Friday, November 22, 2024

Finance Crisis – ఆర్థిక సంఘం నిధుల‌పై నీలి నీడ‌లు – డ‌బ్బులు లేక పంచాయితీలు విల‌విల

అమరావతి, ఆంధ్రప్రభ: స్థానిక సంస్థలకు కేంద్రప్రభుత్వం ఇచ్చే ఆర్థికసంఘం నిధులపై నీలినీడలు కమ్ముకున్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరం ముగిసి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నా కేంద్రప్రభుత్వం నిధులు విడుదల చేయని పరిస్థితి ఏర్పడింది. ఆర్థిక సంఘం నిధులను కేంద్రప్రభుత్వం నాలుగు పర్యాయాలు (మూడు నెలలకు ఒకసారి) స్థానిక సంస్థలకు మంజూరు చేస్తుంది. అవి రాష్ట్రప్రభుత్వానికి వస్తే జనాభా నిష్పత్తి ప్రకారం గ్రామ పంచాయతీలకు కేటాయిస్తుంది. అయితే రాష్ట్రప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో కేంద్రం ఆర్థిక సంఘ నిధుల మంజూరు విషయంలో కఠిన వైఖరి అవలంబిస్తోందనే వార్తలు వెలువడ్డాయి.

గతంలో ఎన్నడూలేని విధంగా ఏడాది కాలంగా కేంద్రప్రభుత్వం ఆర్థిక సంఘం నిధులను రాష్ట్రాల్రకు అంతంతమాత్రంగానే విడుదల చేస్తోంది. వచ్చిన అరకొర రాష్ట్రప్రభుత్వమే ఖర్చు చేస్తోంది. 2022-23కు సంబంధించిన ఆర్థిక సంఘం నిధులను కేంద్రం ఇంతవరకూ మంజూరు చేయలేదు. కాగా 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.2210 కోట్లకుగానూ కేంద్రం రూ.988 కోట్లు- గత నెల 15న విడుదల చేసిందని, వాటిని నేటికీ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీల ఖాతాల్లో జమ చేయలేదని సర్పంచ్‌ లు తెలిపారు. గతంలో ఎప్పుడూ ఈ పరిస్థితి లేదన్నారు. అయితే దాని కన్నా ముందు ఏడాదికి సంబంధించి మంజూరు చేసిన నిధులకు వ్యయ వివరాలను రాష్ట్రప్రభుత్వం కేంద్రానికి నివేదించలేదు. దీంతో ఇచ్చిన నిధులకు లెక్కలు చూపలేదన్న కారణంతో కేంద్రం 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మిగులు నిధుల మంజూరును ఆపేసింది. ఆ ప్రభావం గ్రామ పంచాయతీలపై పడింది.

పంచాయతీలు విలవిల
గ్రామ పంచాయతీలలో చిన్న పనులు చేసేందుకు కూడా నిధులు లేని పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతోనే ఈ దుస్థితి ఏర్పడిందనే విమర్శలు సర్పంచ్‌ ల నుంచి వ్యక్తమవుతున్నాయి. అయితే 2023-24 ఆర్థిక సంవత్సరం ప్రారంభమై మూడో నెల పూర్తికాబోతోంది. ఈఏడాదికి సంబంధించిన ఆర్థిక సంఘం నిధుల మంజూరు విషయంలో ప్రభుత్వం నుంచి ఇంతవరకూ చలనం కరువైంది ఎన్నో ఆశలతో రెండేళ్ల క్రితం సర్పంచ్‌లుగా ఎన్ని-కై-న వారు ప్రస్తుతం నిధులు లేక అల్లాడిపోతున్నారు. గ్రామ పంచాయతీలకు అరకొరగా వచ్చిన సాధారణ నిధులను కూడా ప్రభుత్వం లాగేసుకుంటోంది. విద్యుత్‌ చార్జీలు, కార్మికులకు వేతనాల చెల్లింపులు చేసే విధంగా పంచాయతీ కార్యదర్శులపై ఒత్తిడి తెచ్చి వాటిని జమ చేసుకుంటు-న్నారు. దీంతో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఆందోళన చెందుతున్నారు.
ఇదిలా వుండగా
పంచాయతీలకు కేంద్రం నుంచి విడుదలైన 15వ ఆర్థిక సంఘం నిధులను పంచాయతీల ఖాతాల్లో వెంటనే జమ చేయాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జూలై మూడున పంచాయతీరాజ్‌ కమిషనర్‌ కార్యాలయాన్ని ముట్టడించనున్నట్లు- సర్పంచ్‌ల సంఘం ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసింది.
ఎక్కడికక్కడ మంత్రుల, ముఖ్యనేతల ఇళ్లను ముట్టడిస్తామని, సర్పంచ్‌లు అంటే ఏంటో చూపిస్తామన్నారు. రెండున్నరేళ్లుగా పంచాయతీలకు నిధులు లేక సర్పంచ్‌లు ఇబ్బందులు పడుతున్నారని, అనేకమంది ఆత్మహత్యకు పాల్పడ్డారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో తామే ఢిల్లీ వెళ్లి, కేంద్ర మంత్రితో మాట్లాడి నిధులు తెచ్చుకున్నట్లు- సంఘం నేతలు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement