పుంగనూరు (రాయలసీమ ప్రభ వెబ్ ప్రతినిధి) : చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో రూ.165 కోట్ల వ్యయంతో ఏర్పాటు కానున్న ఫెర్రో అలాయి పరిశ్రమకు శుక్రవారం భూమిపూజ జరిగింది. 250 మందికి ప్రత్యేక్షంగా, 800మందికి పరోక్షంగా ఉపాధి కల్పించే ఆ పరిశ్రమ ఏర్పాటుకు ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ లిమిటెడ్ ముందుకు వచ్చింది. ఆరడిగుంట వద్ద 56 ఎకరాల స్థలంలో ఏర్పాటు కానున్న ఆ పరిశ్రమకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూమిపూజ చేశారు. ఈ సందర్బంగా మంత్రి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ… పారిశ్రామికవేత్తలు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనపై నమ్మకంతో ఉన్నారని, గతంలో అనేక ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ లు పెట్టినా రాని వ్యాపారవేత్తలు ఇప్పుడు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారన్నారు.
విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో 13 లక్షల కోట్ల పెట్టుబడులు రాగా, అందులో ఒక్క ఇంధన శాఖలో 9 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. ఈరోజు డి.ఐ పైపులకు పూర్తి స్థాయి డిమాండ్ ఉందని, ఇరిగేషన్ లో కూడా ఇవి పెద్దఎత్తున వినియోగిస్తున్నారంటూ పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన వసతి సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాజంపేట లోకసభ సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మాట్లాడుతూ.. శ్రీకాళహస్తిలో వారి పరిశ్రమ ఉన్నా.. ఇక్కడ మరొకటి ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. ఒక్కొక్క పరిశ్రమ కాదు, ఒక ఇండస్ట్రియల్ కారిడార్ ఇస్తాను అని సిఎం వైఎస్ జగన్ హామీ ఇచ్చారన్నారు. ఇన్ని రోజులు నీటి వసతులు లేక ఇక్కడ పరిశ్రమల ఏర్పాటు జరగలేదని, ఈరోజు మన నియోజకవర్గంలో మూడు ప్రాజెక్టులు నిర్మాణం జరుగుతుందని, అవి పూర్తయ్యాక మరిన్ని పరిశ్రమలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిత్తూరు లోక్ సభ సభ్యుడు ఎన్.రెడ్డప్ప, జిల్లా పరిషత్ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ ఎం. హరినారాయణన్, తదితరులు పాల్గొన్నారు.