Monday, November 25, 2024

ఏపీలో క‌ల్తీ సిగ‌రెట్ల క‌ల‌క‌లం..!

త‌క్కువ స‌మ‌యంలో ఎక్కువ డబ్బులు సంపాదించాల‌నే దురుద్దేశంతో కొన్ని ముఠాలు ప్ర‌జల ప్రాణాల‌తో చెల‌గాట‌మాడుతున్నాయి. చీకటి వ్యాపారాలతో ప్ర‌జ‌ల ప్రాణాల‌ను తీస్తున్నాయి. అలాగే ఇటీవ‌ల కాలంలో ఏపీ నుంచి గంజాయి ఎక్కువ‌గా ప‌ట్టుబ‌డుతోంది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఈ ముఠాలు చాకచక్యంగా వ్యవహరించి కోట్లకు పడగలెత్తుతున్నాయి. బలహీనతను చంపుకోలేని జనం మాత్రం బలైపోతున్నారు.


ఇటీవల విశాఖ రైల్వే స్టేషన్‌లో భారీ ఫేక్‌ సిగరెట్‌ డంప్ బయటపడింది. కల్తీ సిగరెట్లు బ్రాండెడ్‌కు దగ్గరగా ఉంటూ ధూమపాన ప్రియులను తక్కువ ధరలతో ఇట్టే ఆకట్టుకుంటున్నాయి. గతంలో ఐటీసీ గుర్తింపు పొందిన కంపెనీల సిగరెట్లు మాత్రమే మార్కెట్లో అందుబాటులో ఉండేవి. ఐటీసీ నుంచి నాణ్యమైన పొగాకుని కొనుగోలు చేసి బ్రాండెడ్‌ కంపెనీలు సిగరెట్స్‌ని తయారు చేస్తుంటాయి. సిగరెట్స్‌ తయారైన ఆరు నెలల్లోపే వినియోగించాలనీ… ఆ తర్వాత అందులో ఫంగస్‌ చేరి.. మనిషి ఆయువుని తీసేస్తుందని వైద్యులు సూచిస్తున్నారు.


ఐతే, కేంద్రం పన్ను భారం విధించ‌డంతో బ్రాండెడ్‌ సిగరెట్స్‌ ఖరీదు పెరిగింది. దీంతో నకిలీ సిగరెట్లు పుట్టుకొచ్చాయి. నాసిరకం పొగాకుతో, రంపపు పొట్టుని కలిపేసి.. సిగరేట్లను తయారు చేసి మార్కెట్‌లోని బ్రాండెడ్‌ సిగరెట్స్‌ ప్యాకెట్ల‌ మాదిరిగా సిద్ధం చేసేస్తున్నారు. ఈ సిగరెట్లు మోస్ట్ డేంజరస్ అని వైద్యులు తెలుపుతున్నారు. బ్రాండెడ్‌ సిగరెట్లు తాగితేనే క్యాన్సర్, గుండెజబ్బులు సహా రకరకాల రోగాలొస్తాయి. అలాంటిది నకిలీ సిగరెట్లు తాగడం వల్ల.. పరిస్థితి మరింత ఘోరంగా ఉంటుంద‌ని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ క‌ల్తీ సిగ‌రెట్ల‌తో జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని వైద్యులంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement