సోషల్ మీడియాలో పొలిటికల్ వింగ్ అరాచకాలు
ప్రధాన పార్టీలన్నీ దోషులే
ప్రచారం మానేసి.. తిట్ల దండకంపైనే దృష్టి
తప్పుడు వార్తలు.. దొంగ మార్ఫింగ్ ఫోటోలు
నకిలీ వీడియోలతో సొంత సోషల్ మీడియా వింగ్ అరాచకం
కేసులతో పోలీసుల దూకుడు
(ఆంధ్రప్రభ స్మార్ట్, విజయవాడ ప్రతినిధి) నిజాన్ని నిర్భయంగా…నికచ్చిగా వ్యక్తం చేసే సోషల్ మీడియా రూపం మారిపోతోంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీల పేటియం బ్యాచ్ కబంధ హస్తాల్లో విలవిల్లాడుతోంది. తప్పుడు వార్తలు, మార్ఫింగ్ ఫోటోలు, నకిలీ వీడియో పోస్టులతో ఫోన్ పే బ్యాచ్ చెలరేగిపోతోంది. మరీ ముఖ్యంగా ఏపీలోని ప్రధాన రాజకీయ పార్టీల సోషల్ మీడియా వింగ్ రెక్కలు విప్పింది. ఈ స్థితిలో టోటల్ సోషల్ మీడియా అభాసుపాలవుతోంది. మరో వైపు పోలీసులు కూడా సోషల్ మీడియాపై కొరఢ ఝళిపిస్తున్నారు. కడకు నిజాలను సైతం అబద్ధాలే అనే నిందను సోషల్ మీడియా మూటగట్టుకుంటోంది.
ఫోన్ పే బ్యాచ్ ఆగడాలే ఆగడాలు
గడచిన పది రోజుల్లో ఏపీలోని వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలో సోషల్ మీడియా వింగ్ ఇన్ చార్జీలు రెచ్చిపోతున్నారు. వైసీపీ ఓడిపోతుందని టీడీపీ వింగ్ పోస్టులు పెడుతుంటే.. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిపై వైసీపీ వింగ్ అకృత్య సృజనాత్మక శక్తిని ప్రదర్శిస్తోంది. కేంద్ర నిఘా సంస్థ ఇటీవల ఓ నివేదికను సమర్పించిందని, ఏపీలో వైసీపీకి 125 అసెంబ్లీ సీట్లు, 24 ఎంపీ స్థానాల్లో గెలుపు ఖాయమని ఓ టీవీలో ప్రచురితమైనట్టు వీడియోను పోస్టు చేశారు. ఈ పోస్టింగ్ హల్ చల్ తో సదరు టీవీ నిర్వాహకులకు కంగుతిన్నారు. ఇదిలా ఉంటే,, ఏపీలో వైసీపీ ఆత్మస్థైర్యం కోల్పోయిందని, గుంటూరు, కడప ఎంపీ స్థానాల్లో అభ్యర్థులను మార్చుతోందని ఓ పోస్టింగ్ కలకలం సృష్టించింది. అంతే మరి కొన్ని గంటల్లోనే మంగళగిరి నుంచి లోకేష్ బాబు వెళ్లిపోతున్నారని, ఆయన స్థానంలో భువనేశ్వరీ వస్తున్నారని మరో పోస్టు విడుదలైంది. ఇక టీడీపీ, వైసీపీ నాయకులు పరస్పరం సోషల్ మీడియా పోస్టులపై తిట్లదండకం అందుకొంటున్నారు.
పోలీసుల దూకుడు
సోషల్ మీడియాలోని ఫేస్ బుక్, వాట్సాప్ , ఇతర ప్లాట్ ఫామ్స్ లో ప్రధాన ప్రత్యర్థి పార్టీల అభ్యర్దులపైన, కార్యకర్తల పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, వ్యక్తిగత ఆరోపణలకు, దూషణలకు దిగుతూ తద్వారా సదరు రాజకీయ పార్టీల మధ్య ఉద్రిక్తతలను, ఘర్షణ వాతావరణాన్ని సృష్టిస్తున్న రెండు ప్రధాన పార్టీలకు చెందిన ఇద్దరు వ్యక్తులపై కృష్ణా జిల్లా పెనమలూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారుపెనమలూరు మండలం వణుకూరు గ్రామానికి చెందిన ఉయ్యూరు మహేష్, అరెపల్లి శ్రీకాంత్ అనే ఇద్దరు రాబోయే సాధారణ ఎన్నికలలో పెనమలూరు అసెంబ్లీ నియోజక వర్గంలో పోటీలో ఉన్న రెండు ప్రధాన పార్టీ అభ్యర్థులకు అనుబంధంగా పని చేస్తూ సోషల్ మీడియాలో తమ తమ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తూ ఉంటారు. గత కొద్ది రోజులుగా వీరి వ్యవహారం శ్రుతి మించి ప్రత్యర్థి పార్టీల అభ్యర్ధులను, కార్యకర్తలను అసభ్యకరంగా చిత్రిస్తూ, అనుచిత, వ్యక్తిగతఆరోపణలు చేస్తూ దూషణలకు దిగారు. ఈ విషయాన్ని గుర్తించిన వణుకూరు గ్రామ రెవెన్యూ అధికారి గద్దె వెంకటేశ్వరరావు సమాచారంతో ఎస్ ఐ ఉషారాణికేసు నమోదు చేశారు.
అడ్మిన్లలో ఆందోళన
వాట్సప్ గ్రూపులలో ఇలాంటి వివాదాస్పద పోస్టింగులు చేస్తూ, వ్యక్తిగత దూషణలకు పాల్పడుతూ, రాజకీయ, వర్గ ఘర్షణలు లేవనెత్తుతూ పరపతికి భంగం కలిగేలా వ్యవహరిస్తుంటేవాట్సాప్ గ్రూపుల అడ్మిన్లను కూడా బాధ్యులను చేస్తామనిపోలీసులు హెచ్చరిస్తున్నారు. తమ తమ గ్రూపులలో వివాదాస్పద పోస్టులను తొలగించాలని, పోస్ట్ చేసిన వ్యక్తులను హెచ్చరించి గ్రూపునుంచి తొలగించాలని, ఆ సమాచారాన్ని స్ధానిక పోలీసులకు తెలియ చేయాలని, లేకపోతే సదరు వాట్సాప్ గ్రూపుల అడ్మిన్లను బాధ్యులను చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ స్థితిలో వాట్స్ అప్ అడ్మిన్లలో ఆందోళన నెలకొంది.