చింతూరు, ప్రభ న్యూస్:దొంగనోట్లు చలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను చింతూరు మన్యం పోలీసులు పట్టుకొని అరెస్ట్ చెెశారు. ఈ దొంగనోట్లు చలామణి చేస్తున్న 8 మంది నిందితులతో సహా ఒక మహిళా నిందితురాలుని గురువారం అరెస్ట్ చేయడంతో పాటు వారి వద్ద నుంచి దొంగ 5 వందల రూపాయాల నోట్లు రూ. 44 లక్షల 50 వేల విలువైన నకిలీ నోట్లను, ఒక కలర్ ప్రింటర్, ఒక బ్లాక్ అండ్ వైట్ ప్రింటర్, ఫాక్సాన్ కంపినీ సీపీయూ, ఏవోసీ కంపినీ కంప్యూటర్ మానిటర్, విజన్‌టెక్ లామినేషన్ మిషన్, బజాజ్ ఆటో, రూ 500 నోటు సైజులో కటింగ్ చేయబడిన బ్లాక్ కలర్ బండిల్స్ తో పాటు ఇతర సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, రంపచోడవరం ఓఎస్డీ జి క్రిష్ణకాంత్‌తో కలసి ఐటీడీఏ సమావేశపు మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
విఆర్ పురం ఎస్సై దుర్గా ప్రసాద్‌కి ఎవరో దొంగనోట్లను చలామణి చేస్తున్నారనే సమాచారం రావడంతో చింతూరు అదనపు ఎస్పీ మహేశ్వరరెడ్డి పర్యవేక్షణలో ఎటపాక సీఐ గజేంద్ర కుమార్ ఆధ్వర్యంలో విఆర్ పురం ఎస్సై, కూనవరం ఎస్సై వెంకటేష్‌లు తమ సిబ్బందితో విఆర్ పురం మండలం రేఖపల్లి గ్రామంలో దాడి చేయగా 8 మంది మగవారు, ఒక మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఈ పట్టుబడ్డ నిందితులను విచారించగా తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కోత్తగూడెం జిల్లా, పాల్వంచ గ్రామానికి చెందిన పొదిల మురళి, జంగం శ్రీనివాస్, కఠారి సామ్రాజ్యం, గౌడుగోళ్ళ కిరణ్ కుమార్, సత్తుపల్లి గ్రామానికి చెందిన కొనకాళ్ళ చిట్టిబాబు, ఆశ్వరావు పేట మండలం అచ్చుతాపురం గ్రామానికి చెందిన పాకనాటీ నాగేశ్వరరావు, రంగారెడ్డి జిల్లా ఉప్పల్‌కి చెందిన పసుపులేటీ ఉమేష్ చంద్రలతో పాటు ఏపీలోని పల్నాడు జిల్లా దుర్గి గ్రామానికి చెందిన పొదిలి శ్రీనివాస్, మాచర్ల గ్రామానికి చెందిన వేముల పుల్లారావులుగా వెల్లడించారని, వీరందరూ ఒక గ్రూపుగా ఏర్పడి తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కోత్తగూడెం జిల్లాలోని పాల్వంచ గ్రామాన్ని ప్రధానంగా చేసుకొని పొదిలి మురళి ఇంటి వద్ద రహాస్యంగా దొంగనోట్లను ముద్రించారన్నారు, ఈ దొంగనోట్లను పొదిలి మురళి, కఠారి సామ్రాజ్యం, పాకనాటి నాగేశ్వరరావు, పసుపులేటి ఉమేష్ చంద్ర, పొదిలి శ్రీనివాస్ అనువారు పాల్వంచ, భద్రాచలం, ఎటపాక, నెల్లిపాక, విఆర్ పురం, రేఖపల్లి, చింతూరు, కుంట గ్రామాల్లో చలామణి చేస్తున్నట్లు తెలిపారు. ఈ దొంగనోట్లతో పట్టుబడ్డ 8 మంది నిందితులతో పాటు మహిళా నిందితురాలుపై కేసు నమోదు చేసి వారిని అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం కోర్టుకి తరలించినట్లు ఎస్పీ తెలిపారు.