీ అగ్నిప్రమాదం కలచివేసింది. గురువారం మద్యాహ్నం అకస్మాత్తుగా మంటలు రేగాయి. ఈ ప్రమాదంలో ఆరు గ్యాస్ సిలిండర్లు పేలిపోగా.. నాలుగు ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. దుర్ఘటనలో నాగలక్ష్మి (12) అనేక బాలిక దుర్మరణం చెందింది.
అకస్మాత్తుగా భీకర శబ్దంతో సిలిండర్లు పేలటంతో జనం బీతావహులయ్యారు. ఇళ్లల్లోంచి బయటకు పరుగులు తీశారు. అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. హుటాహుటిన ఘటన స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అప్పటికే ఘోరం జరిగిపోయింది. ఇంటిలోని 12 ఏళ్ల బాలిక సజీవ దహనమైంది.. పెద్ద ఎత్తున పొగలు.. అగ్ని కీలలు వ్యాపించాయి. బాధితులు హాహాకారాలతో బర్మా షెల్ గుంట మార్మోగిపోయింది.
చలించిన మంత్రి నారాయణ ….
ఈ సమాచారంతో టీడీపీ నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ ప్రమాద స్థలికి చేరుకున్నారు. మరోవైపు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ స్పందించారు. ఒక్కొక్క కుటుంబానికి రూ.15వేలు తక్షణ సాయం ప్రకటించారు. మొత్తం 14 కుటుంబాలు ఈ అగ్నిప్రమాదంలో తీవ్రంగా నష్టపోయాయి. కట్టుబట్టలతో ఈ కుటుంబాలు రోడ్డు పాలయ్యాయి. ఈ కుటుంబాలన్నీ నిరుపేద కుటుంబాలే. బాధిత కుటుంబాలకు మంత్రి నారాయణ పంపించిన నగదును అబ్దుల్ అజీజ్ అందజేశారు. మరోవైపు తక్షణ సహాయక చర్యలను కలెక్టర్ హరి నారాయణన్ పర్యవేక్షించారు. మృతి చెందిన బాధితురాలు కుటుంబాన్ని పరామర్శించారు.