అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో ఎరువులు, పురుగు మందుల దుకాణాలు రైతులను దోచు కుంటున్నాయి. ఎమ్మార్పీ కన్నా అధికంగా వసూలు చేసున్న వ్యాపారులు రైతన్న జేబుకు చిల్లు పెడుతున్నారు. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని విధాలా భరోసా ఇస్తూ చర్యలు చేపడుతుంటె,మరోవైపు దళారులు, వ్యాపారులు పెద్ద ఎత్తున ఎరువులు, పురుగు మందుల అమ్మకాల రూపంలో వారిని అర్ధికంగా కొల్లగొడుతున్నారు. ఒక్క ధరల విషయంలోనే కాక.. అనుమతి లేని విక్రయాలు, అక్రమ నిల్వలు, రికార్డుల అవకతవకలు వంటి అక్రమాలకు పాల్పడుతున్నట్లు విజిలెన్స్ నిగ్గు తేల్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎరువులు, పురుగుమందుల వ్యాపారుల అవినీతి అక్రమాలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. రైతులు, ప్రజల నుంచి అందుతున్న ఫిర్యాదుల దృష్ట్యా రంగంలోకి దిగిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా 77 హోల్‌సేల్, రి-టైల్ డీలర్లు, ఎరువులు, పురుగుమందుల వ్యాపారులపై దాడులు నిర్వహించారు. విజిలెన్స్ డీజీ శంకభ్రత బాగ్చీ ఆదేశాలతో రంగంలోకి దిగిన విజిలెన్స్ బృందాలు ఏకకాలంలో నిర్వహించిన ఈ తనిఖీల్లో వ్యాపారులు ప్రభుత్వ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినట్లు గుర్తించారు. యూరియా, డిఏపీ ఎమ్మార్పీ కంటే అధికంగా విక్రయాలు జరుపుతున్నారు.అదేవిధంగా ఎరువులు, పురుగు మందుల నిల్వలకు సంబంధించి పెద్ద ఎత్తున అక్రమాలు వెలుగు చూశాయి.
ఈ-పోస్ యంత్రం, బుక్ బ్యాలెన్స్‌కు, ఎరువుల నిల్వలకు మధ్య చాలా వ్యత్యాసాన్ని గుర్తించారు. అనేక చోట్ల ‘ఓ’ ఫారం లేకుండా ఎరువులు విక్రయించడం, స్టాక్ రిజిస్టర్లను సరిగ్గా నిర్వహించకపోవడ ం వంటి వైఫల్యాను కనుగొన్నారు. బిల్ బుక్స్, స్టాక్ బోర్డులు అప్డేట్ కాకపోవడం, పురుగుల మందుల లైసెన్స్‌కు సంబంధించి పరిగణనలోకి తీసుకునే ప్రిన్సిపల్ సర్టిఫికెట్లు లేకుండా విక్రయాలు జరపడం వంటి అంశాలు విజిలెన్స్ తనిఖీల్లో ప్రధానంగా బట్టబయలయ్యాయి. దీంతో ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరలకు ఎరువులు విక్రయించడంపై లీగల్ మెట్రాలజీ చట్టం 2007 సెక్షన్ 18/36 కింద అధికారులు రెండు కేసులు నమోదు చేశారు. అదేవిధంగా డీలర్లపై ఆరు కేసులు నమోదు చేశారు. పరిమితికి మించి ఎరువులను అదనపు నిల్వలు ఉంచినందుకుగాను 6ఏ ఆఫ్ ఎసెని ్షయల్ కమోడిటీస్ యాక్టు కింద 18 కేసులు నమోదయ్యాయి. అధికారులు కేసులు నమోదు చేయడంతోపాటు అదనపు నిల్వలను సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న ఎరువుల నిల్వల పరిమాణం 243.192 మెట్రిక్ టన్నులు కాగా వీటి విలువ రూ.29,14,225లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఇక పురుగుమందుల నిల్వలకు సంబంధించి 11 కేసులు నమోదు కాగా సీజ్ చేసిన 956.35 లీటర్ల పరిమాణం కలిగిన నిల్వలు రూ.19,37,703లు ఉంటుందని అంచనా వేశారు. ఘన పురుగు మందుల నిల్వలు 105.95 కేజీలు కాగా వీటి నిల్వల విలువ రూ.2,95,830లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. తనిఖీల్లో కేసులు నమోదు చేసిన వ్యాపారులు, డీలర్లు, దుకాణాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతోపాటు ఇందుకు సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి ఇవ్వడం ద్వారా సంబంధిత శాఖలకు సిఫార్సు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు విజిలెన్స్ డీజీ శంక భ్ర త బాగ్చీ తెలిపారు. మరిన్ని తనిఖీలు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు.