Tuesday, November 26, 2024

మార్కెట్ ను ముంచెత్తుతున్న నకిలీ బ్రాండ్ కొబ్బరి నూనె , వంట నూనెలు..

అమరావతి, ఆంధ్రప్రభ: ప్రముఖ కంపెనీల పేరుతో నకిలీ ఉత్పత్తులు మార్కెట్‌లో చలామణి అవుతూ ప్రజల ఆరోగ్యానికి చేటు చేస్తున్నాయి. అంతేకాక ఆయా బ్రాండెడ్‌ల మాటున నాసిరకం అమ్మకాలతో వినియోగదారులను దోచుకోవడం జరుగుతోంది. ముఖ్యంగా ఆహార పదార్ధాలు, నిత్యవసరాలు వంటి వాటిలో నకిలీ, నాసిరకం రాజ్యమేలు తున్నాయి. ప్రధానంగా నూనెల విషయంలో నాణ్యమైన ఉత్పత్తులు, పేరు కలిగిన బ్రాండ్లకు నకిలీ తయారు చేసి పంపిణీ చేస్తున్న ఉత్పత్తిదారులు మార్కెట్‌లోని వ్యాపారుల ను, ప్రజలను మోసం చేస్తున్నారు. కొబ్బరి నూనె కొనే కస్టమర్లు మంచి బ్రాండ్స్‌ కోసం ప్రత్యేకంగా ఆరా తీసి మరీ కొనుగోలు చేస్తుండటం నకిలీలకు వరంగా మారింది. అదేవిధంగా వంటనూనెలు సైతం నాసిరకం, నకిలీ విక్రయా లు జరుగుతున్నట్లు తరచూ రాష్ట్రంలో కొనసాగుతున్న విజిలెన్స్‌ దాడుల్లో వెలుగు చూస్తోంది. కొబ్బరినూనె ఉత్పత్తుల్లో ప్రముఖ బ్రాండ్‌ ప్యారాచూట్‌ కంపెనీని అనుకరిస్తూ అచ్చం అలాగే తయారు చేసిన నకిలీ ప్యారాచూట్‌ ఉత్పత్తులు మార్కెట్‌లో చలామణి కావడాన్ని విజిలెన్స్‌ అధికారులు తాజాగా గుర్తించారు. ఒరిజినల్‌ ప్యారాచూట్‌ కొబ్బరినూనె బాటిల్‌ లాంటి మరో డూప్లికేట్‌ ప్యారాచూట్‌ కొబ్బరినూనె బాటిల్‌ తయారుచేసి అందులో తక్కువ రకం నకిలీ కొబ్బరినూనెను నింపుతున్నారు. ఇలా వేల కొద్దీ బాటిల్స్‌ తయారుచేసి మార్కెట్‌లో దుకాణాలకు సరఫరా చేసున్నారు. అయితే బాటిల్‌పైన మాత్రమే చూసి మోసపోతున్న వినియోగదారులు నకిలీ, అసలుకు తేడా తెలియక కొనుగోలు చేస్తున్నారు.

ఈ నకిలీ దందా వ్యవహారం పార్వతీపురం మన్యం జిల్లాలో వెలుగు చూసింది. వీటిపై తరచూ వస్తున్న ఫిర్యాదుల మేరకు దృష్టి సారించిన విజిలెన్స్‌ అధికారులు విచారణ చేపట్టారు. దీనిలో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లాలోని దుకాణాలపై దాడులు నిర్వహించారు. పార్వతీ పురం, సాలూరు పట్టణాల్లో స్థానికంగా పేరుగాంచిన కిరాణా షాపుల్లో ఉన్న వేలాది నకిలీ ప్యారాచూట్‌ బ్రాండ్‌ కొబ్బరి నూనె బాటిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇలా ఒక్క పార్వతీపురం మన్యం జిల్లాలోనే కాకుండా విజయనగరం చుట్టు ప్రక్కల జిల్లాలతోపాటు రాష్ట్రం లోని వివిధ చోట్లకు నకిలీ ప్యారాచూట్‌ కొబ్బరి నూనెలు సరఫరా అవుతున్నట్లు అనుమానిస్తున్నారు. కాగా పట్టుబడిన చోట షాపులపై కేసులు నమోదు చేశారు. అయితే నకిలీ కొబ్బరి నూనె అని తమకి తెలియదని, ప్యారాచూట్‌ బ్రాండ్‌ అని ఉండటం వల్ల తాము విక్రయించామని చెబుతున్న వ్యాపారులు నకిలీ నూనెల తయారీదారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దీంతో నకిలీ బ్రాండ్ల ఉత్పత్తులపై దృష్టి పెట్టిన అధికారులు దర్యాప్తు షురూ చేశారు.

నకిలీ నూనెల వల్ల నష్టాలు..
మార్కెట్‌లో లభించే నకిలీ కొబ్బరి నూనెలు, వంటనూనెల వల్ల ప్రజా రోగ్యానికి తీవ్ర నష్టం జరుగుతోందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. షాపుల్లో కొబ్బరినూనెలతోపాటు నకిలీ వంటనూనెలు కూడా లభిస్తున్నాయి. చాలామంది దుకాణదారులు లూజు విక్రయాలు చేస్తూ వాటిలో పలు రకాల మిగిలి పోయిన, కాలం చెల్లిన నూనెలను కలిపేసి లాభం కోసం విక్రయాలు కొనసాగిస్తున్నట్లు దాడుల్లో బయటపడుతోంది. అదేవిధంగా కొన్ని గానుగల్లో సైతం కుళ్ళిన, పాడైపోయిన కొబ్బరి కాయాలు, వేరుశనగ వంటి వాటితో తయారు చేసిన నూనెలు అనారోగ్య హేతువులుగా మారుతున్నాయని, అదేవిధంగా వినియోగ దారుని జేబుకు చిల్లు పెడుతున్నాయని స్పష్టమవుతోంది. నకిలీ కొబ్బరి నూనె వల్ల అనేక దుష్ప్రభావాలు ఉంటాయని, తలకు రాసుకుంటే జుట్టు- ఊడి పోయే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. నకిలీ కొబ్బరినూనె శరీరానికి రాసుకుంటే స్కిన్‌ డిసీజ్‌లు వచ్చే ప్రమాదం ఉందని, చిన్నారులపై మరింత ప్రభావం చూపుతుందని స్పష్టం చేస్తున్నారు. అదేవిధంగా వంట నూనెల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలని, రిఫైన్డ్‌ ఆయిల్‌ హానికరం అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వివిధ రసాయనాలు, సువాసనలతో నూనెలను స్వేదనం చేయడం ద్వారా అలాంటి నూనెలు ఆరోగ్యానికి హానికరమని, శుద్ధి చేసిన నూనెలు మధుమేహం, క్యాన్సర్‌ , గుండె జబ్బులు, జీర్ణ సమస్యలు వంటి దీర్ఘకాలిక రోగాలకు గురి చేస్తుందని, పోషక విలువలున్న నూనెలను మాత్రమే వాడాలని వైద్యులు సూచిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement