అమరావతి, ఆంధ్రప్రభ : ఖరీఫ్ సీజన్లో వరి తర్ఆత అధికంగా పండించే వేరుశెనగ విస్తీర్ణం తగ్గుముఖం పట్టే సూచనలు కనబడుతున్నాయి. పెరిగిన ఎక్కువ కావడం, అంతకంతకూ దిగుబడి తగ్గిపోతుండటంతో వేరు శెనగ సాగుపై రైతులు అంతగా ఇంట్రెస్ట్ చూపడం లేదు. దీనికి ప్రత్యామ్నాయ పంటలు పండించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వేరుశెనగ సాగు రాయలసీమ జిల్లాల్లో అధికంగా ఉంది. ఈ ఏడాది ఖరీఫ్‌లో 18.25 లక్షల ఎకరాల్లో వేరుశెనగ పండించే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అంచనాలు రూపొందించింది. గత ఏడాది ఖరీఫ్‌లోనూ 18.02 లక్షల ఎకరాల విస్తీర్ణాన్ని లక్ష్యంగా నిర్ణయించగా, ఆగస్టు రెండో వారం కల్లా 13 లక్షల ఎకరాల్లో సాగు ప్రారంభించారు.
ఈ ఏడాది మాత్రం ఇప్పటివరకు 7 లక్షల ఎకరా ల్లోనే సాగు మొదలైంది. రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వం అం దించే రాయితీ విత్తనాలను కూడా రైతులు పూర్తిస్థాయిలో తీసు కోలేదు. సుమారు 30 వేల క్వింటాళ్ళ విత్తనాల నిల్వలు ఆర్బీకేల్లో ఉండిపోయాయి. ప్రతి ఏడాదీ రాయితీ విత్తనాలకు భారీ డిమాండ్ ఉండేది. ఆర్బీకేలకు స్టాకు వచ్చిందే తడవు రైతులు క్యూకట్టి తీసుకెళ్ళే వారు..అలాంటిది ఈ ఏడాది భిన్నమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. వేరుశెనగ సాగుపై రైతులు తీవ్రమైన విముఖత వ్యక్తం చేయటమే దీని కి కారణం. గడిచిన రెండేళ్ళుగా భారీ వరదలు..లేదంటే సాగు అదు నులో ఉన్నపుడు వర్షాభావ పరిస్థితులు ఏర్పడటంతో వేరుశెనగ పంట తీవ్ర నష్టాలు మిగిల్చిందని రైతులు చెబుతున్నారు.
2021-22 ఖరీఫ్ సీజన్లో 18.02 లక్షల ఎకరాల విస్తీర్ణంలో పంట పండించగా 3.16 లక్షల టన్నుల దిగుబడి మాత్రమే వచ్చింది. అంతకుముందు ఏడాది 2020-21లో 18.62 లక్షల ఎకరాల్లో సాగు చేయగా 5.40 లక్షట టన్నులు, 2109-20లో 14.20 లక్షల ఎకరాల విస్తీర్ణానికి గాను 6.22 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది. ప్రతికూల వాతావరణంతో దిగుబడి 50 నుంచి 60 శాతం తగ్గటంతో భారీ నష్టాలు వచ్చాయి..ఒక ఎకరా సగటు- దిగుబడికి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ 10 వేలు కూడా మించకపోగా పెట్టు-బడి వ్యయం మాత్రం రూ 25 నుంచి రూ 30 వేలు అవుతుంది..దాని ఫలితంగానే ఈ ఏడాది ఖరీఫ్ సాగు విస్తీర్ణం సగానికి సగం తగ్గిపోయే సూచనలు కనబడుతున్నాయని రైతులతో పాటు- మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
అనంతపురంలో భారీగా తగ్గిన విస్తీర్ణం
వేరుశెనగ పంటకు ఉమ్మడి అనంతపురం జిల్లా పెట్టింది పేరు. ఈ ఏడాది ఖరీప్ లో రాష్ట్ర వ్యాప్తంగా 18.25 లక్షల ఎకరాల్లో వేరుశెనగ సాగును లక్ష్యంగా నిర్ణయించగా అందులో 11.07 లక్షల ఎకరాల్లో సాగు ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే ఉంది. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో కలిపి మొత్తం 11.07 లక్షల ఎకరాల్లో సాగుకు గాను ఇప్పటివరకు 5 లక్షలకు ఎకరాల మించి సాగు పనులు ప్రారంభం కాలేదు. కర్నూలు, నంద్యాల జిల్లాల్లోనూ సాగు 1.5 లక్షల ఎకరాల మేరకు తగ్గుముఖం పట్టిందని అంచనా. వేరుశెనగ పండించే దాదాపు అన్ని ప్రాంతాల్లో ప్రత్యామ్నాయంగా కంది, ఉలవ, పత్తి తదితర పంటల వైపు రైతులు మొగ్గు చూపుతున్నారు. పత్తి సాగు విస్తీర్ణం ఈ ఏడాది అనంతపురం, కడప, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో భారీగా పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి.