Tuesday, November 26, 2024

AP | పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. రోడ్లను కప్పేస్తున్న మంచు దుప్పటి..

అమరావతి, ఆంధ్రప్రభ : వర్షాకాలం ముగిసింది.. చలికాలం వచ్చేసింది. ఫలితంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పొగ మంచు కమ్మేస్తోంది. తెల్లవారుజామున దట్టమైన పొగమంచు అందాలు మనస్సును దోచుకుంటున్నా.. దారులు కనపడని విధంగా పొగమంచు దుప్పటిలా కప్పేస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి పూట ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గి.. తెల్లవారుజాము నుంచి దట్టమైన పొగమంచు అలముకుంటోంది. పైగా శీతల గాలులతో చలి తీవ్రత కూడా పెరుగుతోంది.

పొగమంచు కారణంగా జాతీయ రహదారులతొపాటు రాష్ట్రీయ రహదారులు, రైల్వే లైన్లల్లోనూ వాహనాలు, రైళ్ల రాకపోకలు ఆలస్యమవుతున్నాయి. విజయవాడ- హైదరాబాద్‌, చెన్నై- కోల్‌కత్తా 16వ నెంబర్‌ జాతీయ రహదారి పై ఉదయం 10గంటల వరకు కూడా పొగమంచు వీడడం లేదు. దీంతో వాహహదారులు లైట్లు వేసుకుని రాకపోకలు సాగించాల్సిన పరిసి ్థతి ఎదురవుతోంది. ఏజెన్సీలో అయితే ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి.

లంబసింగిలో 4 డిగ్రీలు, చింతపల్లిలో 4.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో చలి తీవ్రత పెరిగి అక్కడి ప్రజలు చలికి ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. సాధారణంగా నవంబర్‌, డిసెంబర్‌, జనవరి నెలల్లో మంచు తీవ్రత అధికంగా ఉంటుంది. చల్లని గాలులు వీస్తూ గజగజ వణికించే విధంగా చలి తీవ్రత ఉంటుంది. పొగమంచు కారణంగా రహదారులు డేంజర్‌ రోడ్స్‌గా మారిపోతున్నాయి.

తెల్లవారుజామున విపరీతంగా కురుస్తున్న మంచుతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల అనంతపురం -బెంగుళూర్‌ జాతీయ రహదారిలో పొగమంచు కారణంగా జరిగిన ప్రమాదంలో ఐదుగురు కూలీలు ప్రాణాలు కోల్పోయారు. దట్టమైన పొగతో ముందు వెళ్లే వాహనాలే కాదు, ఎదురుగా వచ్చే వాహనాలు కూడ కనిపించని కారణంగానే ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉంది. రాత్రి పూట ప్రయాణం చేసినట్లుగా..పగలు కూడా వాహనాలకు లైట్లు వేసుకొని ప్రయాణం చేస్తున్నారు.

- Advertisement -

పొగమంచు ఎలా ఏర్పడుతుంది..?

పొగ మంచు చలికాలంలో ఏర్పడుతుంది. అలాగే బాగా వర్సం పడి చల్లబడిన సమయంలో కూడా ఏర్పడుతుంది. భూ ఉపరితలం చల్లగా ఉంటే అది గాలిలో ఉన్న తేమను నీటి బిందువుల రూపంలో క్రిందకు లాగటం వల్ల పొగ ఏర్పడుతుంది. మొదట ఈ పొగ మంచు ఉపరితలం మీదుగా ఏర్పడి అది మెళ్లగా మిగిలిన చోట్లంతా విస్తరిస్తుంది. చలి కాలంలో రాత్రి సమయంలో చల్లబడటం వల్ల పొగమంచు మెల్లగా మొదలవుతోంది.

తెల్లవారి 6గంటలకు మనకు చలి తీవ్రత ఎక్కువ ఉన్న సమయంలో పొగ మంచు ఒక్క సారిగా ఎక్కుమవుతోంది. అది సూర్యుడు బాగా వచ్చి ఉపరితలాన్ని వేసి చేసిన అనంతరం పొగ తగ్గుతుంది. రాష్ట్రంలో అనంతపురం, కడప, చిత్తూరు, పశ్చిమగోదావరి, విశాఖ తదితర జిల్లాల్లో పొగమంచు తీవ్రత ఎక్కువగా ఉంటుంది. డిసెంబర్‌ చివరి వారంలో దీని తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement