అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో గోదావరి గలగల పాడుతుంటే కృష్ణమ్మ మాత్రం వెలవెలబోతోంది. తెలుగు రాష్ట్రాలను సస్యశ్యామలం చేసిన ఆధునిక దేవాలయం నాగార్జునసాగర్‌లో జలాలు అడుగంటిపోతున్నాయి. ఈ ఏడాది వానకాలం మొదలై రెండు నెలలైనా నాగార్జున సాగర్ రిజర్వాయర్‌కు పూర్తిస్థాయిలో కృష్ణమ్మ చేరలేదు. దీంతో నాగార్జున సాగర్ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. సాగర్‌లో నీటి నిల్వలు అడుగంటు తుండడంతో ఆయకట్టులో సాగు ప్రశ్నార్థకంగా మారింది. దీంతో సాగర్ ఆయకట్టు సాగుపై నీలినీడలు అలుముకున్నాయి.
తొమ్మిదేళ్ళ తర్వాత నాగార్జునసాగర్ ఆయకట్టుకు నీటి గండం ఏర్పడింది. దీంతో సాగర్ కుడి కాలువ కింద వరిసాగు వద్దని, ఆరుతడి పంటలకే పరిమితం కావాలని ప్రభుత్వం చేసిన ప్రకటన అన్నదాతల్లో అలజడి రేకెత్తించింది. సాగర్ జలాశయంలోకి వరదనీటి ప్రవాహాలు లేనందున వరి సాగు వద్దన్నారు. ఇప్పటికే నారుమళ్లు వేసుకుని సిద్ధం చేసుకున్న రైతులు అయోమయంలో పడ్డారు. వర్షపాతం అంచనాలను పరిగణనలోకి తీసుకొని జూలై, ఆగస్టు నెలల్లోనే రైతులకు అవగాహన కల్పించినట్లయితే నారుమళ్లు వేసే వారం కాదని రైతులు వాపోతున్నారు.
నారు సిద్ధం చేసుకున్న తర్వాత నీరు ఇవ్వకపోతే ఇప్పటివరకు పెట్టిన సొమ్ము వృథా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు ఇప్పుడు ఆరుతడి పంటలకు విత్తనాలు సిద్ధం చేసుకోవాల్సి వస్తోంది. మరోవైపు ప్రస్తుత వర్షాలకు మిర్చి మొక్కలు నాటు-తున్న రైతులు సెప్టెంబరు తర్వాత కాలువలకు నీరు రాకపోతే ఎలా అని ఆందోళన చెందుతున్నారు. వేలాది రూపాయలు వెచ్చించి హైబ్రీడ్ మిర్చి విత్తనాలు కొనుగోలు చేసి నారు పెంచుకుంటే ప్రస్తుతం నీటి కొరత వెంటాడుతోందని రైతులు చెబుతున్నారు.
మొక్కలు నాటడానికి ట్యాంకర్ల ద్వారా పెట్టుకుని బతికించుకున్నా సెప్టెంబరు తర్వాత వర్షాలు రాకపోతే పంటను ఎలా కాపాడుకోవాలని దిగాలు పడుతున్నారు. సాగర్‌లో ప్రస్తుతం ఉన్న నీటినిల్వలు తాగునీటి అవసరాలకు సరిపోతాయని ప్రభుత్వం చెబుతోంది. సాగర్‌లోకి వరద ప్రవాహాలు రాకపోతే ఆరుతడి పంటలకు కూడా నీరు ఇచ్చే వెసులుబాటు ఉండదు. దీంతో వర్షాభావ పరిస్థితులు కొనసాగితే వాటిని కాపాడుకోవడం కూడా కష్టమేనని రైతులు వాపోతున్నారు. సాగర్ కుడి కాలువకు నీటి విడుదల లేకపోవడంతో వరి మాత్రమే కాకుండా ఇప్పటికే సాగులో ఉన్న వాణిజ్య పంటలైన పత్తి, మిర్చిపై కూడా తీవ్ర ప్రభావం పడనుంది.
సాగర్ కాలువలకు నీటివిడుదల ఉన్నట్లయితే మిర్చి, పత్తి పంటలకు రైతులు ధీమాగా పెట్టుబడులు పెడతారు. కాల్వలకు నీటి విడుదలపై స్పష్టత లేనందున ఇప్పుడు పెట్టుబడి పెట్టి కీలకమైన సమయంలో సాగునీరు అందకపోతే పెట్టిన పెట్టుబడి మొత్తం నష్టపోతామన్న ఆందోళన వారిలో మొదలైంది. పత్తికి ఎకరాకు కోత కూలీ కాకుండా రూ.30వేల పెట్టుబడి పెడుతుండగా మిర్చికి రూ.1.50 లక్షల వరకు పెట్టుబడి పెడుతున్నారు. రూ.లక్షలు పెట్టుబడి పెట్టిన తర్వాత పంట చేతికి రాకపోతే తీవ్రంగా నష్టపోతారు. దీనిని దృష్టిలో ఉంచుకొని పంటకు పెట్టుబడి విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.
ఈ సీజన్‌లో సాగర్ ఆయకట్టు పరీవాహక ప్రాంతాల్లో ఇప్పటికే 50 శాతం వరకు ఎరువుల విక్రయాలు తగ్గాయని వ్యాపారులు చెబుతున్నారు. సాగర్ కాలువలకు నీటి విడుదల లేకపోతే ఈ ఏడాది వ్యవసాయాధారిత రంగాలన్నీ నష్టాల బాటలో నడుస్తాయన్నారు. రైతులు ఇప్పటికే మిర్చి, పత్తి సాగుకు రూ.వేలు పెట్టు-బడి పెట్టినందున వాటిని కాపాడుకుంటున్నారు. వర్షాభావ పరిస్థితులు, నీటి కొరత విషయమై రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. నాగార్జునసాగర్ కుడి కాలువ పరిధిలో ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాల పరిధిలో సాగర్ కుడికాలువ కింద మాగాణి 5.5 లక్షల ఎకరాలు ఉంది.
ఇందులో రైతులు ఏటా ఆగస్టు నెలలో వరి సాగు చేయడం ఆనవాయితీ. ఈ ఏడాది కాలువలకు నీటిని విడుదల చేయకపోవడంతో నారుమళ్లు వేసుకొని రైతులు ఎదురుచూస్తున్నారు. పల్నాడు ప్రాంతంలో పండే వరి ధాన్యానికి విపరీతమైన డిమాండ్ ఉంది. నాణ్యమైన సన్నరకాల బియ్యం ధరలు మార్కెట్‌లో కిలో రూ.50పైగా ధర పలుకుతుండటంతో రైతులందరూ వరి సాగుకు సిద్ధమయ్యారు. ఇందుకు అనుగుణంగా పొలాలు సిద్ధం చేసుకున్నారు. బోర్లు కింద నారు పోసుకొని కాలువలకు నీటి విడుదల కోసం ఎదురుచూస్తున్న తరుణంలో నీరు లేదని చెప్పడంతో వారంతా నిరాశకు గురయ్యారు.
కాలువల కింద వరి లేకపోతే ఈసారి తిండిగింజలు ఎలా అన్న దిగులు వారిలో మొదలైంది. లక్షల ఎకరాల్లో వరి సాగు విస్తీర్ణం తగ్గిపోవడంతో ధాన్యం గింజలతోపాటు పశువులకు గడ్డి కొరత కూడా ఏర్పడుతుందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముందస్తుగా సమాచారం ఇచ్చినట్లయితే ప్రస్తుత వర్షాలకు ఆరుతడి పంటలు సాగుచేసే వారమని, ఇప్పుడు చెబితే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. సెప్టెంబరు నెలలో ఆరుతడి పంటలు సాగు చేయడానికి జాప్యం జరిగిందని చెబుతున్నారు. ఈ పరిస్థితిని రైతులు ఎలా అధిగమిస్తారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.