Wednesday, December 18, 2024

AP | న్యాయం కోసం రైతు సాహసం.. ఎడ్ల బండిపై 760 కిలోమీటర్లు

( ఆంధ్రప్రభ, మంగళగిరి) : ఆరుగాలం రక్తాన్ని స్వేధంగా మలచి సేద్యం చేస్తున్న రైతన్న కష్టార్జితాన్ని పల్లెల్లో పడగలెత్తిన దళారులు పీల్చి పిప్పి చేస్తున్నారు. ఇంకెంత కాలం ఈ దళారీల పీడన.. రైతన్న ఘోషను వినండి అని .. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దర్శనంతో.. తన విన్నపాలు విన్నవించేందుకు.. చలిలోనే పడిగాపులు పడుతున్నాడు.

తమ నేతను కలిసేది కేవలం తన వ్యక్తిగత ప్రయోజనం కోసం కాదని.. తన సహచర రైతన్నల గోడు తెలపటమే తన యజ్ఞమని ఆ రైతు గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన కార్యాలయం ముందు భీష్మించాడు. ఈ ధీన రైతు వ్యథను జనసేన అర్చకులు పట్టించుకోవటం లేదు.

డిప్యూటీ సీఎంను కలిసేందుకు అవకాశం ఇవ్వటం లేదు. ఓ వైపు చలిపులి. మరో వైపు ఆకలితో ఎద్దులు నకనకలాడుతున్నాయి. ఇప్పటికైనా జనసేనాని స్పందించి ఈ బడుగు రైతు ఎదుట ప్రత్యక్షం కావాలని జనం కోరుతున్నారు, అసలు ఏం జరిగిందంటే..

- Advertisement -

దళారీ వ్యవస్థకు వ్యతిరేకంగా…

దళారీ వ్యవస్థతో రైతులు నష్టపోతున్న తీరును డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు చెప్పాలని ఓ యువ రైతు నిర్ణయించు కున్నాడు. సేద్యంలో నష్టాన్ని భరించలేక ఎందరో బలవన్మరణానికి పాల్పడుతున్న తరుణంలో కనీసం ఒకరిద్దరు రైతులను ఆత్మహత్యల నుంచి కాపాడాలని, , రాష్ట్రంలో నష్టపోతున్న సహచర రైతులకు ఏదో ఒకటి చేయాలని శ్రీ సత్యసాయి జిల్లా పరిగి మండలం శాసన కోటకు చెందిన యువరైతు నవీన్ కుమార్ తపిస్తున్నాడు.

కౌలు రైతుల కుటుంబాలకు ఇతోదిక సాయం చేసిన జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ అంటే.. ఓ దైవంగా భావించాడు. రైతులు పడుతున్న బాధలను స్వయంగా పవన్ కళ్యాణ్ కు వివరించాలని.. తన సొంత గ్రామం నుంచి ఎడ్లబండిపైనే మంగళగిరికి బయలుదేరాడు. దాదాపు 30 రోజుల్లో 760 కిలోమీటర్లు ప్రయాణించి మంగళగిరిలోని జనసేన కార్యాలయానికి చేరుకున్నాడు.

మూడు రోజులుగా పడిగాపులు

రైతు తమ కష్టాలను వివరించాలని, డిప్యూటీ సీఎం పవన్‌ను కలిసేందుకు అనుమతించాలని ఈ యువ రైతు నవీన్ కుమార్ మంగళగిరి జనసేన కార్యాలయం ఎదుటే మూడు రోజులుగా పడిగాపులు కాస్తున్నాడు. రైతు ఎవరిని మోసం చేయడు. విచ్చలవిడిగా నకిలీ విత్తనాలు మార్కెట్లోకి వస్తున్నాయి.

భవిష్యత్ తరాలకు మంచి ఆహారం దొరకటం లేదు. . రైతు లేకపోతే భవిష్యత్తు తరాలకు వ్యవసాయం ఉండదు. అప్పుడెప్పుడో వ్యవసాయం జరిగేదని పుస్తకాల్లోనే చదువుకోవాలి. ఇదీ ఈ యువరైతు నవీన్ కుమార్ ఆరాటం, ఆవేదన. రైతుల సమస్యలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఎంతో శ్రద్ధ ఉంది.

ఆ ఉద్దేశంతోనే రైతులకు మేలు జరుగుతుందని ఎంతో దూరం నుంచి ఇక్కడికి వచ్చానని నవీన్ కుమార్ అన్నారు. సేధ్యం చేసే రైతుకు గుర్తింపు కార్డు ఇవ్వాలి. రాయలసీమలో రైతుల బిడ్డలకు పిల్లలు ఇవ్వడం లేదు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. పురుగుల మందులు, యూరియా ఎంఆర్పీ ధరలకే అమ్మాలని ఆయన కోరుతున్నాడు.

పవన్ కల్యాణ్ పిలుపు కోసం మూడు రోజులుగా నవీన్ కుమార్ మంగళగిరి జనసేన కార్యాలయం ఎదుటే నిరీక్షిస్తున్నాడు. . కార్యాలయం గేటు బయటే చలికి వణుకుతూ ఎండకు ఎండుతూ ఇబ్బంది పడుతున్నాడు. చలి తీవ్రత కారణంగా ఎద్దులు సైతం అనారోగ్యానికి గురవ్వడం బాధాకరం.

ఎడ్లకు తినడానికి గడ్డి కూడా లేదని, మేత కోసం సమీప రైతులను ప్రాధేయపడుతున్నాడు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు వినతి పత్రం ఇచ్చే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని ఈ యువరైతు నవీన్ కుమార్ భీష్మించాడు. ఇంతకీ జనసేన అధినేత దర్శన భాగ్యం లభిస్తుందా? లేక పోలీసులు అక్కడి నుంచి తరిమేస్తారా? ఇవీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రశ్నలు.

Advertisement

తాజా వార్తలు

Advertisement