ఆంధ్రప్రభ స్మార్ట్ – నంద్యాల జిల్లా ముచ్చుమర్రి గ్రామంలో తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసులో ముగ్గురు మైనరు బాలలను అదుపులోకి తీసుకుని, ఇద్దరు కుట్రదారులను అరెస్టు చేసినట్టు జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ తెలిపారు. నంద్యాలలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో.. రాష్ట్రంలో కలకలం రేపిన ముచ్చుమర్రిలో బాలిక అదృశ్యం కేసులో పోలీసుల దర్యాపును వివరించారు. ఈ సందర్భంగా ఆయన తెలిపిన అంశాలు ఇలా ఉన్నాయి…
గత ఆదివారం మధ్యాహ్నం ముచ్చుమర్రి గ్రామానికి చెందిన తొమ్మిదేళ్ల బాలిక అడుకోవటానికి పార్కుకు వెళ్ళి తిరిగి ఇంటికి రాలేదు. ఆందోళన చెందిన ఆమె తండ్రి సంగెం చిన్న మద్దిలేటి స్థానిక పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు. అదే రోజున బాలిక మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి బాలిక ఆచూకీ కోసం ఆత్మకూరు డీఎస్పీ అధర్వంలో గాలింపు చర్యలు చేపట్టారు.
ఈ విచారణలో ఆ బాలికపై ముగ్గురు మైనర్లు అత్యాచారం చేసి, అమ్మాయిని గొంతు నులుమి చంపివేశారు. కొంత దూరం సైకిల్ పై, ఆ తరువాత మోటార్ సైకిల్ పై ఎక్కించుకొని బాలిక మృతదేహాన్ని తరలించారు. పిల్లలు కేసుల్లో ఇరుక్కుంటారని ఈ అఘాయిత్యానికి పాల్పడిన ఓ బాలుడి తండ్రి, పెదనాన్న బాలిక డెడ్ బాడీని మాయం చేశారు. వారు ఆ బాలిక మృతదేహానికి రాయి కట్టి కృష్ణానది బ్యాక్ వాటర్ లో పడవేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
కర్నూల్ డీఐజీ, నంద్యాల జిల్లా ఎస్పీ, ముచ్చుమర్రి గ్రామంలోనే మకాం వేసి ఆ శవం కోసం గాలింపు చర్యలను ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. ఈ గాలింపు చర్యలలో సీఐ స్థాయి అధికారులను ఆరు టీమ్స్ గా ఏర్పాటు చేశారు. గజ ఈత బృందం, ఎన్డ్ ఆర్ ఎఫ్ టీమ్, లను, ఆరు స్పెషల్ పార్టీ బృందాలు, డాగ్ స్క్వాడ్, డ్రోన్ కెమెరాలు, టెక్నికల్ టీమ్ లను రంగంలోకి దించి గాలింపు చర్యలు చేపట్టగా ఆ బాలిక ఆచూకీ లభ్యం కాలేదు.
ముగ్గురు మైనర్లను, తల్లి తండ్రుల ద్వారా అదుపులోకి తీసుకున్నారు. ఆ బాలిక మృతదేహాన్ని నదిలో పడవేసినట్లుగా ప్రాథమిక దర్యాప్తులో తేలటంతో… యోహాన్, బొల్లెద్దుల సద్గురుడును అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు. ముచ్చుమర్రి బాలిక కేసు ఇంకా విచారణ దశలోనే ఉందని, మృతదేహం కోసం అన్ని ప్రయత్నాలు చేశామన్నారు. ప్రస్తుతం బాలిక ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నామని ఎస్పీ వివరించారు.