పత్తికొండ (ప్రభ న్యూస్) : పత్తికొండలో ఫ్యాక్షన్ మళ్లి రాజుకుంటుందా..? అన్న అనుమానాలను పక్కన పడితే బాంబుల వ్యవహారం ప్రజల గుండెల్లో బాంబు పేల్చేసింది. పత్తికొండ పట్టణంలోని ఎరుకలి ఎల్లప్ప, సుంకన్నల ఇంటి వద్ద పోలీసులు శుక్రవారం 25 నాటు బాంబులు స్వాధీనం చేసుకోవడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. కొన్నిరోజుల కిందట వెలుగు కార్యాలయం సమీపంలోని పంట పొలంలో నాటుబాంబు పేలి మహిళకు చేతివేళ్లు ఛిద్రమైన సంగతి తెలిసిందే. దీంతో జిల్లా పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన ఫ్యాక్షన్ జోన్ పోలీసులు కేసు దర్యాప్తును వేగవంతం చేశారు. అప్పటికే ఆదుపులోకి తీసుకున్న నిందితులను పోలీసులు తమదైన శైలిలో విచారించగా వారి వద్ద 25 నాటుబాంబులు నిల్వ ఉంచినట్లు తెలుసుకుని వాటిని స్వాధీనం చేసుకున్నారు. దీంతో చుట్టుపక్కల కాలనీవాసులు ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పోలీసులు నిందితుల పేర్లు గోప్యంగా ఉంచే ప్రయత్నం చేశారు. కనీసం వివరాలను వెల్లడించేందుక తాత్సారం చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది.
అయితే ఇంటలిజెన్స్ వర్గాల ద్వారా అప్పటికే జిల్లా అంతటా బాంబు వార్త వ్యాపించింది. పలు టీవీ ఛానల్స్ లో ప్రసారం కావడంతో అస్పష్టమైన సమాచారంతో పోలీసు అధికారులు దాటవేశారు. అడవిపందుల వేటకోసం తెచ్చిన పేలుడు పదార్థంగా బాంబులు తెచ్చారా లేకా ఎవరినైనా హతమార్చేందుకు కుట్ర జరుగుతుందా అన్న కోణంలో కూడా దర్యాప్తు సాగాల్సిన అవసరం ఉంది. అత్యంత కీలకమైన పేలిన నాటుబాంబు, నిల్వ ఉన్న బాంబుల సూత్రదారులు, పాత్రధారులపై పోలీసు శాఖ సమగ్ర దర్యాప్తు చేయాల్సి ఉంది. దర్యాప్తులో తేలిన వివరాలను క్షుణ్ణంగా మీడియాకు తెలియజేయాల్సిన బాధ్యత పోలీసు అధికారులపై ఉంది. అయితే నాన్చుడు ధోరణితో మీడియాకు పోలీసు అధికారులు సమాచారం ఇవ్వలేదు. అంతేకాకుండా పలు కీలక కేసుల్లో కూడా పోలీసులు మీడియాకు సమాచారం చేరవేయడంలో దూరంగానే ఉంటున్నారు. కొందరు మీడియా ప్రతినిధులు సమాచారం అడిగినా అస్పష్టంగా దాటవేస్తున్నారు. దీంతో అధికార పార్టీ నాయకుల నుంచి ఏమైనా ఒత్తిళ్లు ఉన్నాయా అన్న సందేహం సర్వత్రా కలుగుతోంది. అయితే ఇంత భారీగా నాటుబాంబులు లభ్యం కావడం వెనుక ఎవరి హస్తం ఉంటుందన్న చర్చ పత్తికొండలో జోరుగా సాగుతుంది. అయితే ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు స్పందించి నాటుబాంబుల తయారీదారులెవరు, ఎక్కడికెక్కడికి ఎలా, సప్లయి జరుతుంది. బాంబులు ఎవరికోసం తెచ్చారో అన్న విషయాలను సమగ్రంగా దర్యాప్తు చేసి వివరాలను ప్రజలకు తెలియజేసి శాంతిభద్రతల పరిరక్షణకు పాటుపడాలని ప్రజలు కోరుతున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..