Monday, November 18, 2024

Big Story | తిరుపతి జిల్లాలో ఖరారైన వైసీపీ వ్యూహం.. నలుగురికి గ్రీన్‌ సిగ్నల్‌

తిరుపతి (రాయలసీమ ప్రభ న్యూస్‌ బ్యూరో) : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రాంతీయ ఇన్‌ఛార్జ్‌, ఎంపీ విజయసాయిరెడ్డి తాజా పర్యటనతో రానున్న ఎన్నికలలో తిరుపతి జిల్లాలో ఆ పార్టీ అభ్యర్థిత్వాల ఎంపిక వ్యూహం ఖరారైంది. మొత్తం ఏడు శాసనసభ నియోజకవర్గాలలో నాలుగు స్థానాలకు అభ్యర్థిత్వాలు ఖరారు అయ్యాయి. మరో మూడు చోట్ల అభ్యర్థిత్వాల ఎంపిక కార్యక్రమం మొదలైంది. ఆ మూడు స్థానాల అభ్యర్థిత్వాల విషయంలో వివిధ స్థానిక నాయకుల, కీలక కార్యకర్తల అభిప్రాయాలను సేకరించడం కూడా మొదలెట్టినట్టు స్పష్టమవుతోంది.

ఏడాది క్రితం ఏర్పడిన తిరుపతి జిల్లా పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాలకు 2019లో జరిగిన ఎన్నికలలో వైకాపా అభ్యర్థులు విజయం సాధించిన విషయం తెలిసిందే. తిరుపతి లోక్‌సభ నియోజకవర్గానికి జరిగిన మధ్యంతర ఎన్నికల నుంచి ఇతర స్థానిక ఎన్నికలలో కూడా విజయం సాధించడం ద్వారా ఆ పార్టీ తమకు ఎదురులేదనే ధీమాతోనే ఉంది. అయితే ఈ మధ్యకాలం లోనే చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నడుమ జిల్లా పరిధిలోని వెంకటగిరి నియోజకవర్గ శాసనసభ్యుడు ఆనం రామనారాయణ రెడ్డి పార్టీ నుంచి వెళ్లిపోవడం ఒక చిన్న కుదుపునకు కారణమైందని చెప్పక తప్పదు.

- Advertisement -

కానీ గత మంత్రివర్గ విస్తరణలో తనకు స్థానం లభిస్తుందని ఆశించి అసంతృప్తితో ఉన్న రామనారాయణ రెడ్డి పార్టీని వదిలి వెళ్తారనే సంకేతాలు దాదాపు రెండేళ్ల నుంచి అందుతూ ఉండడంతో పార్టీవర్గాలు పెద్దగా స్పందించలేదు. ఈ నేపథ్యంలో జిల్లాలోని ఇతర నియోజకవర్గాల్లో కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి, అందులో ముఖ్యంగా చంద్రగిరి శాసనసభ్యుడు చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి రాష్ట్ర పార్టీ కార్యకలాపాలకు అవసరమని అధినేత జగన్‌ మోహన్‌ రెడ్డి భావించడంతో అయన కుమారుడు చెవిరెడ్డి మోహిత్‌ రెడ్డి రంగంలోకి దిగారు. దాదాపు రెండుమూడు నెలలుగా మోహిత్‌ రెడ్డి తండ్రి పర్యవేక్షణలో నియోజకవర్గంలో విస్తృతంగా తిరుగుతూ ప్రచారం కొనసాగిస్తున్నారు.

అలాగే తిరుపతి శాసన సభ్యుడు భూమన కరుణాకర రెడ్డిని టీటీడీ చైర్మన్‌ గా నియమించడంతో ఆ స్థానంలో ఆయన కుమారుడు, నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్‌ భూమన అభినయరెడ్డికి అవకాశం కల్పించారు. అదేవిధంగా ఆనం రామనారాయణ రెడ్డి నిష్క్రమణతో ఆ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గానే కాక జిల్లా పార్టీ ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తున్న నేదురుమల్లి రామ్‌కుమార్‌ రెడ్డి వెంకటగిరి నుంచి పోటీ చేయనున్నారు. దాన్ని ఇటీవల పర్యటనలో సాక్షాత్తూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి కూడా ప్రకటించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసన సభ్యుడు బియ్యపు మధుసూదనరెడ్డి అభ్యర్థిత్వానికి పోటీ వస్తారని ప్రచారం జరిగిన మాజీ శాసనసభ్యుడు ఎస్‌సివి నాయుడు తెలుగుదేశం పార్టీలో చేరి పోయారు.

మిగిలిన గూడూరు, సూళ్లూరు పేట, సత్యవేడు నియోజకవర్గాల శాసన సభ్యుల విషయంలో స్థానిక పార్టీ వర్గాల్లో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో విజయసాయి రెడ్డి తాజాగా చేపట్టిన రెండు రోజుల పాటు తిరుపతి పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. రెండురోజుల పాటు ఏడూ నియోజకవర్గాల స్థానిక నాయకులతో వివిధ కోణాలలో ఆయన సమీక్ష నిర్వహించారు. దాదాపుగా అన్ని నియోజకవర్గాల పార్టీ నాయకులు, కీలక కార్యకర్తలు పాల్గొని తమ అభిప్రాయాలను తెలియచేశారు.. ఒక విధంగా ఈ రెండు రోజుల సమీక్ష అభ్యర్థిత్వాల ఖరారు ప్రక్రియకు శ్రీకారంగా అనిపించినా ఆయన మాత్రం కేవలం పార్టీని బలోపేతం చేయడానికి అవసరమైన సలహాలు సూచనలు మాత్రమే తీసుకోడానికి వచ్చినట్టు చెప్పుకున్నారు.

అయితే సమీక్షా సమావేశాల క్రమంలోనే చంద్రగిరి నుంచి మోహిత్‌ రెడ్డి, తిరుపతి నుంచి అభినయ రెడ్డి, శ్రీకాళహస్తి నుంచి మధుసూదన రెడ్డి, వెంకటగిరి నుంచి రామ్‌కుమార్‌రెడ్డి లను అభ్యర్థులుగా పేర్కొంటూ వారి గెలుపుకోసం అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. మిగిలిన నాలుగు నియోజకవర్గాల విషయంలో పార్టీ అధినేత తగిన సమయంలో తగు నిర్ణయం తీసుకుంటారని మాత్రం ప్రకటించారు. ఈ కోణంలో చూసినప్పుడు జిల్లా పరిధిలో చంద్రగిరి, తిరుపతి, శ్రీకాళహస్తి, వేంకటగిరి నియోజకవర్గాల అభ్యర్థిత్వాలు ఖరారైనట్టు స్పష్టమవుతోంది.

మిగిలిన మూడు నియోజవర్గాలలో పార్టీ వర్గాల నుంచి వ్యక్తమైన భిన్న,విభిన్న అభిప్రాయాలు ఆ ముగ్గురి అభ్యర్థిత్వాల విషయంలో మరికొంత కాలంవేచి చూడక తప్పదనే సంకేతాలను విజయసాయి రెడ్డి సమీక్ష వెల్లడించింది. పైగా ఆ మూడు నియోజకవర్గాల్లో అభ్యర్థిత్వాలను ఆశించే వారు కూడా ఎక్కువగా ఉండటం కూడా వేచిచూడాల్సిన పరిస్థితికి కారణమవుతోందని తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ విజయసాయి రెడ్డి తాజా పర్యటన జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల అభ్యర్థిత్వాలను ధృవీకరించి, మిగిలిన మూడు నియోజవర్గాల అభ్యర్థిత్వాలను సస్పెన్స్‌ లో ఉంచడానికి ఉపకరించినట్టు- చెప్పక తప్పదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement