Saturday, November 23, 2024

మ‌త్స్య‌కారుల‌కి కాసుల వ‌ర్షం కురిపించిన- పుల‌స చేప‌

మ‌త్య్స‌కారుల‌కి కాసుల వ‌ర్షం కురిపించింది పుల‌స‌చేప‌.కోనసీమ జిల్లాలో పులస చేప రికార్డ్ ధర పలికింది. స్థానికంగా నిర్వహించిన చేపల వేలపాట నిర్వహించగా.. ఏకంగా రూ.22వేల ధర దక్కింది. స్థానిక వశిష్ఠ గోదావరి నదిలో వేటకు వెళితే మత్స్యకారులకు మూడు కిలోల పులస చేప చిక్కింది. ఈ చేపను రాజోలు మార్కెట్‌లో అమ్మకానికి పెట్టగా పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన బైరిశెట్టి శ్రీరాములు అనే వ్యక్తి రూ.22 వేలకు కొనుగోలు చేశారు. ఈ ఏడాది పులసల సీజన్‌ ప్రారంభమయ్యాక స్థానిక గోదావరిలో దొరికిన మొదటి పులసని చెబుతున్నారు. రెండు నెలల క్రితం కూడా యానాం సమీపంలో పులస చేప దొరకగా.. రూ.19వేల ధర పలికింది. గోదావరి జిల్లాల్లో పులస చేపకు మంచి డిమాండ్ ఉంది. వర్షాకాలం ప్రారంభమైన వెంటనే పులసల సీజన్ కూడా మొదలవుతుంది.

అంతేకాదు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో ఈ చేపలు ఎక్కువగా లభిస్తుంటాయి. భైరవపాలెం, అంతర్వేది, యానాం, నరసాపురం ప్రాంతాల్లో కనిపిస్తాయని స్థానికులు చెబుతుంటారు. గోదావరి జలాలు సముద్రంలో కలిసే ఈ రెండు పాయల దగ్గరే పులసలు ఉంటాయట.ఈ చేపలు వేల కిలో మీటర్ల దూరం నుంచి ఖండంతరాలు దాటుతూ.. నీటికి ఎదురీదుతాయి. అందుకే ఈ చేపకు మార్కెట్‌లో క్రేజ్ ఉంటుంది.. ఈ పులస దొరకడమే చాలా అరుదు కావడంతో ఎంత ధర ఉన్నాసరే వెనక్కు తగ్గరు. పులసను దక్కించుకునేందుకు జనాలు పోటీపడుతున్నారు. మత్స్యకారులకు కూడా పండగే. ఈ పులసలు ఒడిశాతో పాటు బంగ్లాదేశ్ తీరాల్లో కూడా ఉంటాయట. కానీ ఇలసగా పిలిచే ఈ చేప గోదావరిలోకి ఎర్రనీరు రాగా ఎదురు వైపు ఈదుకుంటూ నదిలోకి వచ్చి రెండు మూడు రోజుల్లోనే పులసగా మారుతుందట‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement