ప్యాపిలి, (ప్రభ న్యూస్): ప్రశాంతంగా ఉన్న ప్యాపిలి పట్టణం ఒక్కసారిగా వేడెక్కింది. పాత కక్ష్యలు. వర్గపోరుతో ఒక్కసారిగా పట్టణంలోని ప్రజలను భయబ్రాంతులకు గురిచేసింది. శనివారం సాయంత్రం పట్టణంలోని బిసి కాలనీలో జరిగిన ఘర్షణలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడగా, అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది
.బిసి కాలనీకి చెందిన పేట బలరాముడు, పుల్లెం కమలాకర్ల మధ్య గత నాలుగు నెలల క్రితం పొలం ప్రక్కనే ఉన్న బోరు విషయంలో ఘర్షణ చోటుచేసుకుంది. అప్పట్లో ఈ విషయంపై ఇరువర్గాలు స్థానిక పోలీసు స్టేషన్ కు చేరుకోగా, పోలీసులు, నాయకులు పెద్దమనుషుల మధ్యవర్తిత్వంతో అప్పటికి సమస్య సద్దుమనిగి ఇరు వర్గాలు రాజీ పడ్డాయి.
అప్పటి నుండి ప్రశాంతంగా ఉన్న వారు శనివారం సాయంత్రం బిసి కాలనీలో రోడ్డుపై వెళ్తున్న బలరాముడు, తనకు ఎదురుగా వస్తున్న కమలాకర్ ద్విచక్ర వాహనంపై వేగంగా రావడంతో తిరిగి ఇద్దరి మధ్య వాగ్వావాదం చోటుచేసుకుంది.అక్కడే ఉన్న కొందరు సర్దిచెప్పి ఇద్దరిని ఇంటికి పంపారు.
అయితే ఇంటికి వెళ్లిన తర్వాత కమలాకర్ అంతటితో ఆగకుండా ఇద్దరు ఆడవారితో పాటు మరో నలుగురిని తన వెంట తీసుకొని పేట బలరాముడు ఇంటిపైకి దాడికి దిగారు. బలరాముడు కొడుకు పేట పులిశేఖర్(28)పై వేటకొడవళ్లు. పిడిబాకులతో విచక్షణారహితంగా దాడిచేశారు. అడ్డువచ్చిన బలరాముడు, రంగమ్మకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. పులిశేఖర్ కాలు నరకడంతో పాటు కడుపులో పొడవడంతో తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గాయపడ్డ బలరాముడు, రంగమ్మ, తీవ్రగాయాలైన పులి శేఖర్ ను కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇందులో పులిశేఖర్ పరిస్థితి విషమంగా ఉంది.