ఒంగోలు, ప్రభన్యూస్ : జిల్లాలోని విద్యా సంస్థలకు థర్డ్‌వేవ్ తాకింది. పాఠశాలలను కరోనా మహమ్మారి మళ్లీ భయపెడుతోంది. జిల్లాలోని పలు విద్యా సంస్థల్లో విద్యార్ధులకు కరోనా లక్షణాలు బయటపడుతుండటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. జిల్లాలో 17 మంది విద్యార్ధులకు కరోనా పాజిటివ్ నిర్దారణ కావడంతో.. విద్యా సంస్థలు వైరస్‌కు హాట్‌స్పాట్లుగా మారాయి. కొవిడ్ మూడో వేవ్‌లో కేసులు శర వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో చిన్నారుల పై ప్రభావం ఎక్కువగా ఉంటుందన్న వార్తలు భయపెడుతోంది. పాఠశాలల్లో నిబంధనలు పాటిస్తున్నారో లేదోనని విద్యాశాఖ ఉన్నతాధికారులు కనీసం ఆరా తీయడం లేదు. అధికశాతం బడుల్లో విద్యార్ధుల మధ్య భౌతిక దూరం..మాస్కుధారణ కానీ కనిపింయడం లేదు. అక్కడక్కడా మాత్రం తూతూ మంత్రంగా పాటిస్తున్నా.. చాలా చోట్ల కోవిడ్ నిబంధనలు అమలు కావడం లేదు. ఇక పాఠశాలల బస్సులు, ఆటోల్లో పరిమితికి మించి విద్యార్ధులను గుంపులుగా ఎక్కిస్తున్నారు.
పట్టించుకోని విద్యాశాఖ అధికారులు..
ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో కరోనా కేసులు పెగుతున్నా..విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రైవేటు పాఠశాలల్లో కోవిడ్ నిబంధనలను గాలికి వదిలేశారు. జిల్లా వ్యాప్తంగా పాఠశాలలను అధికారులు ఇంత వరకు తనిఖీలు చేసిన దాఖలాలు లేవు. ప్రైవేటు పాఠశాలలను కూడా తనిఖీ చేయకపోవడం పై తల్లిదండ్రులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఒక్క రోజే పాఠశాలల్లో 17 కరోనా కేసులు నిర్ధారణ కావడంతో తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు.
నిబంధనలివి…
ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల తరగతి గదులను పూర్తి స్థాయిలో శానిటైజ్ చేయాల్సి ఉంది. థర్మల్ స్త్రీనింగ్ అనంతరమే విద్యార్ధులను తరగతి గదిలోకి అనుమతించాలి. కానీ, ఆ పరికరాలు లేకపోవడంతో విద్యార్ధులను అలాగే అనుమతించేస్తున్నారు. కొన్ని చోట్ల శానిటైజేషన్ కూడా చేయించడం లేదు. విద్యార్ధులు భౌతిక దూరం పాటించకపోవడం.. శానిటైజేషన్ లేక పోవ డంతో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంది. పాఠశాలల్లో ఒక్క రోజు 17 కేసులు నమోదు అయిన విషయం తెలుసుకున్న విద్యార్ధుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తమ పిల్లలు ఉండే స్కూల్స్‌కు, హాస్టళ్లకు ఫోన్లు చేసి ఆరా తీస్తున్నారు. భయాన్ని పోగొట్టేందుకు వీడియో కాల్స్ ద్వారా స్టూండెంట్స్‌తో తల్లిదండ్రులను మాట్లాడిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసంఫేస్‌బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..