Friday, November 22, 2024

ఎరువు .. కరువు.. యూరియా కోసం వెంపర్లాట

నాయుడుపేట, (ప్రభన్యూస్‌): యూరియాకు ఉన్న డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని కొంతమంది వ్యాపారస్తులు దోపిడికి పాల్పడుతున్నారు. బస్తాపై అధనంగా రూ 100లు వసూలు చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. రైతు భరోసా కేంద్రాలు, సహకార సంఘాలలో సైతం యూరియా లేకపోవడంతో రైతులు అయోమయంలో పడ్డారు. ప్రైవేటు దుకాణాల వద్ద డీలర్లు స్టాక్‌ లేదని చేతులెత్తెయడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఇటీవల ఎరువుల ధరలను అమాంతంగా పెంచారు. ఒక్క డీఏపీ తప్ప 14-35-14 రూ 1700లు, 28-28 రూ 1900లు చేశారు. ఇదే ఎరువు నెలరోజులకు ముందు రూ1450లు మాత్రమే ఉండగా అధనంగా రైతు నెత్తిన రూ 450లు పడింది.

పోటాష్ రూ.1000లు ఉండగా ప్రస్తుతం రూ.1700లకు విక్రయిస్తున్నారు. పోటాష్‌ బస్తాపై రూ.700లు అధనంగా పెరగడంతో రైతులు ఇక చేసేది ఏమిలేక ఆ ధరలకు ఎరువులను కొనుగోలు చేసి వినియోగించుకుంటున్నారు. డీఏపీ రూ.1200 ఉన్నప్పటికీ మిగిలిన కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు పెరగడంతో డీఏపీకి సైతం డిమాండ్‌ ఏర్పడింది. కేంద్రం నుంచి దిగుమతి అవుతున్న ఎరువులను రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలు, సొసైటీలకు 70శాతం సరఫరా చేస్తుంటే ప్రైవేటు డీలర్లకు 30శాతం మాత్రమే సరఫరా చేస్తున్నారు. యూరియా ధర మాత్రం పెరగలేదు. రూ.266లకు యూరియా అందిస్తున్నారు. అయితే దుకాణాలు, రైతు భరోసా కేంద్రాలు, సచివాలయాల్లో యూరియా దొరికే పరిస్థితి లేకుండా పోయింది. రైతు భరోసా కేంద్రాలకు సరఫరా చేసిన యూరియా పలుకుబడి కలిగిన వారికి మాత్రమే అందించారన్న విమర్శలు ఉన్నాయి.

సూళ్లూరుపేటలో యూరియా కోసం తొక్కిసలాట..

సూళ్లూరుపేటలో గురువారం యూరియా కోసం ఆయా గ్రామాల నుంచి పెద్ద ఎత్తున రైతులు మన గ్రోమోర్‌ దుకాణం వద్దకు చేరుకున్నారు. భారీ సంఖ్యలో రైతులు దుకాణం వద్దకు చేరుకోవడంతో యూరియా అందించడం దుకాణ దారులకు భారంగా మారింది. ఒక దశలో యూరియా కోసం రైతులు ఎగబడడంతో తొక్కిసలాట ఏర్పడింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి రైతులకు టోకన్లు అందించి యూరియా తీసుకునే విధంగా పరిస్థితిని చక్కబరిచారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement