అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలోని ప్రతి కుటుంబం విద్యుత్‌ను సమర్ధవంతంగా ఉపయోగించుకోవటం ద్వారా ప్రయోజనం పొందే దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) కీలక నిర్ణయం తీసుకుంది. విద్యుత్ వినియోగదారులకు ఇంధన సామర్థ్యంతో కూడిన స్టార్ రేటెడ్ పరికరాలను మార్కెట్ కన్నా తక్కువ ధరకు అందించడం ద్వారా విద్యుత్ వినియోగంతో పాటు విద్యుత్ బిల్లులు కూడా కొంత మేర తగ్గేలా చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం ఆన్ బిల్ ఫైనాన్సింగ్ మోడల్, అప్‌ఫ్రంట్ మోడల్ ద్వారా వినియోగదారులకు స్టార్ రేటెడ్ ఎయిర్ కండీషనర్లు, బీఎల్డీసి (బ్రష్ లెస్ డైరెక్ట్ కరెంట్) ఇంధన సామర్ధ్య సీలింగ్ ఫ్యాన్లు, ఎల్‌ఈడీ ట్యూబ్ లైట్లు వడ్డీ లేని నెలవారి వాయిదా చెల్లింపు పద్దతిలో అందచేసే పైలట్ ప్రాజెక్ట్‌కు విద్యుత్ సంస్థలకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఇంధన సామర్ధ్య అభివృద్ధి సంస్థ (ఏపీసీడ్కో) చేసిన ప్రతిపాదనను ఏపీఈఆర్సీ ఆమోదించింది. ఈ మేరకు ఏపీఈఆర్సీ ప్రొసీడింగ్స్ (మార్గదర్శకాలను) విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం విద్యుత్ డిమాండ్‌లో 25 శాతం విద్యుత్, గృహ వినియోగ రంగంలోనే ఉంది. మారుతున్న జీవన శైలికి అనుగుణంగా గృహాలలో ఎలక్ట్రానిక్ వస్తువుల వినియోగం విరివిగా పెరిగింది. దీంతోపాటు రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ కూడా భారీగా పెరుగుతోంది. ఈనేపథ్యంలో ఏపీఈఆర్సీ సూచన మేరకు తక్కువ విద్యుత్‌ను ఉపయోగించుకుని ఎక్కువ సామర్థ్యం ప్రదర్శించే స్టార్ రేటెడ్ గృహోపకరణాలను అందించడం ద్వారా వినియోగదారులు ప్రయోజనం పొందేలా ఒక ప్రాజెక్ట్‌ను ఏపీసీడ్కో రూపొందించింది.
వడ్డీ లేకుండానే సులభ వాయిదాల్లో చెల్లించేలా..
స్టార్ రేటెడ్ గృహోపకరణాలు నెలవారీ సులభ వాయిదాల్లో చెల్లింపు పద్ధతిలో వినియోగదారులకు అందచేసి, ఎలాంటి వడ్డీ లేకుండా ప్రతి నెల విద్యుత్ బిల్లులు చెల్లింపు సమయంలో వినియోగ దారులు చెల్లించేలా ఆప్రాజెక్ట్‌లో ప్రతిపాదించింది. మార్కెట్ ధరకంటే తక్కువ ధరకే ఈ వస్తువులు వినియోదారులకు అందచేయాలని ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనకు ఏపీఈఆర్సీ ఆమోదం తెలిపింది. ఈసందర్భంగా ఏపీ డిస్కంలు, ఏపీసీడ్కో అధికారులతో ఏపీఈఆర్‌సీ చైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జున రెడ్డి వెబినార్ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇంధన సామర్ధ్య గృహోపకరణాల వినియోగంపై వినియోగదారుల్లో అవగాహన పెంచాలని సూచించారు. ఈ ఉపకరణాల వాడకం వల్ల గృహాల్లో విద్యుత్ వినియోగం తగ్గి తద్వారా విద్యుత్ బిల్లులు కొంత మేర ఆదా అవుతాయని పేర్కొన్నారు. అంతిమంగా ఇది పర్యావరణ పరిరక్షణకు సైతం దోహదపడుతుందన్నారు. సాంప్రదాయ లైట్లు , ఫ్యాన్లు వంటి వాటితో పోలిస్తే ఇంధన సామర్ధ్య ఉపకరనాల వాడకం వల్ల 25 నుంచి 30 శాతం విద్యుత్ ఆదా అయ్యే అవకాశం ఉందని చెప్పారు. ఈ దృష్ట్యా 5 స్టార్ రేటెడ్ ఎయిర్ కండీషనర్లు, బీఎల్డీసి ఫ్యాన్లు, ఎల్‌ఈడీ ట్యూబ్ లైట్లు వంటివాటిని వినియగదారుల కొరిక మేరకు ఏపీసీడ్కో, ఏపీ డిస్కంలు సరఫరా చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. తొలి దశలో ఈపైలట్ ప్రాజెక్ట్‌ను విశాఖపట్నం, విజయవాడ తిరుపతి నగరాల్లో అమలు చేయనున్నామని తెలిపారు. దశల వారీగా ఈపైలట్ ప్రాజెక్టును రాష్ట్రంలో విస్తరించి ఇంధన సామర్థ్యం ద్వారా ప్రతి కుటు-ంబం ఆర్థికంగా ప్రయోజం పొందేలా చర్యలు తీసుకోవాలని ఏపీసీడ్కో, డిస్కంలకు ఏపీఈఆర్సీ చైర్మన్ సూచించారు. దీనివల్ల కేవలం విద్యుత్ ఆదాయే కాకుండా, వినియోగదారుల జీవన ప్రమాణాలు మెరుగవుతాయన్నారు. అంతేగాక ఇంధన వనరులను కాపాడుకుని తద్వారా పర్యావరణాన్ని పరిరక్షించుకొనే ఆవశ్యకతపై వినియోగదారుల్లో అవగాహన ఏర్పడుతుందన్నారు. ఇంధన పరిరక్షణ, ఇంధన పొదుపుపై పెద్ద ఎత్తున ప్రజల్లో చైతన్యం కలిగించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాష్ట్రంలో ఇంధన భద్రత సాదించేందుకు, తద్వారా భావితరాల అభివృద్ధికి బాటలు వేసేందుకు ఇంధన సామర్థ్యం విశేషంగా దోహద పడుతుందని జస్టిస్ సీవీ నాగార్జున రెడ్డి తెలిపారు.
మార్చి నెలాఖరులోగా పూర్తికి ఆదేశాలు..
ఈపైలట్ ప్రాజెక్టును వచ్చే ఏడాది మార్చి నెలాఖరు నాటికీ పూర్తిచేయాల్సిందిగా ఏపీసీడ్కో, డిస్కంలను ఆయన ఆదేశించారు. ఈ ప్రాజెక్టును అమలుచేసేందుకు వివిధ వస్తు తయారీ సంస్థలతో అవగాహనా ఒప్పందం కుదుర్చుకోవాలని ఏపీఈఅర్సీ ఏపీ సీడ్కోకు సూచించింది. అలాగే ప్రాజెక్ట్ పూర్తయిన 45 రోజుల్లోగా ప్రాజెక్ట్ అమలు తీరుతెన్నులు, దాని ప్రభావంపై ఏపీఈఆర్సీకి నివేదిక సమర్పించాల్సిందిగా ఆదేశించింది. రాష్ట్రంలో ఎనర్జీ ఎఫిసిఎన్సీని అభివృద్ధి చేయడం వల్ల వినియోగదారులకు నెలవారీ విద్యుత్ బిల్లుల వ్యయం తగ్గడమే గాక వాతావరణ కాలుష్యాన్ని నివారించవచ్చని, కాలుష్య కారక ఇంధన వినియాగాన్ని కూడా పెద్ద ఎత్తున తగ్గించవచ్చునని ఏపీఈఆర్సి కమిషన్ సభ్యులు పీ రాజగోపాల్, రామ సింగ్ ఠాకూర్‌లు పేర్కొన్నారు.