Saturday, November 23, 2024

సింగల్‌ టీచర్లకు విషమ పరీక్షగా మారిన ఎఫ్‌ఏ వన్‌ పరీక్ష.. ఒక్క రోజులోనే పది పేపర్ల పరీక్ష నిర్వహణ

అమరావతి,ఆంధ్రప్రభ: విద్యార్ధుల నాణ్యతా ప్రమాణాలను పరీక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని పాఠశాలల్లో ఫార్మెటీవ్‌ అసెస్మెంట్‌ పరీక్షలు ప్రతి ఏడాది నిర్వహిస్తూ ఉంటుంది. ఈ ఏడాది రేపటి నుండి మూడు రోజుల పాటు ఈ పరీక్షలను నిర్వహించనుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 15 వేల సింగిల్‌ టీచర్ల స్కూళ్లలో ఈ పరీక్షల నిర్వహణ అక్కడి ఉపాధ్యాయుడికి విషమ పరీక్షగా మారింది. నూతన విద్యా విధానంలో భాగంగా కిలో మీటర్‌లోపు ఉన్న స్కూళ్లలో మూడు,నాలుగు,ఐదు తరగతులను పక్కనే ఉన్న హైస్కూల్‌లో కలిపేశారు. మిగిలిన చోట్ల ప్రాధమిక పాఠశాలల్లో ఐదో తరగతి వరకు పాఠశాలలు కొనసాగుతున్నాయి. అయితే సింగిల్‌ టీచర్లు ఒకటి, రెండు తరగతులు ఉన్న స్కూళ్లలోనే కాక ఐదో తరగతి వరకు ఉన్న స్కూళ్లలోనూ ఉన్నారు. అంటే ఆ స్కూల్‌ మొత్తానికి ఒకరే టీచర్‌ ఉంటారు. ఐదు తరగతులకు అతనే బోధన చేయాల్సి ఉంటుంది. ఇప్పుుడు ఈ స్కూళ్లలో ఎఫ్‌ఏ వన్‌ ఎగ్జామ్‌ నిర్వహించడం సింగిల్‌ టీచర్లకు తలకు మించిన భారంగా మారింది. ఉదయం రెండు క్లాసులకు, మధ్యాహ్నం మూడు క్లాసులకు రోజుకు రెండు పేపర్లు చొప్పున పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. అందులోనూ గంట ముందు ప్రశ్నాపత్రాన్ని టీచర్‌కు వాట్సాప్‌లో పంపించేస్తారు.

వాట్సాప్‌లో వచ్చిన ప్రశ్నాపత్రాన్ని బోర్డు మీద టీచర్‌ రాయాల్సి ఉంటుంది. వాటిని పిల్లలు పేపర్ల మీద ఎక్కించుకొని పరీక్ష పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒక్కొ క్లాసుకు రోజుకు రెండు పేపర్లు ఉండడంతో రోజుకు పది పేపర్లు టీచర్‌ బోర్డు మీద రాయాల్సి ఉంది. దీన్ని పిల్లలు ఎక్కించుకొని గంట సేపట్లో పరీక్ష పూర్తి చేయించాలి. ఆచరణలో ఇది సాధ్యం కాని పని అని టీచర్లు వాపోతున్నారు. ఒక్కొ పేపరు బోర్డు పైన రాయడానికే అరగంట సమయం పడుతుందుని, అంటువంటిది పది పేపర్లు రోజుకు బోర్డు పైన రాయడమంటే సాధ్యమయ్యే పనికాదని, టీచర్‌ చాలా ఒత్తిడికి గురికావాల్సి ఉంటుందని అంటున్నారు. వీటికి తోడు పిల్లలు సమయంలోపు పరీక్ష పూర్తయ్యేలా చూడడం కూడా కష్టమైన పనిగా మారుతుందని అంటున్నారు. ఈ పనికి తోడు ప్రతిరోజు చేయాల్సిన బోధేనతర విధులు ఎలా పూర్తి చేయాలని ప్రశ్నిస్తున్నారు.

భారంగా మారిన బోధనేతర పనులు

- Advertisement -

ఈ పరీక్షల నిర్వహణకు తోడు ప్రతిరోజూ చేయాల్సిన బోధనేతర విధులు కూడా ఉన్నాయి. ఒక్కరే టీచర్‌ ఉండడంతో ప్రతిరోజూ ఈ విధులు భారంగా మారుతున్నాయి. ఇక పరీక్షల సమయంలో మరింత భారం కానున్నాయి. ఉదయం తొమ్మిదన్నరలోపు పిల్లల హాజరును యాప్‌లలో ఎక్కించాలి. ఆ తర్వాత మిడ్డే మీల్‌కు బియ్యాన్ని కొలిచి ఇవ్వాలి. ఆ తర్వాత కొడిగుడ్లు లెక్కపెట్టి ఇవ్వాలి. వీటిని మరలా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలి. ఆ తర్వాత బాత్రూం ఫోటో తీసి అప్‌లోడ్‌ చేయాలి. 12 గంటల సమయంలో మెనునూ ఫోటో తీసి అప్‌లోడ్‌ చేయాలి. ఈ బోధనేతర పనులు చేయడానికి సమయమంతా సరిపోతుంటే ప్రతిరోజూ పాఠాలు చెప్పడానికి ఉపాధ్యాయులకు సమయం ఉండడం లేదు. ఇప్పడు పరీక్షల సమయంలో ఇది మరింత భారం కానుంది.

రోజుకు ఒక పరీక్షే నిర్వహించాలి

సింగిల్‌ టీచర్ల సమస్యలను దృష్టిలో పెట్టుకొని పరీక్షల షెడ్యూల్‌ను మార్చాలని ఆంధ్రప్రదేశ్‌ టీచర్స్‌ గిల్డ్‌ ప్రతినిధి ప్రభాకర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. రోజుకు ఒక పరీక్షే నిర్వహిస్తే కొంతలో కొంత భారం తగ్గుతుందని అన్నారు. దీంతోపాటు చాలా పాఠశాలల్లో అదనంగా ఉన్న టీచర్లను ఈ సింగిల్‌ టీచర్‌ స్కూల్లలోకి బదిలీ చేయాలని కోరారు. ఎయిడెడ్‌ పాఠశాలల్లోనే రెండు వేల మంది టీచర్లు అదనంగా ఉన్నారని, వారిని బదిలీ చేస్తే సమస్య కొంతమేరుకు పరిష్కారమౌతుందన్నారు. దీంతోపాటు ఒకటి, రెండు తరగతుల వరకు ఉన్న స్కూళ్లల్లోకి అంగన్‌ వాడీలను కలిపిస్తే ఈ సింగిల్‌ టీచర్‌కు కొంత మేరుకు బోధనేతర విధుల భారం తగ్గుతుందని ఉపాధ్యాయ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement