న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్‌లో ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం ద్వారా ఇంటి ముంగిటకే వైద్య సేవలు అందిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ వెల్లడించారు. రాజ్యసభలో మంగళవారం వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి అందిన సమాచారం ప్రకారం డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ పథకం కింద నెలకొల్పిన 6-7 వెల్‌నెస్ సెంటర్లకు కలిపి ఇద్దరేసి వైద్యాధికారులు అందుబాటులో ఉంటారు. ఒక్కో వైధ్యాధికారి నెలలో రెండు పర్యాయాలు ఈ వెల్‌నెస్ సెంటర్లను సందర్శించి గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
రాష్ట్రంలో పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డాక్టర్ వైఎస్సార్ హెల్త్ స్కీంను కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్యశ్రీ యోజన పథకంతో జోడించి అమలు చేస్తోందని మంత్రి తెలిపారు. ఈ ఇంటిగ్రేటెడ్ స్కీం కింద అర్హులైన మొత్తం 1.41 కోట్ల కుటుంబాల్లో 61.47 లక్షల కుటుంబాలకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సంయుక్త సహకారంతో హెల్త్ కవరేజ్ అందుతుండగా మిగిలిన 80.23 లక్షల కుటుంబాలకు కవరేజ్‌ను రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే భరిస్తోందని అన్నారు. ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్ (ఐపీహెచ్‌ఎస్) ప్రకారం ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు ఎంబీబీఎస్ డాక్టర్లను నియమించాలి. అలాగే మైదాన ప్రాంతంలో ప్రతి 30 వేల మందికి, కొండ ప్రాంతం, గిరిజన ప్రాంతాల్లో ప్రతి 20 వేల మందికి ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలి. మైదాన ప్రాంతంలో ప్రతి 5 వేల మందికి, కొండ ప్రాంతం, గిరిజన ప్రాంతంలో ప్రతి 3 వేల మందికి ఒక సబ్ సెంటర్ ఉండాలని ఐపిహెచ్‌ఎస్ నిబంధనలు సూచిస్తున్నాయని మంత్రి తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం 2022 డిసెంబర్ నాటికి దేశవ్యాప్తంగా 1,50,000 ఆయుష్మాన్ భారత్ హెల్త్ వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు 2018లో ప్రకటించిందని మంత్రి చెప్పారు. అందులో భాగంగా సబ్ హెల్త్ సెంటర్లు, ప్రాథమిక హెల్త్ సెంటర్లు, అర్బన్ హెల్త్ సెంటర్లను సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కింద ప్రివెంటివ్, ప్రమోటివ్, క్యూరేటివ్, పేలియేటివ్ రీహేబిలిటెటివ్ సేవలు ప్రజలకు చేరువలో ఉచితంగా అందించే లక్ష్యంతో ఆయుష్మాన్ భారత్ హెల్త్ వెల్నెస్ సెంటర్లుగా ఉన్నతీకరించినట్లు తెలిపారు. 2023 జూలై 31 నాటికి ఏపీలో 11,854 ఏబీహెచ్‌డబ్ల్యుసీలతో సహా దేశవ్యాప్తంగా 1,60,816 ఆయుష్మాన్ భారత్ హెల్త్ వెల్నెస్ సెంటర్లు ప్రారంభమయ్యాయని అన్నారు.
ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఐపీహెచ్ఎస్-2022 నిబంధనల ప్రకారం కమ్యూనిటి హెల్త్ సెంటర్, ప్రైమరీ హెల్త్ సెంటర్‌లలో వైద్యాధికారులు రిప్రొడక్టివ్, చైల్డ్ హెల్త్ ప్రోగ్రాం, యూనివర్శల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాం, నేషనల్ వెక్టర్ బోర్న్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రాం, నేషనల్ బ్లైండ్‌నెస్ కంట్రోల్ ప్రోగ్రాం, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ప్రోగ్రాం, నేషనల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రాం, కమ్యూనికబుల్ డిసీజెస్ కంట్రోల్ ప్రోగ్రాం, టీబీ, లెప్రసీ, లైంగిక వ్యాధులు కంట్రోల్ ప్రోగ్రాం ఆయుష్మాన్ భారత్ వంటి నేషనల్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ ప్రోగ్రాం కింద నిర్దేశించిన లక్ష్యాలు చేరుకునేందుకు సమర్ధవంతమైన కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలి. అలాగే కమ్యూనిటీ అవుట్ రీచ్ ప్రోగ్రాంలలో తరచుగా పాల్గొనాల్సి ఉంటుందనిమంత్రి తెలిపారు. విలేజ్ హెల్త్ శానిటేషన్ కమిటీ చేపడుతున్న కార్యక్రమాలు విధిగా పర్యవేక్షించి వారికి తగిన సూచనలు ఇవ్వాల్సిన బాధ్యత వైద్యాధికారులపై ఉందని అన్నారు. రోగులకు సమర్థవంతమైన ఆరోగ్య సేవలందించేందుకు గ్రామ పెద్దలు, సోషల్ వెల్ఫేర్ ఏజన్సీలు స్థానిక ప్రజలతో మమేకమవ్వాలని అలాగే ఇంటర్ సెక్టోరల్, ఇంటర్ డిపార్టుమెంటల్ కోఆర్డినేషన్ కూడా తప్పనిసరి అని మంత్రి అన్నారు.