Saturday, November 23, 2024

మసకబారుతున్న నవరత్నాలు.. పథకాల ఊసే మరచిన నాయకులు

ఆంధ్రప్రభ వెబ్ ప్రతినిధి, సెంట్రల్ ఆంధ్ర : నవరత్నాలు… వీటి విలువ అమూల్యం. అందుకే కేంద్ర ప్రభుత్వం దేశానికే తలమానికంగా నిలిచిన 9 ప్రభుత్వ రంగ సంస్థలకు నవరత్న హోదా ఇచ్చి గౌరవిస్తున్నది. ఇప్పుడు అవే నవరత్నాలు రాష్ట్రంలో వైఎస్సార్సీపీ పార్టీ అధికార పీఠం అధిష్టించేందుకు సోపానాలుగా మారాయి. ఒక విధంగా చెప్పాలంటే నవరత్నాలు వైఎస్సార్సీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి కలల పంట. వైఎస్ ఆశయ సాధన కోసం జగన్మోహనరెడ్డి ఏర్పరచుకున్న 9 సోపానాలు. ఆ దృష్ట్యా నే వైఎస్సార్సీపీ లో నవరత్న పథకాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. వైఎస్సార్సీపీ శ్రేణులకు నవరత్నాలు అత్యంత పవిత్రమైన ఆభరణాలు. పార్టీ అధికారంలోకి వచ్చేందుకు దోహదపడిన నవరత్నాలకు ఎనలేని ప్రాధాన్యత వుంది. అయితే ఇదంతా నిన్నటి మాటగానే మిగిలిపోనున్నదా ? పార్టీ యంత్రాంగంలో నవరత్నాలు ప్రాధాన్యత తగ్గుతున్నదా ? అగ్రశ్రేణి నాయకత్వం, దిగువ స్థాయి కార్యకర్తలను మినహాయిస్తే మధ్యస్థంలో వున్న పార్టీ యంత్రాంగంలో వున్న వారికి నవరత్నాల గురించి అసలు తెలుసా ? తదితర సందేహాలు ఆ పార్టీ శ్రేణుల్లో తలెత్తుతున్నాయి.

గడపగడప కు నవరత్నాలు :
వైఎస్సార్సీపీ ప్రతిపక్షంలో వున్నప్పుడు గడపగడప కు వైసీపీ రెండు పర్యాయాలు నిర్వహించారు. ఆ కార్యక్రమాల్లో పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులతో పాటు క్షేత్రస్థాయిలో జెండా మోస్తున్న కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఇనుమడించిన ఉత్సాహంతో పాల్గొన్నారు. నవరత్న పథకాల గురించి ఎక్కడికక్కడ కరపత్రాలు పంచుతూ ఇంటింటికీ పంచి వివరించారు. ఆ ప్రచారం ప్రజలలోకి సమర్థంగా తీసుకెళ్లగలిగారు. 2019 ఎన్నికలలో ఆ ఫలితం స్పష్టంగా కనిపించింది. పార్టీ అధికారంలోకి రాగానే పరిస్థితులు అన్నీ ఒక్కసారిగా మారిపోయాయి. పార్టీ హామీలు అమలు చేయటంతో అవన్నీ ప్రభుత్వ కార్యక్రమాలుగా మారిపోయాయి. ముఖ్యమంత్రి హోదాలో పార్టీ అధినేత జగన్మోహనరెడ్డి సైతం నవరత్న పథకాల అమలుకు అధిక ప్రాధాన్యత నిచ్చి నిధుల కొరత రాకుండా బడ్జెట్ కేటాయింపులు జరిపారు. ఫించన్ పెంపు, అమ్మవడి, జగనన్న ఆసరా, జగనన్న చేయూత, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్, రైతు భరోసా, జలయజ్ఞం, మద్యనిషేధం, పేదలందరికీ ఇళ్లు వంటి కార్యక్రమాల అమలుకు పెద్ద ఎత్తున శ్రీకారం చుట్టారు. రాష్ట్రప్రభుత్వం ఆర్థికంగా ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న ప్పటికీ, నవరత్న పథకాల అమలుకు ఏవిధమైన ఆటంకం లేకుండా కొనసాగిస్తున్నారు.
ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో వుంచుకొని నవరత్నాల పేరుతో ఇచ్చిన ఎన్నికల హామీలను వైఎస్ జగన్మోహనరెడ్డి అమలు చేస్తున్నారు. అయితే జగన్ ఆకాంక్షలు సఫలీకృతం అవుతున్నాయా ? నవరత్న పథకాలతో లబ్దిదారులు సంతృప్తికరంగా వున్నారా అంటే అవును అని గుండెలమీద చేయి వేసుకొని చెప్పలేని పరిస్తితి. వేలకోట్ల రూపాయలు వ్యయం చేస్తున్నప్పటికీ ఆశించిన ఫలితం చేకూరటం లేదని దిగువ స్థాయిలో పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి.

స్వీయ ప్రయోజనాలకే పెద్దపీట :
రాష్ట్ర, జిల్లా స్థాయిలో నామినేటెడ్ పదవులు పొందిన, స్థానిక సంస్థలలో ఎన్నికయిన ప్రజాప్రతినిధులలో చాలామందికి ఈ నవరత్నాల పట్ల అవగాహన వున్న సూచనలు కానరావడం లేదు. ఆ పథకాలకు తమ పార్టీ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత, వాటి కారణంగా ఏయే వర్గాలకు ఏమేరకు లబ్ది చేకూరుతుంది ? వంటి అంశాల గురించి వివరించేందుకు జిల్లా స్థాయిలో నాయకులు శ్రద్ధ చూపటం లేదని ఆ పార్టీ కార్యకర్తలే ఆరోపిస్తున్నారు. ఏదైనా పథకం ప్రారంభించినప్పుడు ప్రభుత్వం ఇచ్చే ప్రకటనలలోనే నవరత్నాల ప్రస్తావన కానవస్తుంది. దిగువ స్థాయిలో చాలామంది నాయకులు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వ పథకాలు, పార్టీ విధానం వివరించే కంటే స్వీయ ప్రతిష్ట పెంచుకునేందుకే అధిక ప్రాధాన్యతనిస్తున్న వాతావరణం కానవస్తోంది. ప్రభుత్వం ప్రకటించిన పథకం, ఎన్నికల హామీలో పొందుపరచిన నవరత్న పథకాలలో భాగమేనన్న విషయాన్ని వివరించే వారే కరువయ్యారని పార్టీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. దీనివల్ల నవరత్న పథకాల ప్రయోజనాలను అట్టడుగు స్థాయి ప్రజల వరకు చేరాలన్న పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఆశయానికి విఘాతం కలిగే పరిస్తితి ఉత్పన్నం అవుతున్నది.
పార్టీలో నవరత్న పథకాలకు వున్న ప్రాధాన్యతను దృష్టిలో వుంచుకొని వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా యంత్రాంగాన్ని సమాయత్తం చేయాలన్న వాదన ఆ పార్టీ వర్గాల నుంచి వినవస్తోంది. గడపగడపకు వైసీపీ తరహాలోనే ఇంటింటికీ నవరత్నాలు పేరుతో మరో కార్యక్రమాన్ని తక్షణమే ప్రారంభించాలని వైఎస్సార్సీపీ శ్రేణులు కోరుకుంటున్నాయి. దీనివల్ల ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, వివిధ స్థాయిలలో నామినేటెడ్ పదవులు పొందిన నాయకులకు ప్రజలతో మమేకమ‌య్యే అవకాశం కలుగుతుందనేది వారి భావన.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement